పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాంగయోగసారము

23

చుబుకంబు రొమ్ము నొత్తిన నది జాలంధరబంధమగు, మూలం బాకుంచనంబై నప్పు డపానవాయు వెగయునంతలో హృదయమందున్న ప్రాణంబు దిగి నాభియం దపానుని గలియు నప్పుడు కుంచితంబైన నాభిని వెనుక కొత్తిన, ప్రాణాపానంబులు కలసి వెన్నంటి పోవునంతలో కంఠనికుంచనం బణఁచిన యమ్మారుతమం దడ్డంబైన కుండలిం బడనూకి మధ్యబిలంబులో జొరంబడి చిన్మయత్వంబు నొందు, నప్పు డంతరాకాశంబు నిశ్శబ్దంబగు. కంఠముద్ర పవనంబు నాని నిల్వగా సర్వపరిపూర్ణభావన సిద్ధించు, నీ ప్రకారంబుగా నాకుంచితకంఠనిరోధం బొదవినప్పు డమృతం బగ్నిలోఁ బడక స్వానుభూతికి లోకువై ప్రాణిని నిశ్చలానందంబు నొందించు, నదియునుం గాక.

సూర్యభేదనకుంభకము

సీ. వరయోగి యగువాఁడు వజ్రాసనమునుండి
        నయమొప్పగా వామనాడిచేత
    నాలోనఁ గుంభించినట్టి మారుతమును
        మెల్లనె విడచి యామీఁద మఱల
    దక్షిణనాడిచేతను వెలుపలివాయు
        వును మెల్లనే లోని కొనరఁదీసి
    యప్పుడు కేశనఖాగ్రపర్యంతంబు
        నరికట్టి కుంభకం బచటఁ జేసి
గీ. వామనాడిన విడువ నవ్వలఁ గపాల
    శోధనంబగుఁ గ్రిమివాతబాధ లణఁగుఁ
    గొమ్మ! యిది సూర్యభేదనకుంభకంబు
    గోరి విను మింక నుజ్ఝాయి కుంభకంబు.