పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లు. ఈ గ్రంథమందు కొన్నిచోట్ల- పైఁబేర్కొనిన బిరుదములు గాక మఱికొన్ని బిరుదములు కాన్పించుచున్నవి. చాళుకీతిలక, సాళువకంప, చాళుక్యచూడామణీ, రాయగండరగౌళీ - యను సంబోధనము లచ్చ టచ్చట నున్నవి. కావున సాళువబిరుదములు వహించిన యీకంపనృపాలుఁడు చాళుక్యవంశములోనివాఁ డని చెప్పవచ్చును. సాళువనృసింహరాయలవంశస్థులు చాళుక్యవంశజు లని చెప్పికొనినట్లు కాన్పింపదు.

రాయగండరగౌళీ యనుబిరుదము సాళువవంశస్థు లెవ్వరును వహించినట్లు కనుపట్టదు. ఈ బిరుదమును గుఱించి మ. రా.రా. నేలటూరి వెంకటరమణయ్య M. A. P. H. D గారు 1929 సం॥ జూన్ నెల భారతిసంచికలో వ్రాసిన ఆరవీటివంశచరిత్రమం దిట్లు వ్రాసిరి. "కొటికంటి రాఘవుడు (ఆరవీటితాత పిన్నమరాజు కొడుకు) కంపిలిరాజు సైన్యముల జయించి యాతని రాజ్యసప్తాంగముల హరించి 'గండరగూళి' యను బిరుదంబు గొనియె నట. ఆరవీటి వంశరాజులందు గొంద ఱీబిరుదమును ధరించినవారు గలరు. సంగరాంగణచర్య కంపిలిరాయసప్తాంగ గండరగూళి సద్బిరుదాదిసంగ్రహణోజ్వలా' యన్న పద్యభాగము వల్ల దెలియుచున్నది."

ఇంతియే గాక మఱియొక చక్కని చరిత్రాంశము నాసూక్ష్మపరిశీలనకుఁ గాన్పించినది. ఈ గ్రంథమందలి మూఁడవ యాశ్వాసము మొదటి పద్యమున నిట్లున్నది.

క. శ్రీకరకటాక్ష విజయ, శ్రీకాంతా, కృష్ణరాయ సిద్ధకృపాణా
               స్వీకృతఫలసత్వర పర, భీకరభటయూథ కంపపృథ్వీనాథా.

అనఁగా "మంగళప్రదమైన కటాక్షము గలవాఁడా, విజయలక్ష్మి వరించినవాఁడా, కృష్ణరాయనికి సిద్ధమైన ఖడ్గము ధరించినవాఁడా............" యని యర్థ మిచ్చుచున్నది. ఇందు, కృష్ణరాయనికి సిద్ధముగా ఖడ్గమును ధరించినవాఁడా యనుటచే నీకంపరాయఁడు శ్రీకృష్ణదేవరాయల కాలములో నుండి యాచక్రవర్తిక్రింద సన్నిహితదండనాయకుఁడుగా నుండిన ట్లూహింపవచ్చును. నే నెఱిఁగినంతవఱకు, కృష్ణదేవరాయని సైన్యాధిపతులలో నీయోబలకంపరాయని పేరు కాన్పింప లేదు. చరిత్రాన్వేషణపరాయణు లగుపండితోత్తము లీవిషయమును నిర్ణయింతురుగాక!

మనుమంచిభట్టారకుఁడు బ్రాహ్మణుఁడు, భైరవాచార్యునిపుత్రుఁడు, ఏదే