పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

అష్టాంగయోగసారము

నరుదుగఁ జేసిన నాదము
    కరణిని రేచింపవలయుఁ గ్రమముగ నెపుడున్.
క. ఈరీతి నభ్యసించిన
    వారల కానందమూర్ఛ వరచిత్తమునన్
    దారూఢిగ జనియించును
    గౌరవమగు నిదియె భ్రమరికాకుంభకమౌ.
    వ. ఇంక మూర్ఛాకుంభకంబుఁ జెప్పెద నెట్లనిన.

మూర్ఛాకుంభకము

గీ. రహిని పూరించి జాలంధరంబు నొనరఁ
    బెట్టి యుండగ సద్బోధ పుట్టి లోన
    నిలిచి జీవుని జొక్కించి నిండుచుండు
    నది మనోమూర్ఛ యను కుంభకాఖ్య నొందు.
    వ. ఇంక కేవలకుంభకంబుఁ జెప్పెద నెట్లలిన

కేవలకుంభకము

వ. రేచకపూరకకుంభకంబులు విడిచి స్వభావంబుగా మారుతధారణంబుఁ జేసి నిజబోధానందమగ్నుఁడై చొక్కియున్న నది కేవలకుంభకంబగు, నిట్టి కుంభకం బభ్యసించి సిద్ధుఁడైనవానికిఁ ద్రిలోకంబులందు దుర్లభంబై న కార్యంబు లేదు. సర్వస్వతంత్రుఁడై యుండు నిట్టి హఠయోగంబు యమనియమాసన ప్రాణాయామాద్యష్టాంగయోగ త్రిబంధాష్టకుంభక ముద్రాదిసాధనంబులచేత నియ్యోగంబు ద్వాదశాబ్దంబు లభ్యసింప సిద్ధియగు నది యెట్లనిన.

ప్రథమాబ్దంబునందు రోగరహితుం డగు. ద్వితీయాబ్దంబునందు గవిత్వంబుఁ జెప్పు. తృతీయాబ్దంబున విషజయుం డగును. చతుర్ధాబ్దంబున క్షుత్తృష్ణానిద్రాలస్యంబుల జయించు. పంచమాబ్దంబున వాక్సిద్ధినొందు.