పెద్దవాళ్లిద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ల కళ్లల్లో మెరుపును గమనించాను. అయినా ఏమీ తెలియనట్టుగా వీడ్కోలు చెప్పేశాను. కారులో బయల్దేరా ఒంటరిగా.. ఇది వరకు ఇదే కారులో మిత్రులందరినీ తీసుకుని వెళ్లా. కానీ ఇప్పుడు ఒక్కడినే.
ముందుగా అనుపు దగ్గరికి వెళ్లాను.. రంగభూమి కలియ తిరిగాను. గోళాకారంలో ఉన్న స్టేడియం లాంటిదది. దిగువన మైదానంలో మల్ల యుద్ధాలు, కోడి పందాలు జరుగుతుంటే కూర్చుని చూసేలా నాలుగు వైపులా రాతి బల్లలను ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది కూర్చోవచ్చు. పక్కనే ఉన్న పురావస్తు శాఖ పేరుపలక (బోర్డు)పై రంగభూమి, రెండో శతాబ్దం అని రాసి ఉంది. రోం లోని కొలోజియమ్ గుర్తుకువచ్చింది. కొలోజియమ్ ని ఒకటో శతాబ్దిలో నిర్మించారని గూగుల్ చెబుతోంది. అంటే రోమ్ లో కట్టిన వందేళ్ల తరువాత మన దగ్గర రంగభూమి నిర్మించారు. రోమన్ ప్రభావంతో కట్టారా లేక మన వాళ్ల సొంత ఆలోచనా??
అనుపు దగ్గరే ఉన్న మరో పురావస్తు అవశేషం అలనాటి నాగార్జున విశ్వవిద్యాలయం! దేశవిదేశాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి బౌద్ధం, తర్కశాస్త్రం, ఖగోళం లాంటి అనేక అంశాలపై అధ్యయనం చేసేవారట. దేశంలో అతి ప్రాచీన విశ్వవిద్యాలయంగా నలందాని పేర్కొంటారు కానీ నాగార్జున విశ్వవిద్యాలయం రెండో శతాబ్దికే చెందింది. నలంద అయిదో శతాబ్ది నాటిది. ఎందుకో స్వాతంత్య్రానంతరం తెలుగుజాతిని చిన్నచూపు చూసినట్టుంది. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం వల్ల నాగార్జున కొండలోని పురావస్తు విశేషాలకు విఘాతం ఏర్పడింది. వాటిని యథాతథంగా వెలికి తీసి అనుపు దగ్గర కొన్ని, నాగార్జున కొండ దగ్గర కొన్ని పురావస్తు విశేషాలను పునరుద్ధరించారు.
నేడు నాగార్జున కొండ అనేది ఓ కృత్రిమ దీవి, కృష్ణానదిలో నిర్మించారు. అక్కడి మరో విశేషం మ్యూజియం. ఆ దీవికి చేరుకోవాలంటే ఓ అరగంటపాటు బోటులో ప్రయాణించాల్సిందే. టికెట్ తీసుకుని బోట్లో కూర్చున్నాను. చిన్నా పెద్దా కలిపి ఓ యాభై మంది ప్రయాణికులు ఉన్నారు. పిల్లల కేరింతలతో సందడిగా ఉంది. ఆ నీటి ప్రవాహాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాను. రెండు వేల ఏళ్లనాడు ఎక్కడెక్కడి దేశాల నుంచి ఎందరో భిక్కువులు బుద్ధం శరణం గచ్ఛామి అంటూ తిరుగాడిన ఈ కనుమల్లో నేనూ ప్రయాణించడం చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతకు ముందు ప్రయాణంలో లేని తన్మయం ఇది.
