Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బయట గిడుగు రామమూర్తులు ప్రత్యేకంగా లేకపోయినా, తమిళం మినహా ఈనాడు దాదాపుగా అన్ని భారతీయ భాషల లిఖిత సాహిత్యాలలోనూ వ్యావహారికమే చాలావఱకూ వాడుతున్నారు, అవసరం కొద్దీ ! అయితే ఆయా రాష్ట్రాల వారిని మించిన తప్పుడు అభిప్రాయాలు కొన్ని తెలుగుగడ్డ మీద పొలోమని ప్రచారంలోకి వచ్చేశాయి గడిచిన వందేళ్ళల్లో ! వీటిని సరిదిద్దడానిక్కూడా ఏ ప్రయత్నమూ జఱక్కపోవడం విచారకరం.

1. కొందఱు వ్యావహారికవాదం పేరుతో ఎదిరివాదంలోని అసమంజస అంశాల్ని ఖండించడానికి పరిమితం కాకుండా వారిని వ్యక్తులుగా ద్వేషించారు. అంటే ఒక సైద్ధాంతిక సమస్యని కాస్తా మానసిక సమస్యగా మార్చుకున్నారన్న మాట.

తదుపరిదశలో వారిని ఒక వర్గంగా ద్వేషించడం జఱిగింది. అటుపిమ్మట వారందఱినీ ఒక సామాజికవర్గంగా ద్వేషించడం జఱిగింది (సదరు ద్వేష్యవర్గంలో అందఱూ గ్రాంథిక రచయితలు కాకపోయినా). తదనంతరం గ్రాంధిక శైలినీ, సాహిత్యాన్నీ ఏకమొత్తంగా ద్వేషించడం మొదలుపెట్టారు, ఆ సాహిత్యం గిడుగు రామమూర్తిగారి కంటేనూ, ఆయన వ్యావహారికవాదం కంటేనూ కొన్ని వందల సంవత్సరాల పూర్వం రచించబడినా కూడా !

కాలక్రమంలో ద్వేషం ఎగతాళిగా కూడా మారింది. ఉదాహరణకి - కొన్ని పాత చలనచిత్రాలలో ప్రతినాయక, విదూషక పాత్రల చేత అటూ ఇటూ కాని అకటా వికటపు గ్రాంథికంలో మాట్లాడించారు. అన్ని మాండలికాలకూ గ్రాంథికాన్ని పోలిన ఒక దేశవ్యాప్త ప్రాచీన వ్యావహారికమే మూలకందమనీ, ఒక కాలపు వ్యావహారికం ఇంకో కాలానికి గ్రాంథికంగా మారు తుందనీ, అందులో ఎగతాళేమీ లేదని చెప్పేవారూ, చెబితే వినేవారూ ఈ గడ్డమీద కఱువయ్యారు. అలా అలా నెమ్మదిగా వాడుక భాష పేరు చెప్పి అందఱినీ తెలుగుభాషకూ దానియొక్క సహజమైన తరతరాల ప్రాచీన వారసత్వానికీ విముఖులుగా మార్చారు. గ్రాంథిక వ్యావహారిక శైలిభేదాలు అన్నిభాషల్లోనూ మామూలేననీ, గ్రాంథికాలనేవి ఆయా జాతుల ప్రాచీన వారసత్వాలనీ, అవి కేవలం తెలుక్కి పరిమితంకావనే వాస్తవం పూర్తిగా మఱుగున పడిపోయింది. ఐతే అన్ని ఇతర భాషలవారూ తమ గ్రాంథికాన్నీ, తమ వ్యావహారికాన్ని కూడా తమ మాతృభాషగానే మనసారా ప్రేమిస్తున్నారు. సర్వసమగ్రంగా అభిమానిస్తున్నారు. నెత్తిన బెట్టుకుంటున్నారు. బ్రహ్మరథం పట్టుతున్నారు. కేవల గ్రాంధికాభిమానులు గానీ, కేవల వ్యావహారికాభిమానులు గానీ ఇతర జాతుల్లో కనిపించరు. దురదృష్టవశాత్తు అలాంటి వారంతా ఇక్కడే దర్శనమిస్తున్నారు.

