Jump to content

పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రద్దాంజలి

మాండలికాలకు మెరుగులద్దిన పోరంకి దక్షిణామూర్తి

ఒకరి భాష మాండలికం, మరొకరిది భాష అనుకొనేవారికి కౌశలం అనే పదం పుట్టుక తెలిసి వుండకపోవచ్చు. దాని అర్ధం “నేర్చుగా గడ్డి కోయడం” అనే. ఒకప్పుడు మాండలిక ప్రయోగంగా మొదలై ప్రామాణిక భాషలో విశిష్ట పదంగా పాతుకుపోయినదని తెలుసుకొంటే మాండలికాల పట్ల తప్పుడు అభిప్రాయాలను నిరసించడమేకాదు ప్రతి మాండలికమూ భాషే ప్రతి భాషా ఒక మాండలికమనే అవగాహానకు రాకపోరు. అంటే భాషలూ మాండలికాల మధ్య తేడా సామాజికపరమైన తేడాయే గానీ భాషాపరమ్టైనది గాదు. మాండలికానికి ప్రాంతీయ పరిధులు ఉంటాయి. ప్రాంతీయతను దాటగలిగితే భాషా స్థాయిని చేరుకున్నట్లే. ప్రామాణిక భాష అనేది అలాంటిదే. రాత నేర్చిన మాండలికం ప్రాంతీయత నుండి బైటపడుతుంది. అది అన్ని ప్రాంతాలవారికీ పరిచయమౌతుంది. వాడుకలోకి వస్తుంది. సందర్భాన్ని బట్టి అలాంటి వాడుక అనివార్యం కావొచ్చు. ఇలాంటి ఆలోచనలతోటే ఆచార్య పోరంకి దక్షిణామూర్తిగారు దశాబ్టాలుగా చేసిన ప్రయత్నాలూ ప్రయోగాలూ మాండలికాలకు ప్రాంతీయత నుండి బైటపడేసి సార్చజనికతను అందించేందుకే పాతికేళ్లు నిండకమునుపే వెలుగూ వెన్నెల-గోదారి అనే పేరుతో ఒక నవలనే గోదావరి తీర జానపదుల మాండలికంలో రాశారు. అంతటితో ఆగక, “ముత్యాల పందిరి” పేరుతో తెలంగాణ మాండలికంలోనూ, “రంగవల్లి " అనే పేరుతో రాయలసీమ మాండలికంలోనూ నవలలు రాశారు. ఇలా మాండలికాలలో రాసిన నవలలు బహుమతులు పొందాయంటే అందరి మన్ననలను పొందాయనేగదా. మాండలికంలో రాస్తే ఎవరు చదువుతారు? ఎవరికి అర్థమౌతుంది అన్న కొందరి మాటలను వమ్ము చేస్తూ మాండలికాలలో రచనలు ఇతర ప్రాంతాలవారికి బొత్తిగా అర్ధం కానంతగా ఉండవని నిరూపించారు. మాండలిక రచనలతోటే భాషలో ఉన్న పలుకుబడులన్నీ భాషాభివృద్ధికి తోడ్పడుతాయని నమ్మారు. భాషలో పరిభాష పెరగడానికి వీలుగలుగుతుందని అశించారు. అందుకనే ఆధునిక ప్రామాణిక భాషలో చేసిన రచనలకంటే మాండలిక భాషలో చేసిన రచనలే చదువురాని జన సామాన్యానికి చేరతాయనడంలో సందేహం లేదంటారు. సాహిత్యాన్ని చదువురానివాళ్లకు కూడా అందించే మంచి సాధనం మాండలికం అంటారు పోరంకివారు.

