Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాటల పుట్టుక వాచస్పతి

పదనిష్పాదనకళ -2

The joy of coining new words!

(గత సంచిక తరువాయి...)

జనాద్యతావాదం

ఈ సందర్భంగా కొందఱు ఒక తరహా 'జన-ఆద్యతావాదాన్ని' లేవదీయడం గోచరిస్తుంది. భాష ప్రజలకు చెందినదనీ, ప్రజలే దానికి ఆద్యులనీ, సృష్టికర్తలనీ, కాబట్టి వారే అంతిమ నిర్ణేతలనీ, వారు ఏది వాడితే అదే ప్రమాణమనీ, “వాడుకలో ఉన్న పదాల్ని ఏ పండితులు సృష్టించారు ? అని ప్రశ్నిస్తూ వాదించేవారున్నారు. 'ప్రజలు' అనేదొక సామూహిక నామవాచకం (collective noun). అదొక ఏకాండీ స్వరూపం (monolithic entity) కాదు. అదొక నామరూపరహిత స్వమూర్తి (faceless entity). అందులో అందఱం ఉన్నాం. రకరకాల వాళ్ళున్నారు. అనేక తరాలవాళ్ళున్నారు. వాళ్ళల్లో పండితులు కూడా ఉన్నారు. కనుక పండితుడు కూడా ప్రజే. ఆ ప్రజల్లో తెలియని ప్రజ కంటే తెలిసిన ప్రజ ఎక్కువ వరణీయం. రోగం వచ్చినప్పుడు అందఱూ స్పెషలిస్టుల దగ్గఱికే పరిగెడుతున్నారు తప్ప, "అన్ని వైద్యాలకూ పసరు వైద్యమే మూలం" అని కోయ వాళ్ళ దగ్గఱికి పోవడం లేదేం? రోగం ఏంటో వైద్యుణ్ణి అడిగి తెలుసుకుంటున్నారు తప్ప దానిగుణించి పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఊరివాళ్ళకి వోటింగ్ పెట్టడం లేదేం? భాష విషయానికొస్తేనే జనాద్యతావాదమా? సరే, ఆ వాదాన్ని కాసేపు మాటవరసకి అంగీకరిద్దాం. మఱి ఆనాడు తెలుగు తప్ప వేఱే భాష లేదీ గడ్డమీద. వ్రాతకోతలు తెలియవు. అన్నీ మనసులోనే ధారణ చేసుకొని తరువాతి తరానికి అందించేవారు. మఱి అలా మారుద్దామా ఇప్పటి విద్యావ్యవస్థని కూడా?

కాబట్టి వైద్యానికే కాదు, ఈ రోజుల్లో భాషక్కూడా సుశిక్షితులైన విశేషజ్ఞులు (specialists) కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో భాష కూడా ఒక పురోగతశాస్త్రమే (advanced science). ఆ శాస్త్రం తెలిసినవారే దాని మీద సాధికారంగా మాట్లాడడానికీ, దానిలో కాలోచితమైన మార్పులు చేయడానికి, దానిమీద ఇతరులకు సలహాలివ్వడానికి అర్హులు. మిగతా వారు కారు. అందఱూ భాషే మాట్లాడుతున్నంత మాత్రాన అది అందఱి స్వామ్యమూ అయిపోదు, పులిని చూసినవాడల్లా వేటగాడు కానట్లే! అందఱికీ రక్షణ అవసరమే గానీ అందుకోసం అందఱి చేతుల్లోనూ తుపాకులు పెట్టలేం. దానికి భటశాఖ (police department) ఉంది. సాఫ్టువేర్లు వాడుకునేవారంతా ఆ శాస్త్రం చదివినవారు కారు. వాహనచోదకు అంతా ఆటోమొబైల్ ఎంజినీరింగ్ పట్టభద్రులూ కారు. వారు తమకేం కావాలో తెలిసినవారు మాత్రమే. దాని కోసం ఏం చేయాలో తెలిసినవారు కారు. అలాగే, భాష అంటే అభిమానం ఉండడమూ, దానికి ఏదైనా చేయగలగడమూ ఒకటి కావు. మొదటి దానికి మనసు చాలు. రెండోదానికి శిక్షణ కావాలి.

