పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34. ఈ సంవత్సరంలో 33 శాతం వర్షపాత లోటు ఉన్నప్పటికీ, సమర్థవంతమైన కరువు నివారణ చర్యలు వ్యవసాయ రంగాన్ని 15 శాతం వృద్ధి బాటన నడిపించాయి. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించటంతోపాటు వారి వ్యాకుల వలసలను ఈ చర్యలు నివారించాయి.

35. గత నాలుగున్నర సంవత్సరాలలో 81,554 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించడం, వ్యవసాయాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్దను సూచిస్తుంది. దీని ప్రభావం ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదగడానికి తోడ్పడింది. ఉత్పాదకతలో కూడా 2014-15 నుండి ప్రతి సంవత్సరంలో ప్రగతి సాధిస్తున్నాము. మొక్క జొన్న (6,612 కేజీ/హెక్టార్), జొన్న (2,041 కేజీ/హెక్టార్) ఉత్పాదకత సాధించి మొదటి స్థానంలో, వరి (3,540 కేజీ/హెక్టార్) సాధించి రెండవ స్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి 50 శాతం పెరిగి 138.25 లక్షల మెట్రిక్ టన్నులు, మాంస ఉత్పత్తి 45 శాతం పెరిగి 7.08 లక్షల మెట్రిక్ టన్నులు, గుడ్ల ఉత్పత్తి 36 శాతం పెరిగి 1,778 కోట్లకు చేరాయి. సగటున అన్ని రంగాల వృద్ధిరేటు 33.5 శాతంగా ఉన్న మన రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఎదిగింది. చేపల పెంపకం మరియు ఆదాయంలో మొదటి స్థానానికి చేరుకోవటంలో మా ప్రభుత్వం తోడ్పాడందించింది.

యువజన సాధికారత

36. ప్రప్రధమంగా 'యువజన విధానం’ ప్రకటించడం ద్వారా మా ప్రభుత్వానికి యువజన సంక్షేమంపై ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. విద్యావంతులైన ప్రతి యువత గౌరవ ప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రిగారి గట్టి నమ్మకం. ఈ ఉద్దేశ్యానికి అనుగుణంగా, మా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి 'యువనేస్తం' పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది.

37. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం క్రింద 4.3 లక్షల మందికి లబ్దిని మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని, ఒక స్థిరీకరణ పద్దతిలో అమలు చేయాలని భావిస్తున్నాము. నిరుద్యోగ భృతిని అందించడంతోపాటు, నిరుద్యోగ యువతను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో మరియు ఏకీకృత విధానంలో యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక, నైపుణ్యాభివృద్ధి వంటి వివిధ విభాగాలలో ఒక స్థిరమైన ప్రాతిపదికన లాభదాయక ఉపాధిని పొందేందుకు ఈ పథకం దోహదపడుతుంది.

38. SIEMENS సహకారంతో ఒక లక్షమందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం గల మొత్తు 40 కేంద్రాలను స్థాపించి ఇప్పటివరకు 84,852 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఉపాధి-ఆధారిత నైపుణ్యాలను అందించడానికి Google, Amazon వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో మా ప్రభుత్వం కలిసి పని చేసింది. పరిశ్రమలతో సన్నిహిత సహకారం కొనసాగించడం ద్వారా వివిధ పరిశ్రమల సంఘాలనుండి ప్రశంసలు అందుకొంటూ CII చే ఉపాధికల్పనలో నెం.1 రాష్ట్రంగా మన రాష్ట్రం గుర్తింపబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటివరకు 8.66 లక్షల యువత శిక్షణ పొందారు.

8