పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుమంచిభట్టు - హయలక్షణవిలాసము

టేకుమళ్ళ అచ్యుతరావుగారు, ఎం.ఏ., రాజమహేంద్రవరము

మనుమంచిభట్టారకుఁడు రచించిన హయలక్షణవిలాసము- ఓబలరాయనికొడు కగుకంపరాయనికి నంకితము చేయఁబడినది. ఏతద్గ్రంథములోఁ గంపరాయని గుఱించి చేసినవర్ణనములలో సాళువవంశబిరుదము లన్ని యుఁ గూర్పఁబడియుండుటచే నీతఁడును సాళువవంశస్థు డని యూహింపఁబడుచున్నది. మీసరగండ, బర్బరబాహా, రాయచౌహత్తమల్ల, ధరణీవరాహ, మోహనమురారి, కఠారిరాయ, కఠారిసాళువ - ఇత్యాదిబిరుదము - లన్నియు సాళువనృసింహరాయలును నాతనిదండనాయకుఁ డగు తుళువనరసరాయలును ధరించినట్లుగా వారియాస్థానకవు లగుపినవీరభద్రుఁడును, నంది మల్లయ్య ఘంటసింగయ్య కవిద్వయమువల్లను మనకుఁ దెలిసియున్నది. కావున నీబిరుదములను ధరించిన కంపరాయఁడు సాళువవంశములోనివాఁ డని యూహింపవచ్చును. అతను దండనాయకుఁ డని తెలియుచున్నది, గాని, యెవరియొద్ద దండనాయకుఁడుగా నుండెనో చెప్పుటకు వీలు లేదు. ఓబలకంపా యని పిలువఁబడుటచే నాతను, ఓబలరాయనికొడుకని స్పష్టము. ఆయోబలరాయఁ డెవరికొడుకో, యేకాలపువాఁడో స్పష్టముగాఁ దెలియదు. సాళువవంశములోని సాళువమంగునకు ఓబలుఁ డని యొక యన్న యుండెను. కంపరాయఁ డాయోబలుని పుత్రుఁడేమో యని సందేహము కలుగుచున్నది.

పొదిలిపట్టణపు దండకవిలెంబట్టి సాళువనృసింహరాయలును తెలుఁగురాయలును నొకకుటుంబములోనివారలే యని తోఁచెడిని. ఆకుటుంబములోఁ గూడ నిద్దఱు కంపరాయలు కాన్పించుచున్నారు. వీరి కెవ్వరికిని ఓబలరాయఁడు తండ్రిగా నుండలేదు.

కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమయాంధ్రకవులచరిత్రలో మనుమంచిభట్టుకాలము నిర్ణయము చేయలేక ఓబలకంపరాయ డెవఁడో గుర్తింపలేక యట్టే విడిచిపెట్టిరి.

ఇట్లుండ నీకంపరాయని గుఱించి మఱికొన్ని చరిత్రాంశము లీగ్రంథమున నాదృష్టికి గోచరించినవి. వానియథార్థసందర్భములు విచారణీయము