సాహిత్యరంగం
డా॥ మధురాంతకం నరేంద్ర 9866243659
“ఆదే నేల” పుడుతుంది, కవిత్వమంటే ప్రేముంటే
“పాఠకుడికైనా,రచయితకైనా, సాహిత్యమనదొక జీవిత కాలపుసాధన" అంటాడు రవీంద్రనాథ టాగూరు. జరిగిపోయిన చరిత్రను సాకలంగా అర్థం చేసుకుని, సమకాలిన జీవితాన్ని సక్రమంగా గమనిస్తూ, భవిష్యత్తులో రాబోయే పరిణామాలను సైతం ముందుగా తెలుసుకుని హెచ్చరించగలిగే సాహిత్యకారుల్నే ద్రష్టలని గుర్తిస్తున్నాం. మానవజాతి అదృష్టంవల్ల యిటువంటి ద్రష్టలు మనకు కొందరు పుడుతూనే వున్నారు. అందుకే మానవాభ్యుదయానికి సాహిత్య అధ్యయనం కంటే గొప్ప బలమైన మార్గం మరొకటి కనిపించదు. సమగ్రమూ, సాధికారమూ, ప్రణాళికాబద్ధమూ అయిన సాహిత్య అధ్యయనాలు చాలా తక్కువగానే వుంటాయి. ముకుంద రామారావు గారి "అదే నేల" (భారతీయ కవిత్వం - నేపథ్యం) అనే పెద్ద పుస్తకం జాబితాలో తప్పకుండా వుంటుంది.
మంచి పాఠకుడు క్రమంగా మంచి విమర్శకుడిగానూ, మంచి సృజనాత్మక రచయితగానూ మారిపోతూవుంటాడు. మంచి పాఠకుడూ, విమర్శకుడు, రచయిత గూడా అయిన వ్యక్తి మాత్రమే “అదే నేల” వంటి పనిని నిర్వహిస్తాడు. యే రచన అయినా, పుస్తకమయినా, ఆ రచయిత వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తూనే వుంటుంది. ముకుంద రామారావు. గారి సాహిత్య ప్రయాణాన్ని గమనించినప్పుడు ఆయనదైన విలక్షణమైన అన్వేషంణా, సాధనా స్పష్టంగా కనబడుతుంది.
స్వాతంత్రానికి ముందు 1944 లో పశ్చిమ బెంగాల్ లో వుండే 'ఖరగ్పూర్' అనే వూర్లో ముకుందరామారావు గారు పుట్టారు. కలకత్తా నుంచీ 130 కిమీ కివతల వోరిస్సా రాష్ట్రపు సరిహద్దుల్లో వుండే ఖరగ్పూర్ లో యిప్పటికీ ముప్పయి అయిదు శాతం మంది తెలుగువాళ్లే ! చాలా దశాబ్దాల క్రితం కళింగాధ్ర ప్రాంతాల నుంచీచాలామంది తెలుగువాళ్లు రైల్వేలో వుద్యోగాలపైన ఖరగ్పూర్ వెళ్ళి స్థిరపడి పోయారు. అక్కడ పుట్టి పెరిగి, వుద్యోగం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తెలుగురాష్ట్రాల కొచ్చిన కొద్దిమందిలో ముకుంద రామారావు గారొకరు. రాష్ట్రతర ప్రాంతంలో పుట్టి పెరిగినందు వల్ల ఆయన సాహిత్య సృజన తన మూలాల్ని వెదుక్కునే క్రమానికొక ఆవిష్కరణగా ప్రారంభమయింది. 1995లో ఆయన ప్రచురించిన తొలి కవితా సంపుటానికి “వలసపోయిన మందహాసం” అనే పేరుండడం యాదృచ్ఛికమని అనిపించదు.
