"ధారావాహిక"
ఈమని శివనాగిరెడ్డి 98485 98446
అడుగుజాడలూ ఆనవాళ్లు-7
నా కనిగిరి - దొనకొండ యాత్ర
నేను వారసత్వ స్థలాలు, చారిత్రక కట్టడాలను చూడటానికి పల్నాడు వెళ్తున్నప్పుడల్లాా మా ప్రకాశం జిల్లా క్కూడా రావచ్చు గదా అని ప్రముఖ చరిత్రకారుడు విద్వాన్ డా॥జ్యోతి చంద్రమౌళిగారన్నమాట గుర్తుకొచ్చింది. గుర్తుకురావటమే కాదు. పల్నాడుకు పయనం కట్టినపుడల్లా ఆయన నా కళ్లముందు వాలిఫోతుండేవాడు. అయినా అటువైపు వెళ్లటం కుదిరేది కాదు. ఎప్పటిలాగే ఒక శనివారంనాడు పల్నాడులోని మాచర్ల, జమ్మలమడక తుమ్రుకోట, మల్లవరం, చూచిరావడానికి ఏర్పాట్లు చేసుకొని తెల్లవారుఝాము 3 గం॥ లకు బయలుదేరి మాచర్ల వైపు వెళ్తామని డ్రైవర్ శివకు చెప్పి, సంచి సర్జుకుంటున్నానోలేదో, జ్యోతిచంద్రమౌళిగారు ఫోనుచేసి, అద్దంకి రమ్మని నాచేత ఒప్పించి, దారి మళ్లించారు. రాత్రి 9గం॥ లకు అన్నంతిని మళ్లీ ఆఫీసుకెళ్లి ప్రకాశం, గుంటూరు జిల్లాల మ్యాపులు తీసుకొని ప్రయాణం గురించి డైవర్‌కు, నా సహోద్యోగి దుర్గాసాగర్‌కు తెలియజేసి, ఇంటికొచ్చి పడుకొన్నాను. నిద్దరపడితేగా. ప్రకాశం జిల్లా అనగానే అద్దంకి పండరంగని శాసనం, ధర్మవరం జైన బసది, దర్శిదేవాలయం, పొదిలి కట్టడాలు, కనిగిరికోట కళ్లముందు ముసురుకున్నాయి. మానసిక తర్జనభర్జనల మధ్య మణికేశ్వరం, సురఖేశ్వరకోన పోదామనుకున్నాను. కాదు, కొణిదెన, చదలవాడ, చందలూరు అయితే బాగుంటుందనిపించింది. కాదు, కాదు, మాలకొండ, సింగరకొండ, సింగరాయకొండ, మిట్టపాలెం, చెన్నపల్లి చూద్దామనుకొన్నాను. ఇన్ని గందరగోళాల మద్య తన్నుకొని, తన్నుకొన, చివరికి కాటమరాజు తిరగాడిన కనిగిరి, పాలేటిగంగ, పంచలింగాల కొండ, పునుగోడు, గంగదొనకొండ, వల్లూరు, కురిచేడు వెళ్ళొస్తే బాగుండునని, మనసును స్టిమితపరచుకొన్నాను. వీరగాధలపై విస్తృత పరిశోధనలు గావించిన డా.తంగిరాల
వెంకటసుబ్బారావుగారు గుర్తొచ్చి ఈ పర్యటనా స్థలాల వరుసను ఎంపిక చేసుకోవడంలో పరోక్షంగా సహకరించారు. మారిన బాటగురించి డ్రైవర్‌కు, జ్యోతిచంద్రమౌళిగారికి తెలిపాను. చంద్రమౌళిగారేమో, అద్దంకి, ధర్మవరం, అనమలూరు, మణికేశ్వరం చూద్దామన్నారు. కాదని, నాచూపు ఇప్పుడు కనిగిరి వైపు అని కరాఖండిగా చెప్పాను. సరేనన్నా ఆయన కనిగిరి కరుణానిధికి ఒకసారి ఫోన్ చేయమన్నారు. అప్పటికే రాత్రి 11.00 గంటలైంది. కరుణానిధితో, తరువాతి రోజు కనిగిరి వస్తున్నాము. మొదటగా నేలటూరి గొల్లపల్లిలోని ఇనుప యుగపు సమాధులు చూద్దాం. ఉదయం ఆరింటికి సిద్ధంగా ఉండమన్నాను. అనుకున్నట్లుగానే 3.00 గం॥