పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యక్లిష్టత గాని, శబ్దకాఠిన్యము కాని కానంబడవు. కావ్య మంతయు, నింపు సొంపులతోఁ గులుకుచున్నది. ఈ క్రింది పద్యముల మురువంపుహరువుం దిలకింపుఁడు.

శా. వేణుక్రౌంచమృదంగదుందుభిలసద్వేవేద్రనాగోల్లస
    ద్వీణావారిద మంజునాదములకున్ వియ్యంబులై యొప్పుని
    క్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిం గల్యాణముల్ కంపనా
    క్షోణీపాలక సుప్రతాప శుభముల్ స్తోత్రైకపాత్రంబులున్.
 
ఉ. సారపు నీలమేఘములఛాయలు ఛాయలఁబోవనాడి యం
     భోరుహకోమలద్యుతికి బొమ్మల బెట్టి ప్రసన్నమై యంకూ
     రరుచిప్రభావములఁ బోర జయించి మనోహరాకృతిన్
     వారణ నొప్పుమీఱునది వాజుల కెల్ల గుమారమన్మథా.

ఆశ్వికసైన్యబల మధికముగా నుండుటచే నశ్వపతులని పేరొందిన తురుష్కప్రభువులతోఁ బోరాడుటకు విజయనగరరాజులును, అశ్వదళములను గొని విదేశములనుండి తెప్పించుచు వచ్చిరి. అశ్వముల నెక్కుడుగా నుంచుకొనుటచే అశ్వపరీక్ష యవసర మయ్యెను. కావున సంస్కృతములో నున్న శాలిహోత్రుఁడు మున్నగువారు రచించిన అశ్వశాస్త్రగ్రంథములను దేశభాషలలో భాషాంతరీకరింప నవసర మయ్యెను. కన్నడభాషలో అభినవచంద్రుఁడను బ్రాహ్మణకవి క్రీ॥ వె॥ 1400 సం॥రంలో అశ్వవైద్య మను గ్రంథమును రచించెను. తెనుఁగున మనుమంచనభ ట్టీయశ్వశాస్త్రమును సులభమైన శైలిని రచించి యాంధ్రదేశీయుల కపార మగు మేలొనరించెను.

చ. అరయఁగ సర్వలక్షణ సమంచిత మైన తురంగరత్న మే
    నరునిగృహంబునం దొకదినంబున నుం దగురీతి నుండు నా
    పరమపవిత్రగేహమునఁ బాయక నిల్చు రమావధూటి శ్రీ
    ధరునియురఃస్థలింబలె ముదం బెసలారఁ బ్రసన్నచిత్త యై.


____________