పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

అష్టాంగయోగసారము

నిత్యతృప్తిం జెందియుండుట ధ్యానం బగు. అంతర్బాహ్యప్రకాశం బేకంబుగా స్వతేజోమయంబుఁగాఁ బరతత్త్వంబు నుద్దేశించి తదీయధారణంబుఁ జేయుచుఁ జిత్తంబును జరిగిపోనీక నిలుపుటే ధారణం బగు. తద్ధారణాభ్యాసంబునఁ జిత్తం బేకాగ్రం బగు, నప్పుడు జీవాత్మ పరమాత్మయందు జలశర్కరన్యాయంబుగా గలసి యఖండబోధనొందుటే సమాధియగు, నిట్టి సూక్షాష్టాంగంబులఁ బ్రకాశించు నా రాజయోగంబునకు లక్షణంబు సంక్షేపంబుగాఁ దెల్పెద నెట్లనిన, హంసాక్షర, సిద్ధాసన కేవలకుంభక నాదంబులను నీ నాల్గింటి వలన రాజయోగం బొప్పు, నందు సాంఖ్యతారకామనస్కంబులనం ద్రివిధంబై యుండు, నందు సాంఖ్యం బెట్టి దనిన,

సాంఖ్యయోగము

సీ. పంచతన్మాత్రలు పంచభూతంబులు
        పంచీకృతంబులై ప్రబలుచున్న
    సకలేంద్రియంబులు సర్వవిషయజాల
        ములు గుణత్రయ కామముఖ వికార
    ములుగాను తనువులు మూఁడునుగా నవ
        స్థలు గాను తన నన్ని తలఁచి యెఱుఁగు
    నటువంటి యెఱుక నే నని నిశ్చయించి వి
        క్షేపావరణములఁ జిదిమి వైచి
గీ. తాను దనలోనె తను దాను తఱచి తఱచి
    యన్నిటికి మీఁద శేషించి యచలవృత్తి
    నుండు టది సాంఖ్యయోగమై యొప్పుచుండు
    గురుముఖంబున నియ్యోగ మెఱుఁగవలయు.

వ. ఇవ్విధంబున సాంఖ్యం బెఱింగి తారకం బభ్యసింపవలయు, నదెట్లనిన,