2. వ్యావహారికానికి రకరకాలుగా - తమ అవగాహనకీ, పరిమితులకీ, అవసరాలకీ అనుగుణంగా - అపార్థాలూ, వక్రభాష్యాలూ చెప్పసాగారు. వాటిల్లో కొన్నిటిని పైన పేర్కొనడం జఱిగింది. అన్నింటికంటే ముఖ్యమైన, భాషకి అత్యంత వినాశకరమైన వక్రభాష్యాలు రెండు. మొదటిది - సాహిత్యమంతా, అది ఏ రంగానికి చెందిన సాహిత్యమైనా కానివ్వండి సామాన్యమానవుడికి అందుబాటైన భాషలోనే ఉండాలనేది. రెండోది- వ్యావహారికమంటే సామాన్య మానవుడికి అందుబాటైన భాష కనుక అతనికి ఇప్పటికే ఏయే పదాలు తెలుసునో ఆ పదాల్లోనే యావత్తు సాహిత్యమూ రచించాలి. కొత్త పదాలు అతనికి అర్థం కావు గనుక రచయితలఆ జోలికే పోకూడదు. అంటే తెలుగులో కొత్త పదాలనేవే ఉండకూ డదు. వాటిని రూపొందించడానికి ఎవఱూ ప్రయత్నించకూడదు. అథవా ప్రయత్నించినా ఆ కొత్త పదాలన్నీ ఇప్పటికే బాగా తెలిసిన పాతపదాల కలయికతోనే ఏర్పడినవై ఉండాలి. ఈ రకంగా పాఠకుల పరిజ్ఞానానికీ, రచయితల సృజనాత్మక స్వేచ్ఛ (creative freedom) కీ తామే నిరంకుశంగా ఎల్లలు నిర్ణయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అమల్లో కొచ్చిన ఆంగ్ల మాధ్యమ విద్యావిధాన ప్రభావం ఫలితంగా ఎక్కువమందికి తెలుగు సాహిత్యంతో సంబంధాలు తెగిపోతున్నాయి. గనుక ఇప్పుడు వ్యావహారిక పదాలంటే అర్థం ఇంగ్లీషుపదాలే. అందుచేత ఆ పదాలకి తెలుగు సమార్థకాల్ని ఎవరైన సూచిస్తే, "అవి వ్యావహారికం కాదనీ, సామాన్య మానవుడికి అర్థం కా”వనీ వంక బెట్టి తిరస్కరించడం జఱుగుతోంది. పై అభిప్రాయాలలో చాలా తొఱ్ఱలున్నాయి. ఈ వాదాలు భాషకి చేసిన, చేస్తూ ఉన్న నష్టం చాలా గొప్పదీ, అనివర్తనీయమూ ను (irreversible).

(అ) వీరు చెప్పే సామాన్యమానవుడు ఎవఱో సరైన నిర్వచనం లేదు. సాధారణంగా ఒక రంగంలో నిష్ణాతుడైనవాడు ఇంకో రంగంలో బభ్రాజమానం కావచ్చు. ఏ రంగానికి చెందనివారు ఎవఱూ లేరు సమాజంలో! కాబట్టి అందఱూ తమ తమ రంగాలకు ప్రత్యేకమైన విశిష్ట పదజాలాన్ని వాడేవారే. ఆ రంగానికి చెందనివారిక్కూడా అర్థం కావాలని వ్రాసే వారెవఱూ ఉండరు. వైద్యుడు వైద్యపరిభాషలో పాఠ్యపుస్తకాలు వ్రాస్తాడు. ఎంజినీరు ఎంజినీరింగ్ పరిభాషలో పాఠ్యపుస్త కాలు వ్రాస్తాడు. ఆయా రంగాలలో కొత్త ఆవిష్కారాలు వెలుగులోకి వచ్చినప్పుడు, లేదా కొత్త పరిభావనలు ముందుకొచ్చి నప్పుడు వాటిని వ్యక్తీకరించడానికి కొత్త పదాలు తప్పనిసరిగా కావాలి. ఒకవేళ ఆ కొత్త పదాలు ఒక విదేశీ భాషలో ఉన్న పక్షంలో వాటిని సరికొత్త తెలుగుపదజాలంతో అనువదించుకోవాల్సి వస్తుంది. వ్యావహారికానికి వీరు చెప్పే స్వకపోల కల్పిత అపార్థాల్ని నమ్ముకుంటే ఇదేదీ జఱగదు.

(ఆ) అందుబాటు భాష అంటే ఏమిటి ? మన పదపరిజ్ఞానం ఐదేళ్ళవయసప్పుడు ఉన్నట్లు పదేళ్ళ వయసప్పుడు లేదు. పదేళ్ళప్పుడు ఉన్నట్లు పాతికేళ్ళప్పుడు లేదు. అది వయసు గడిచేకొద్దీ పెఱుగుతూ పోతుంది. కాబట్టి అర్థం కావడం అనేది సార్వజనికమూ, సార్వకాలీనమూ కాదు. అది వయోవిశిష్టం (age-specific), వర్గవిశిష్టం (class-specific), ప్రస్తావనవిశిష్టం (topic-specific) ప్రకరణ విశిష్టం (context-specific). పాతికేళ్ళవాడి అందుబాటు భాష పదేళ్ళవాడికి అందుబాటు కాదు. అలాగే యాభయ్యేళ్ళవాడి అందుబాటుభాష పాతికేళ్ళవాడికి అందుబాటు కాదు. మనుషులు కాస్త ఎక్కువ తెలుసుకుందామనే చదువుతారు. మెఱుగైన కొత్త భాషా ప్రయోగాలు కూడా ఈ ఎక్కువ తెలుసుకోవడంలో భాగమే. అంతేతప్ప, విషయాన్నీ, దాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించే భాషనీ వేఱు చేసి మాట్లాడడం సరైన జీవన వేదాంతం కాదు. కనుక విషయపరంగానూ, వ్యక్తీకరణల పరంగానూ రోజురోజుకూ ఎదగడమే మంచిమనుషుల లక్షణం. మంచిపాఠకుల లక్షణం. వారు