పోరంకి దక్షిణామూర్తిగారు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి దగ్గర భాషాశాస్త్ర శిక్షణ పొందిన మొదటి తరం సాహిత్యకారుల్లో ఒకరు. ఆచార్య భద్రిరాజుకృష్ణమూర్తిగారు తెలుగు భాషకు సమగ్ర నిఘంటు నిర్మాణం కోసం తలపెట్టిన అపురూప అధ్యయనంలో రెండో సంపుటంగా వచ్చిన చేనేత పదకోశ సంకలనంలో ప్రథాన పాత్ర పోషించి నేత వృత్తిలో వాడే పదజాల సేకరణలోనూ నిఘంటు నిర్మాణంలోనూ క్షేత్ర పరిశీలనకు కావలసిన భాషాశాస్త్ర పరమైన శిక్షణ పొందడమేగాక ఆ కోశ సంకలనంలో సహరచయితగా చేనేత పనిగురించి కథనాత్మక వివరణ అందించారు . ఈ శిక్షణే ఆ తరువాత మేదర పరిశ్రమకు సంబంధించిన మాండలిక వృత్తి పదకోశానికి సంపాదకులుగా 1991లో సంకలనం చేసి ప్రకటించడానికి ఉపయోగపడింది. మేదర వృత్తి పదకోశంలో మేదర వృత్తిలో వాడే కత్తులలో సుమారు పంతొమ్మిది రకాలను బొమ్మలతో సహా గీయించి అందించారు. ఉదాహరణకు, వాటిలో కొన్ని ఒడ్డుకత్తి, నరుక్కత్తి, మేదరికత్తి, మూపురంకత్తి, మచ్చుకత్తి, పడగకత్తి, చురకత్తి, గౌరసకత్తి, రేకత్తి, నిలువుకత్తి, పడకత్తిలాంటివి ఎన్నోతెలుగునాట వివిధ వృత్తులలో వాడే తెలుగు భాష విస్తృతికి ఆనవాళ్లు.

భాషకు సంబంధించినంతవరకూ ఆయనొక జాతీయవాది.జాతీయభాషల్లో ఒకటి గొప్పదీ మరాకటి తక్కువదీ అన్న దురభిప్రాయాలకు తావుండకూడదంటారు. ప్రయత్నిస్తే జాతీయ స్థాయిలో సర్వ జనామోదయోగ్యమైన పరిభాష రూపొందించు కోవచ్చునని నమ్మినవారు. అయితే అనువాదాల దగ్గర మాత్రం భాషల వైయక్తిక సహజ నిర్మాణ పద్ధతికి సడలింపు లేదంటారు. ఆధునిక వ్యావహారిక భాషస్థానే గ్రాంధిక భాషను బోధనాభాషగా కొనసాగించడాన్ని నిరసిస్తూ గురజాడ ప్రకటించిన అసమ్మతి పత్రాన్ని పోరంకివారు 'డిసెంట్‌నోట్ ' గా ఆంగ్లంలోకి అనువదించడంతో అది ఒక చారిత్రాత్మక పత్రంగా పేరు పొందింది.

ఫోరంకి దక్షిణామూర్తిగారు బహు గ్రంథకర్త. వందలాది కథలను ప్రకటించారు. కథానికకు ఒక ప్రామాణిక నిర్వచనాన్ని అందించే ప్రయత్నం చేశారు. వారు స్వయంగా రచయితగా రాసి ప్రకటించినవిగాక, అనువదించి ప్రకటించిన గ్రంథాలే ముప్పైకి పైగా ఉన్నై. తెలుగు సాహిత్యంలోనేగాక భాషాశాస్త్రంలో గూడా ఆధునిక అవసరాలకు అనుగుణంగా తమవంతు కృషి చేసి తెలుగు భాషను పరిపుష్టం చేశారు. కథలూ, నవలలూ, నిఘంటువులూ, అనువాదాలూ, సమీక్షలూ, తెలుగు బొధనలోనూ, సామాజిక భాషాశాస్త్రం, శైలీశాస్త్రం, మొదలైనవాటన్నింటిలోనూ ప్రవేశించి భాషపట్ల తాను నమ్మిన ఆధునికభాషాశాస్త్ర భావ ప్రేరణతో ఎన్నో వ్యాసాలను ప్రకటించారు. తెలుగు భాషలో భాషాసంబంధిరచనలేగాక “ఆధ్యాత్మిక వారసత్వం” పై వారు ప్రకటించిన వ్యాస పరంపర వారి వైవిధ్యభరితమైన వైయక్తిక జీవితానికి మరో కోణం. వేదాలతో మొదలెట్టి యోగవిద్యవరకూ భారతీయ ఆధ్యాత్మికతా తీరు తెన్నులనుఎత్తిచూపుతూ భిన్నత్వంలో ఏకత్వాన్నీ ఆధ్యాత్మిక గురుపరంపర ద్వారా మనకందిన ఆద్యాత్మిక చింతననూ గురించి వివిధ వ్యాసాలరూపంలో మనకు అందించారు.

ఇంతటి వైవిధ్యభరితమైన రచయితగా, రెండు పదులు నిండకమునుపే రచనా జీవితాన్ని మొదలుపెట్టి ఎనభైఆరేండ్ల వరకూ భాషావ్యవసాయం సాగించిన పోరంకి దక్షిణామూర్తిగారు భౌతికంగా మననుంచి దూరమైనా వారి రచనలు ఇంకెంతో కాలం మనని పలకరిస్తూనే ఉంటాయి.

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 98661 28846 [[rh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021||45}}