పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దేవమణి క్రిందసుడియును
భావింపఁగ రోచమాన మగునని ధాత్రిన్
భావజసన్నిభ నిలువుము
భూవనితాప్రియుడ కన్న భూపలలామా!

42


దేవమణి క్రిందగానున్న సుడిని రోచమానమందురు. అట్టిగుర్రమును భదాయము. తప్పక కొనవలయును.


గీ.

రోచమానంబుక్రింద నిరూఢమగుచు
నమరసుడి జెర్రిప్రాకిన నట్టిరేఖ
పేరుహరికి జూడ ధారుణిలో శత
పాది యనిరి యశ్వభావవిదులు.

43


రోచమానముక్రింద జెర్రివలె గొన్నిటిసుడి యుందును. అట్టి గుర్రమును శతపది యందురు.


బాహుల వక్షస్థలముల
నూహింపగ ధృవులు గలుగ నుచితము విలువన్
ఆహవభీము డపాత్రత
దేహీజనకల్పభోజ దినకరతేజా.

44


ముందరి కాళ్ళమీదను వక్షస్థలంబునను ధృవులు గలిగియున్న యశ్వమును గొనవచ్చును.


సీ.

త్రికమున వీపున కకుదాంగకములను
             భృకుటిపై నాసాగ్ర పుటముమీద
హృదయమునను నాభి యుదరము కుత్తుక
             చెక్కున ముక్కున ప్రక్కలందు
గుదమున విత్తుల కోశము మెడలపై
             నేత్రాల నాలుగు గోత్రములను