పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిశ్రమలు మరియు సేవలు

92. రాష్ట్రంలో ఉపాధి కల్పనాభివృద్ధిలో పారిశ్రామిక, సేవారంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. దీనిలో భాగంగా ఉద్యోగిత సాంద్రతకు అవకాశమున్న వస్త్ర పరిశ్రమ, ప్రాథమిక ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు మరియు పర్యాటక రంగాలలో అభివృద్ధిపై మా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది

93. ఏకగవాక్ష విధానము ద్వారా మేము ఉత్తమమైన సరళీకరణ విధానమును రూపొందించి ఏడు రోజుల సగటుతో అన్ని అనుమతులు మంజూరు చేయుచున్నాము. ప్రపంచ బ్యాంక్ మరియు 'లీ కున్ యా' పబ్లిక్ పాలసీ స్కూలు లాంటి సంస్థలు ఉత్తమ వ్యాపార అనుగుణమైన రాష్ట్రంగా గుర్తింపునిచ్చాయి. ప్రపంచ ఉత్తమ ర్యాంక్ లలో ఉత్తమమైనదిగా సమీప భవిష్యత్తులో మన రాష్ట్రం రూపొందుతుంది.

94. 33.3 లక్షల మందికి ఉద్యోగ కల్పనకు 18 శాఖలలోని 2,633 ప్రాజెక్టులకు రూ.15.77 లక్షల కోట్ల MOUలు ఈ మధ్య కాలములో సంతకము చేయుట జరిగింది. MOUలు పూర్తి స్థాయిలో అమలులో సుమారు 40 శాతం పెట్టుబడుల కార్యాచరణతో మన రాష్ట్రం దేశములో ముందున్నదని గౌరవ శాసన సభ్యులకు తెలియజేయుటకు సంతోషిస్తున్నాను, 820 పెద్ద మరియు మెగా ప్రాజెక్టులు 1.82 లక్షల కోట్లతో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించి 2.8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అలాగే 5.27 లక్షల కోట్లతో 7.66 లక్షల మందికి ఉపాధి కల్పించు 1,211 ప్రాజెక్టులు సివిల్ వర్కులు తదనంతర దశలో ఉన్నాయి.

95. ప్రభుత్వము అవలంబించుచున్న సానుకూల విధానాలవల్ల ప్రఖ్యాతి గాంచిన కియా మోటార్స్, ఇసుజు, హీరో గ్రూప్, పెప్సికో, మాండలీజ్ (క్యాడ్బరీస్) జైన్ ఇరిగేషన్, అరవింద్ మిల్స్, షాహి ఎక్స్ పోర్స్, జాకీ మొదలైన సంస్థలు వారి కార్యకలాపాలు మన రాష్ట్రంలో నెలకొలుపుటకు ఉత్సాహము చూపిస్తున్నాయి.

96. మా ప్రభుత్వం ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడి పథకం ద్వారా ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్స్ అండ్ పేపర్ ద్వారా ప్రకాశం జిల్లాలో 24,500 కోట్ల రూపాయల మేర పెట్టుబడికి అంగీకారం కుదుర్చుకుంది. దీనివల్ల 4,000 ఉద్యోగాలు నేరుగా, 12,000 ఇతరంగా కలుగుతాయి. అలాగే హల్దియా పెట్రో కెమికల్ తో 62,714 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ప్రయత్నిస్తున్నాము.

97. భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధి కొరకు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ను (VCIC) మరియు చెన్నై బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ (CBIC) పునాదులు వేస్తున్నాము.

98. MSME సెక్టారు ద్వారా ఒక పెద్ద మెగా పెట్టుబడి సంస్థ కన్నా 10 రెట్లు అధికంగా ఉపాధి కల్పిస్తున్నాము. దీనివల్ల ఆదాయ కల్పనలో, ఉపాధికల్పనలో MSME సంస్థల పాత్ర ముఖ్యమైనదిగా మా ప్రభుత్వం భావిస్తుంది. పోటీ వాతావరణమును సృష్టించి 1,816 కోట్ల రూపాయలు విలువైన ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగినది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్కులను స్థాపిస్తున్నాము. 7,246 ప్లాట్లలో 31 పార్కులు ఇప్పటికే ఏర్పాటు చేయడమైనది.

18