మా ఎదురుగా మరో మోటారు బోటు వస్తోంది. దీవి నుంచి సందర్శకులను వెనక్కి తీసుకువస్తోంది. ఆ బోటులో ఉన్న వారంతా తెల్లని దుస్తులు ధరించి భిన్నంగా కన్పించడంతో వాళ్లను నిశితంగా గమనించడం మొదలుపెట్టాను. మగ వారందరూ లుంగీ, షర్ట్ ధరిస్తే, ఆడవాళ్లందరూ లంగా, షర్టూ వేసుకున్నారు. యువత నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారూ ఉన్నారు. వారిని చూస్తుంటే విదేశీయులగానే అన్పిస్తున్నారు. ఒక్కొక్కరినీ చూస్తున్న నాకు ఓ యువతిని చూడగానే గుండె ఆగినంత పనైంది. తను ప్రవల్లిక. నా కలలో హరిపుంజాయి రాజ్యంలో ఏడో శతాబ్దిలో నన్ను ఆటపట్టించిన ప్రవల్లిక.. మళ్లీ ఇలా కన్పిస్తుందని ఊహించలేదు. తనను జీవితంలో చూస్తాననీ అనుకోలేదు. అప్పుడు రాకుమారిలా ఉంది, ఇప్పుడు సామాన్యురాలిగా కన్పిస్తోంది.
ఆ పడవ మా దగ్గరగా వచ్చినట్టే వచ్చి మమ్మల్ని దాటుకుని ముందుకు వెళ్లిపోతోంది. ప్రవల్లికను చూసిన సంభ్రమాశ్చరాల్లో ఉన్న నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పడవ నా కళ్ల నుంచి దూరమవుతుంటే దూకేద్దామనే అనుకున్నా. కానీ ఆగిపోయా. 'ప్రవల్లిక, ప్రవల్లికా...' గట్టిగా అరిచా.
ఆమెలో ఎలాంటి స్పందనా లేదు. ఆమే కాదు ఆ పడవలోని వాళ్లెవర్వరూ నా మాటల్ని పట్టించుకున్నట్టు అన్పించలేదు. దుఃఖం తన్నుకువస్తోంది. గుండె బయటికి వచ్చి కొట్టుకుంటోన్న భావం. నిస్సహాయుడిగా ఉండిపోయా. నా పడవలోని వాళ్లందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నట్టు గమనించి స్పృహలోకి వచ్చాను, నిమ్మలంగా కూర్చుండి పోయాను. సుదూరంలో లంగరు వేసిన కొన్ని లాంచీలు కన్పించాయి. మా పడవ మోటారును ఆపారు. మరి కొన్ని నిమిషాల్లో కిందకి దిగుతానని సమాధానపరచుకున్నా.
లాంచీని ఆపగానే అందరి కంటే ముందుగా ఎంతో ఆత్రంగా దిగి ఇందాక వెనక్కి వెళ్లిన పడవలో ఉన్న వాళ్లెవరని ఒడ్డునున్న వారిని అడిగాను. తెలియదనే సమాధానం. మెట్టెక్కుతూ పైకి వెళ్తుంటే టికెట్ కేంద్రం కన్పించింది. నేరుగా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లి వివరాలు అడిగా. ఆ లాంచీ బృందం వారందరూ శ్రీలంకకు చెందిన వారని, గత మూడు రోజులుగా నాగార్జునకొండలోని సింహళ విహారంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెళుతున్నారని చెప్పారు. వెంటనే టికెట్ కొనుక్కుని వెనక్కి వచ్చేద్దామని అనుకున్నా. కానీ మరో గంటకు మాత్రమే లాంచీ ఉందని నిర్వాహకులు చెప్పడంతో అక్కడే కూర్చుండిపోయాను. దూరంగా విస్తారమైన కృష్ణా నదీజలాలు. నాకూ ప్రవల్లికకూ మధ్య అంతులేని అగాథం. తొందరగా వెళ్లి ఆమెను కలుసుకోవాలి.
ఓ గంట వరకూ నిరీక్షణ. ఆ తరవాత ముప్పావుగంట లాంచీ ప్రయాణం. సాగర్ కి చేరుకునే సరికి ఎంత లేదన్నా రెండు గంటల పడుతుంది. అంతసేపు వాళ్లుంటారా? వెళ్లిపోతారా? నా అనుమానమే నిజమైంది. ప్రవల్లిక నా నుంచి దూరంగా వెళ్లిపోయింది. సాగర్ నుంచి అనుపు దాకా కారులో తిరిగి చూశా. ఎక్కడా శ్రీలంక బృందం జాడలేదు. అంతులేని నిరాశతో ఇంటికి వచ్చేశా.
ప్రవల్లిక రూపమే మనసునిండా. 'సూర్యా' అంటూ పిలుస్తున్నట్టుగా ఉంది. కలంతా వాస్తవంగా కళ్లముందు మెదలుతోంది. జీవితంలో తొలిసారిగా నా మనసు దోచుకున్న