లకు బయలుదేరి 4.00 గం॥లకు చిలకలూరిపేటలో ఆగి, టీతాగి, గణపవరం మీదుగా అద్దంకి చేరుకుని, చంద్రమౌళిగారిని కారులో ఎక్కించుకొని, కనిగిరి చేరుకున్నాం. ఇంకా తెల్లవారలేదు. అలికిడి మొదలైంది. కరుణానిధి ఫోను ఎత్తటం లేదు. కంగారు మొదలైంది. ప్రత్యామ్నాయంగా చంద్రమౌళి మాష్టారు శిష్యుడైన ఇంకో ఉపాధ్యాయుని ఇంటికెళ్ళాం. ఆయన్ను లేపి అడిగితే రావటం కుదరదని చెప్పి, టీ తాగి పొమ్మని బలవంతం చేశాడు. ఇంతలో కనిగిరి కరుణానిధి ఫోను! తాను కనిగిరి సెంటర్‌లో ఉన్నానని! ఆనందానికి అవధుల్లేవు. సగం కప్పుటీని అలానే వదిలేసి కరుణానిధిని కలిశాం. ముందుగా సి.యస్.పురం రోడ్డులోని నేలటూరు- గొల్లపల్లికి బయలుదేరాం. అప్పుడే రాత్రి తెరతొలగించుకొని వెళ్ళిపోయింది. సూర్యుడు రాలేదు గానీ, వెలుగు రేఖలు పుంజుకుంటున్నాయి. పది నిముషాల ప్రయాణం తరువాత కారు ఒక కల్వర్టు దగ్గర ఆగింది. దిగి ఎడమవైపు చూస్తే, ఎప్పుడో కొట్టేసిన మోడువారిన చెట్ల మాదిరిగా, నిలువురాళ్ళు కనిపించాయి. చంద్రమౌళిగారు, ఇవే ఇనుపయుగపు ఆనవాళ్ళు అని చూపించారు. బాగా వెలుతురొచ్చింది. సూర్యుడు చెప్పాపెట్టకుండా ఎగబాకుతున్నాడు. గొల్లపల్లి రైతు ఒకాయన అటువెళుతుంటే వీటిని ఏమంటారని అడిగాను. ఇవి నిలువు రాళ్ళు, ఏనెలని కూడా అంటామని, ఈ నేలను నిలువురాళ్ల చెల్క అంటామన్నాడు. తమ పూర్వీకులు వీటిని పాండవుల గుళ్లు అనీ, రాక్షసబందలని పిలిచేవారని కూడ చెప్పాడు. నేను, చంద్రమౌళిగారు కలిసి దాదాపు 100 ఎకరాల్లో ఉన్న 30 నిలువురాళ్ళను ఒక్కోదాన్ని పలకరించాం. గతంలో ఇక్కడ 500 వరకూ ఉండేవని ఇళ్లకాలనీకి రోడ్డు, ప్లాట్లు వేసినపుడు తొలగించారని ఆరైతు చెప్పినపుడు నాకు చేతులు నరికేసినంత బాధేసింది. తెలుగు వారి తొలికాలపు సంతకాలు చెరిగిపోయాయనిపించింది. చారిత్రక ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకలించినట్లనిపించింది.
నిట్లూర్చటంకంటే ఏమీ చేయలేని మేం ఒకరినొకరు చూచుకొని సముదాయించుకొన్నాం. కరుణానిధి, నేను కలిసి ఒక పది నిలువురాళ్ల కొలతలు తీసుకొన్నాం . ఒక్కొక్కటి భూమిమీద 9.0 అడుగుల ఎత్తు, రెండు నుంచి ఆరు అడుగుల వెడల్పు, ఆరంగుళాల నుంచి అడుగున్నర వరకూ మందం కలిగి ఉన్నాయి. ఒకే ఒక చోట పంటకాలువ తీయటాన ఒకటి రెండు నిలువురాళ్ల పునాదులు కూడా కనిపిస్తున్నాయి. భూమట్టం నుంచి 5.0 అడుగుల లోతులో
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021
35