పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాంగయోగసారము

21

వాతపిత్తశ్లేష్మములవలనఁ బుట్టిన సమస్తవ్యాధులును బోవును. సప్తధాతుచక్షురాదీంద్రియాంతఃకరణప్రసన్నతయు, శాంతియు, క్షుత్తును గలిగి సర్వదోషభయములను బోగొట్టును. ఇంక నేతికర్మం బెట్లన్నను.

నేతికర్మము

జేనెడు పొడువుసూత్రము మలినములేని నేతిలోఁ దడిపి ముక్కుగోళములచేఁ బీల్చి నోట వెడలదీయగా నిది నేతికర్మం బగు. దీనివలన కఫశోధనమై దివ్యదృష్టి గలుగును. ఇంక త్రాటక కర్మం బెట్టిదనిన.

త్రాటకకర్మము

కదలనిచూపుచేత సూక్ష్మమైన గురిని నేకాగ్రచిత్తముగలవాడై కన్నీరు పొడముడనుక చూడగా నది త్రాటకకర్మంబగును. దీనివలన నేత్రరోగములు పోవును. ఇది బంగారుపెట్టెవలె గోప్యముచేయఁదగినది. ఇంక నౌళికర్మం బెట్టిదనిన.

నౌళికర్మము

తీవ్రమైన వేగముతో కడుపును కుడియెడమలుగా త్రిప్పగా నది నాళికర్మంబగు. దీని వలన కడుపులో నగ్నిమాంద్యము పోయి దీపనము గలిగి పాచనాదులు చక్కగా నేర్పడి యానందము కలుగును. సమస్తదోషరోగములను బోగొట్టును. ఇది హఠయోగమున కెల్ల శ్రేష్టమై యుండు. ఇంక కపాలభాతికర్మం బెట్టిదనిన.

కపాలభాతికర్మము

లోహకారకుఁడు కొలిమితిత్తు లూదినట్లు రేచకపూరకంబులు చేయగా నది కపాలభాతికర్మం బగు. దీనివలన కఫదోషము లన్నియుఁ బోవును.