పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ సమర్పిస్తూ 5 ఫిబ్రవరి, 2019న గౌరవనీయ ఆర్థికశాఖామాత్యులు శ్రీ యనమల రామకృష్ణుడుగారు చేసిన ప్రసంగం

గౌరవనీయ అధ్యక్షా! మరియు సభ్యులారా!

తమ అనుమతితో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలు ఈ గౌరవ సభకు సమర్పిస్తున్నాను.

2. నా పదకొండవ బడ్జెట్‌ను, చారిత్రాత్మకమైన అమరావతిలో, వరుసగా మూడవసారి సమర్పించే అవకాశం రావడం గర్వకారణం.

3. అధ్యక్షా! బడ్జెట్ ప్రతిపాదనలను వివరించటానికి ముందుగా జూన్ 2014లో మనం క్రొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు జరిగిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ళను, వాటిని అధిగమించిన తీరును మననం చేసుకోవడం, ముఖ్యాంశం. హేతుబద్దత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాజధాని నగరాన్ని కోల్పోవడం, సరియైన పద్దతిలో ఆదాయ-వ్యయాలను, ఆస్తులు-అప్పులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు ఆవరించాయి.

4. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో, అపారమైన పరిపాలన అనుభవం; జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి; అనేక సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనే శక్తి, నూతన రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగల సత్తా మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికే ఉందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజానీకం యావత్తూ ఆయనపై తమ ఆశలను, నమ్మకాన్ని ఉంచారు.

5. ఇప్పటివరకు మనం సాధించిన పురోగతిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక మనుగడపై భయాందోళనలు ఉన్నాయి. కనీసం ఉద్యోగుల జీతాలను, సాధారణ ఖర్చులను కూడా చెల్లించలేరన్న అనుమానాలు అనేక మందిలో ఉండేవి.

6. ఆప్పటి పరిస్థితుల్లో:

  • దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి, వరుసగా మూడేళ్ళు రెండంకెల వృద్ధిని సాధించగలదని ఊహించామా?
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రగామి రాష్ట్రంగా ఉంటూ, విదేశీ పారిశ్రామికపెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంటామని అప్పట్లో అంచనా వేశామా!