Jump to content

పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రూపాలనూ ఎటువంటి దాపరికాలకూ పోకుండా కథలుగా మన కళ్లకు కట్టి చూపాడు.

నాకు వారితో సాహిత్య నేస్తమే కాక రోగానుబంధం కూడా ఉంది. వారికి మధ్య వయస్సులో ఆస్తమా జబ్బు ఆవహిస్తే, నాకు బాల్యం నుంచీ పీడిస్తూనే ఉంది. ఇద్దరమూ కలిసినప్పుడు మా జబ్బుల గురించే చర్చ జరిగేది. “ఇది జబ్బు కాదయ్యా ఒక వరం! ప్రపంచం లోని గొప్పవారంతా ఆస్తమా పీడితులే. కాబట్టి దాని గురించి ఆలోచించడం మాని, మంచి గ్రామీణప్రాంతం నేపథ్యంలో ఒక మంచి నవల రాయడానికి యత్నించు” అని చెప్పేవాడు. గత పది నెలలుగా వారి అనారోగ్యం గురించి తెలుసు. రోజూ ఫోనులో మందుల గురించి మాట్లాడుకొనేవారం. మొన్న జనవరి 25 నాడు వారిని పలకరించడానికే అనంతపురం వెళ్లడం జరిగింది. ఆ రోజుకూడా “సడ్లపల్లీ ఈ చలికాలం నన్ను బతకనీయదయ్యా! త్వరగా పోతే నయమనిపిస్తూ ఉంది అని డీలాగా మాట్లాడారు. నవల రాయడం మొదలు పెట్టావా?”అన్నారు. “లేదు లే సార్‌! ఈ నెల ఓపికపడితే ఎండాకాలం వస్తుంది మీరు కోలుకొంటారు” అన్నాను. అవే మా ఇద్దరి మధ్యన-చివరి మాటలు.

వారు భౌతికంగా మననుంచీ దూరమ్హైనా విలువైన, సామాజికస్పృహ కలిగిన ఎన్నో రచనల్ని వారసత్వసంపదగా సమాజానికి అందించి పోయారు. తెలుగుభాష ఉన్నంతవరకూ వారు తన రచనల రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు.

సడ్లపల్లె చిదంబరరెడ్డి 94400 73636 —————————————————————————————————————————————————————————————————————————————————————————————————————


మైదుకూరులో ఘనంగా మాతృభాషాదినోత్సవం 

పుస్తక పఠనం ద్వారా 'ప్రాపంచికజ్ఞానాన్ని అపారంగా పొందవచ్చునని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్ల సభ్యుడు, కథారచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి పేర్మాన్నారు. మైదుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు భాషోద్యమసమాఖ్య మైదుకూరుశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ భాషాసంపదను, ప్రపంచజ్ఞానాన్ని ఇనుమడింప చేసుకోవచ్చునని చెప్పారు. సమాఖ్య గౌరవాధ్యక్షుడు టి. మహానందప్ప తెలుగుభాషలో పదసౌందర్యాన్ని వివరించారు. జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు ఎల్‌. సూర్యనారాయణరెడ్డి, ఎ. బాలగంగాధరరావు, ధర్మిశెట్టిరమణ. తెలుగుభాషోద్యమ గీతాన్ని ఆలాపించారు. కార్యక్రమంలో పాల్ళొన్న విద్యార్థులకు సామెతలు పోడుపుకథలు, తెలుగుపౌరుషం పుస్తకాలను బహుమతిగా అందజేశారు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

47