Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. 1812లో రంజిత్ సింగ్ కు ఆయన దగ్గర్నుంచి, ఈస్టిండియా కంపెనీకి చేతులు మారింది. ఆ కంపెనీ గవర్నర్ జనరల్ 1850 జూలై 3 వ తేదీన ఆ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి బహూకరించగా, 1851 లో క్రిస్టల్ పాలెస్ లొ భద్ర పరచబడింది. 1937లో దాన్ని కిరీటంలో పొదిగి బ్రిటీష్ రాణికి అలంకరించారు. ఆక్రమంలో ఇప్పటి బ్రిటీష్ రాణి ఎలిజబెత్ ఆ కిరీటాన్ని ధరిస్తూనే ఉన్నారు. కోళ్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం, బ్రిటీష్ రాణి తలపై తెలుగు వెలుగుల్ని విరజిమ్ముతూనే ఉంది. ఈ వజ్రం వెనుక ఇంత కథ ఉంది" అని ముగించాను.

వీడియో షూటింగ్ అయిపోయింది. అక్కడున్నవాళ్లను అడిగాను, ఇంతకీ ఆ వజ్రం ఎక్కడ దొరికింది అని. 'కరణం గారి చేలో' అని ఒకతను చెప్పి, ఎటెళ్లాలో చూపించాడు. దాదాపు ఒక కిలోమీటరు వెళ్లేసరికి సర్కార్ ముళ్లకంపచెట్లు, నిమ్మ చెట్టులా బాగా పెరిగిన చోట ఆగి. మేము కారుదిగాం. మమ్మల్ని గమనించి ఒకరిద్దరు తట్ట, చిన్న డోకుడుపారలతో పరుగు లంఘించుకొన్నారు. మరికొంత మంది దూరంగా నిలబడి మమ్మల్ని చూస్తున్నారు. మేము చెట్లల్లోంచి ముందు కెళ్లాం. బాగా లోతుగా తవ్విన కాలువ, బాగా ఎత్తుగా పోసిన గులకరాళ్ల గుట్ట కని పించాయి. ఆ కాలువ ఒడ్డున అటూ ఇటూ ఇద్దరిద్దరు చొప్పున దాదాపు 200 మంది వజ్రాలవేటలో ఉన్నారు. ఒక జంట దగ్గర కెళ్లాను. ఎక్కడినుంచొచ్చారని అడిగాను. చిలకలూరిపేట నుంచి వచ్చామన్నారు. మీరు పోలీసులా అని అడిగారు. కాదు మేం ఫలానా అని చెప్పాం. న్యూస్ పేపర్ లో నాఫొటో చూపించాను. నమ్మకం కుదిరింది. వాళ్లంతా, రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన వజ్రాల వ్యాపారులు కుదుర్చుకొన్న వాళ్లు. ఒక్కోసారి అరవైవేలు, ఒక్కోసారి అరవై రూపాయలు ఖరీదుచేసే వజ్రాలు, రాళ్లు దొరుకుతాయనీ, వచ్చిన వారికందరికీ కూలీలిస్తారనీ, వజ్రాలు దొరికితే అదనపు ఆదాయమనీ చెప్పారు. ఇంతలో ఒక కుర్రాడొచ్చి, సార్ ఇక్కడొక శిల్పముంది చూస్తారా అన్నాడు. వాళ్లకు వజ్రం దొరికినంత ఆనందం కలిగిందినాకు. చూస్తే అది క్రీ.శ. 16-17 శతాబ్దాలకు చెందినది. ఆనాటి స్థానిక పాలకుని దంపతుల శిల్పం. భూమిలో కూరుకుపోతే, అందరం పట్టి పైకి లేపాము.

పులిచింతల ప్రాజెక్టు ఎక్కడా అని అడిగితే తూర్పుగా వది కిలోమీటర్లు పోవాలి. దోవలేదు. క్రోసూరు నుంచి వెళ్లాలని చెప్పారు. చినుకులు పడేట్లుగా ఉంది. మబ్బులెంక చూచిన కెమెరామెన్ తొందరిస్తే మళ్లీ రెండు బైట్లిచ్చి జర్మన్ రేడియోకు నా ఇంటర్య్వూ పూర్తి చేశాను.

కారెక్కి వెనక్కి మళ్లీ వస్తూ ఉంటే, పాడుబడిన ఇళ్లు, శిధిలమైనగుళ్లు బాధపడుతున్నట్లుగా అనిపించింది. ముందుకు సాగాం. కేతవరం కోట చూడాలన్న తపన, అక్కడి గుళ్లు, శాసనాలు, శిల్పాలు, శిధిలాలు చూడకుండా ఎలా అను కొంటుంటే, తెలంగాణా జాగృతి (చరిత్ర పరిశోధకులు) శ్రీ రామోజు హర గోపాల్ అంతకుముందే వాట్సాప్ ద్వారా పంపిన, కృష్ణా తీరంలోని రాతికి చెక్కిన శాసనాలు, నరసింహస్వామి శిల్పం, పైన మెట్లదగ్గరి గణేశ విగ్రహం నన్ను కదలకుండా చేశాయి. సమయం సాయంత్రం నాలుగు దాటింది. బెల్లంకొండ పోలీసులు, పొద్దుగూకక ముందే తిరిగి రావాలని చెప్పారు. దూరం నుంచే కేతవరం కోటను, కొండ పై నరసింహస్వామి ఆలయాన్ని చూస్తూ అల్పాహారం తీసుకొని, శ్రీకృష్ణదేవరాయలు వశపరచు కొన్న కేతవరం కోటను చూడ కుండానే గంపెడు బాధతో బయలుదేరి రాత్రి ఎనిమిది గంటలకు విజయవాడ చేరుకొన్నాం. ఆ రాత్రంతా శిధిలాలయాలు, శిల్పాలే కళ్లముందు కదలాడుతూ నిద్ర లేకుండా చేశాయి.

(తరువాయి వచ్చే సంచికలో...)

“మరణించిన వాళ్లందరినీ మనం 'కీర్తిశేషుల'నే పేర్కొంటాంగానీ, నిజంగా చాలా కొద్దిమందే చనిపోయాక కీర్తిని వదిలిపెట్టి పోతారు. కొందరి విషయాల్లో కీర్తి కొన్నాళ్ల పాటే ఉంటుంది. శాశ్వతంగా కీర్తి శేషించినవారు చరితార్థులు. తాపీ ధర్మారావు అనేక విధాల చరి తార్థులు... (తాతాజీని) పుస్తకం లాగా చదువుకొన్నాను. చలోక్తులకు ఆయన నిధి. ఎదుటివారి మీద తాను జోకు వేసినా, తనమీద ఎదుటివారు జోకు వేసినా నిండుగా నవ్వుకోగలరు. మన తెలుగు సినిమాలలో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్ష. నిత్య జీవితంలో షష్టిపూర్తి చేసికొనడం ఘనకార్యంగా భావిస్తే సాహిత్య జీవితంలో షష్టిపూర్తి చేసుకున్న మహనీయుడాయన”.

-ఆరుద్ర (వనిత మాసపత్రిక)