పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

అష్టాంగయోగసారము

దైవతంబై విష్ణుని వకారయుక్తంబైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింప సలిలజయంబు గలుగు. నాభ్యాదిహృదయపర్యంతం బగ్నితత్త్వంబగు, తదధిదైవతంబయిన రుద్రుని రవర్ణయుక్తమైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింప నగ్నిజయంబు గలుగు. హృదయాదికంఠపర్యంతంబు వాయుతత్త్వం బగు. తవధిదైవతం బైన మహేశ్వరుని యకారయుక్తంబైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింప పవనజయంబు గలుగు. కంఠాదిబ్రహ్మరంధ్రపర్యంతం బాకాశతత్త్వం బగు. తదధి దైవతంబైన బిందుమయగగనశరీరుండైన సదాశివుని హకారయుక్తంబైన ప్రాణపవనధారణాభ్యాసంబున ధ్యానింపఁ దన్మయత్వంబును గగనజయంబును గలుగు. ఇట్లు ధారుణియు, వారుణియు, నాగ్నియు, మారుతియు, వ్యోమియు నన పంచధారణాధ్యానాభ్యాసంబునఁ బంచభూతజయంబు గలుగు. ఇవ్విధంబున.

గీ. ధ్యాన మభ్యాస మొనరింప తలఁగ కపుడు
    మానసము నిల్చు మది నూని మతియు నిల్చు
    బుద్ధి నిలిచిన నానందపూర్తిగలుగు
    నదియె ధారణ యండ్రు యోగాఢ్యు లవని.
    ఇది ధారణాయోగంబగు నింక సమాధి యెట్లనిన.

సమాధి

ఆసనజయంబునను గుంభకసిద్ధిచేతనున్ను నిర్మలంబైన జ్ఞానభానుప్రకాశంబుచేత మాయాంధకారంబు నడంచి ప్రకాశించు మానసంబు నాత్మాకాశంబునందుఁ గూర్చి తన్మయత్వంబు నొంది శాంతవర్తనుండై సంయోగవియోగ సుఖదుఃఖంబుల మఱచి బ్రహ్మపదప్రాప్తభావన నిశ్చలానందభరితంబైన స్వానుభవబోధంబె సమాధియగు. ఇయ్యష్టాంగయోగాభ్యాసంబుఁ జేయువారి కీసమాధియే ఫలితార్థంబగు, నట్టివారు