ఇది కూడా ఆదిమకాలమైతే బావుండేది, అన్నీ ప్రజల చేతుల్లో పెట్టి మనం ఇంట్లో పడుకొని సుఖంగా నిద్రపోయేవారం ! మానవజాతి శైశవదశలో ప్రాకృతికంగా ఎదిగినప్పటి పరిస్థితుల్ని ఇప్పుడు యథాతథంగా అనుకరించలేం, అనుసృజించ లేం. ఆనాటి భాషావసరాలూ, ఈనాటి భాషావసరాలూ అచ్చుమచ్చుగా ఒకటి కావు. ఆనాటి అవసరాలు తీర్చడానికి మామూలు ప్రజలు సరిపోయారు. ఇప్పుడు నిపుణులు కావాల్సిందే. ఎంత ప్రజాస్వామ్యమైతే మాత్రం ప్రజలు ఎన్నింటి గుఱించి ఆలోచించగలరు? రోజువారీ బతుకుబండి గుఱించా ? పర్యావరణం గుణించా ? అవినీతి గుణించా ? ఎవఱి గొడవలు వాళ్ళవి. ఎవఱి తిప్పలు వాళ్ళవి. మఱోపక్క నాగరికత చాలా ముందుకొచ్చేసింది. సమాజం చాలా వివిధీభవించింది. విశేషజ్ఞతలు (specializations) ముదిరాయి. ఒకటి జీవనరంగం ఇంకొకటికి అర్థం కాదు. అందఱినీ భాష గుణించి ఆలోచించమని కోరలేం. ఎవఱు ఏది ఆలోచించాలో వాళ్ళే అది తప్పనిసరిగా ఆలోచించాలి.

వ్యావహారికవాదం వేస్తున్న వెట్టితలలతో తెలుగుభాషకీ,
నూతన పదనిష్పాదనకీ వాటిల్లుతున్న అపారనష్టం

వ్యావహారికవాదాన్ని మొదట్లో ప్రారంభించిన కీ.శే. గిడుగు రామమూర్తి పంతులుగారు అనుకున్నది వేఱు. ఇప్పటి వ్యావ హారికవాదులు చేస్తున్నది వేఱు మాట్లాడే భాషలోనే 'అన్నీ' వ్రాయాలని గిడుగు రామమూర్తిగారు అనలేదు. మాట్లాడే భాషకి ఉన్న పరిమితులు ఆయనకు తెలుసు. ఆయన కోరినది వ్యాకరణపరమైన వ్యావహారికం (colloquial grammar). పదాలవారీ వ్యావహారికం (colloquial wording) కాదు. పైగా ఆయన వాదంలో అనువాదాంశాలకు అంతగా చోటు లేదు. ప్రాథమికంగా ఆయన కోరినది విద్యావంతులు మాట్లాడే శిష్టవ్యావహారిక ప్రయోగం. అంటే "వచ్చుచున్నాను" అనే పుస్తకశైలికి బదులు "వస్తున్నాను” అని ఉండాలని ఆయన కోరారు. కానీ ఈ రోజున చాలామంది ఆయన పేరుతో తమ సొంత కార్యావళులుఅమలు జఱుపుతున్నారు. పుస్తకాలలో ఉన్న అన్ని శాస్త్రసాంకేతిక పదాల్నీ వ్యావహారికం (ఇప్పుడీ పదాని కర్ణం ఇంగ్లీషు) చేసిపారేయమని ఆయన ఎక్కడా చెప్పలేదు. అదే విధంగా తెలుగు వర్ణమాల (Alphabet) ని కుదించమనీ ఆయనెక్కడా చెప్పలేదు. వ్యావహారికం పేరుతో కులమాండలికాలూ, ప్రాంత మాండలికాలూ వాడమని కూడా ఆయన చెప్పలేదు. ఎలా మాట్లాడుతున్నామో ఆ ఉచ్చారణ విధానాన్నంతా యథాతథం గా లిపిబద్ధం చేసేయమనీ అయన అనలేదు. కానీ ఈ అన్నింటికీ పూనుకుంటున్నారు మన సమకాలీన వ్యావహారిక వాదులు. ఒక ఆలోచన మేధావుల సొత్తుగా ఉండేనాటికీ, అది జనంలోకి వెళ్ళేనాటికీ నడుమ ఏ విధంగా రూపుచెడి, గుర్తుపట్టరానంతగా మారిపోతుందో, దానికి ప్రతివారూ ఏ విధంగా తమ తమ సొంతవ్యాఖ్యానాలివ్వడం మొదలుపెడతారో బహుశా ఇదొక నిదర్శనం.

వ్యావహారికవాదం కేవలం తెలుగుభాషకి పరిమితం కాదు.