ముకుందరామారావు గారి రెండో కవితాసంపుటం పేరు “మరో మజిలికి ముందు ” “అంతములేని యీభువనమంత పురాతన పాంథశాల' అనిగదా అంటాడుకవి. యిలా తన మూలాలను వెతుక్కునే జీవితమంతా మజిలీల సముదాయని జీవితం దగ్గర పాఠం నేర్చుకున్న సాహిత్యకారుడి జీవనయానం యెలా సాగుతుందో తెలుసుకోవాలనుకునే వాళ్లకు ముకుందరామారావు గారి ప్రయాణంగొప్ప వుదాహరణగా రూపొందింది. తన ముందు తరంవాళ్ళెప్పుడో బొంబాయి దగ్గరి వూళ్లోకొచ్చి స్థిరపడిపోయాక, తన జీవితం తనను 'అవతలివాడు-లోపలివాడు' గా మార్చేశాక, చిన్నప్పటినుంచీ తనకు మాతృభాషగా తయారైన యింగ్లీషులోనే కవిత్వం రాశాక, డెబ్బయ్యేళ్లునిండాక, ప్రముఖకవి నిస్సిమ్ యెజికియల్, తన వ్రేళ్లను వెదుక్కోవాలని ప్రాచీన మరాఠీ కవిత్వాన్ని అనువాదం చేయడం మొదలు పెట్టారు. యెజవియల్ కంటే చిన్న వయస్సులోనే ముకుందరామారావు గారిలో మొదలైన యీ విచికిత్స యిప్పుడు భారతీయ కవిత్వాన్నంతా అన్వేషించడం దగ్గరిదాకా వచ్చి ఆగింది.
2009 వరకూ అయిదు కవితా సంపుటాల్ని ప్రచురించాక "అదే ఆకాశం" (అనేక దేశాల అనువాద కవిత్వం) అనే పరిశోధనాత్మక, అనువాద రచనతో ముకుందరామారావు గారి యీ మౌలికమైన ప్రయాణం ప్రారంభమైంది. విస్తృతమైన పరిధి నుంచీ ప్రారంభమై, క్రమంగా తన పనిధిని పరిమితం చేసుకుంటూ నోబెల్ బహుమతి వచ్చిని కవుల కవిత్వం, ఆ తరువాత యిప్పుడుభారతదేశపు కవిత్వం వరకూ ఆశోధన కేంద్రీకరించబడుతూ వచ్చింది. సృజన కారులెవరూ యిలా ప్రణాళిక వేసుకుని సాగరు. అయతే వొక విస్పష్టమైన, వ్యక్తిగతమైన, విశిష్టమైన అన్వేషణతో ముందుకెళ్లే రచయితల రచనలలోనే యిటువంటి నిర్దుష్టమైన పరిణితి కనబడుతుంది.
ముకుందరామారావుగారు మౌలికంగా కవి. కవిత్వం ఆయన కిష్టమైన, ఆయన యెంచుకున్న ప్రక్రియ. ఖరగ్పూర్లో పుట్టడం వల్ల ఆయనకు తెలుగుతో బాటూ హిందీ, యింగ్లీషు, బెంగాలీలలో గూడా అభినివేశం వచ్చింది. యీ నాలుగు భాషల పడవల పైనే ఆయన ఆయా భాషల్లోంచి యీ నాలుగు భాషల్లోకి అనువాదాలైన కవితల్నే యీ ప్రపంచ భాషల సముద్రాన్నంతా తరచిచూడ్డానికి బయల్దేరాడు. ఆయన యెంచుకోగలిగాడు. ఆ కవితలకంతా గొప్ప నేపథ్యంగావున్న ఆయా భాషల సాహిత్యాలను గురించి తెలుసుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాడు.
సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ కవిత్వం, భిన్నమైనదనీ, విచిత్రమైనదనీ, విశిష్టమైనదనీ, యేది కవిత్వమో, యేది కవిత్వం కాదో చెప్పడం చాలాసుభమేకాని సులభంగాదని విమర్శకులంటారు. అందుకే బాల గంగాధర తిలక్ "కవిత్వం ఒక ఆల్కెమీ, దానిరహస్యం కవికే తెలుసు" అంటాడు. కవి అయిన ప్రతీవ్యక్తి కవిత్వమంటే తనదైన నిర్వచనాన్ని వెతుక్కున్నారు. అందువల్ల కవిత్వమంటే కవులెందరున్నారో అన్ని నిర్వచనాలు యెదురవుతాయి. అయితే యీ అనేకానేక నిర్వచనాల్లో తామస్ కార్లయిల్ అనే యింగ్లీషు రచయిత చెప్పిన - కవిత్వమంటే "సంగీతాత్మక ఆలోచన" (Musical Thought) అనే నిర్వచనం స్పష్టంగానూ, నిర్దుష్టంగానూ వుంది. యీ