పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవత్సరమునకు 10,032 కోట్ల రూపాయలకు పెంచుతున్నాము. ఇది క్రితం సంవత్సరముతో పోలిస్తే 18.53 శాతం అధికం.

88. విద్య: విద్యారంగంలో మధ్యాహ్న భోజన పథకంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలను చేర్చడం, బడికొస్తా, మన ఊరు-మన బడి, బడి పిలుస్తుంది వంటి పథకాలతో పాటు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇ-హాజర్ కార్యక్రమాలను మేళవించి విద్యానాణ్యత పెంచడంతో పాటు, సర్వ శిక్ష అభియాన్ యొక్క ఫలితాలను మెరుగు పరచడానికి బడిలో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు, వారు బడి మానకుండా చూడడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.

89. ప్రాథమిక విద్యతో బడిలో చేరే విద్యార్థుల నిష్పత్తి 86 శాతానికి చేరుకోగా, ప్రాథమికోన్నత విద్యలో ఈ నిష్పత్తి 84 శాతానికి చేరుకుంది. మా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం క్రింద 45,505 పాఠశాలల్లో చదువుతున్న 33,72,372 మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఈ పథకం క్రింద 2018-19 సంవత్సరంలో కేవలం పాఠశాలల్లోనే కాకుండా 450 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కాలేజీలలోని 1.75 లక్షల విద్యార్థులకు కూడా ఆహారాన్ని అందించడం జరిగింది. విద్యార్థులకు పోషకాహారం అందించడంవలన వారి గ్రాహ్యశక్తి పెరగడమే కాకుండా, మధ్యంతరంగా బడిమానేసే విద్యార్థుల సంఖ్య తగ్గడం వంటి మంచి ఫలితాలను దృష్టి ఉంచుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాల విద్యకు, పాలిటెక్నిక్ కాలేజీ విద్యకు కూడా విస్తరించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారంలో మాంసకృత్తుల విలువలను పెంచుతున్నాము.

90. ఉన్నత విద్య: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల నాణ్యతను పెంపొందించడంతో పాటు, నూతన విశ్వవిద్యాలయాల స్థాపనకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడంపై మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్య ఫలితంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా సంస్థలలో గుర్తింపబడిన 100లో 6 విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోనివే. ఆంధ్ర మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయిలో మొదటి 50 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. నూతన విశ్వవిద్యాలయాలలో మౌలిక సౌకర్యాల స్థాపనకు ఒక్కొక్క నూతన విశ్వవిద్యాలయానికి 40 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాము. రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీని ఫలితంగా 11 విశ్వ విద్యాలయాలు రాష్ట్రంలో తమ విద్యా సంస్థల స్థాపనకు ముందుకు వచ్చాయి. రాబోయే 10 సంవత్సరాలలో 1,72,982 విద్యార్థులతో 11,360 కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి తీసుకురాగలదని అంచనా వేయడమైనది.

91. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మానవ వనరుల విభాగానికి 29,955 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. మొత్తం బడ్జెట్లో ఈ కేటాయింపు సుమారు 11.5 శాతంగా వుంది.

11