పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చదువు-ఆటలు

సి.వి. క్రిష్ణయ్య 93965 14554

అక్షరాలతో ఆటలు - 2

గత సంచికలో పిల్లలు భాషా సాహిత్యాలతో ఆనందించాలనీ, అందుకు లిపి నేర్చుకునేటప్పుడే అక్షరాలతో ఆటుకోవడం నేర్పాలని చెప్పుకొన్నాం. ఈ సంచికలో అక్షరాలతో ఆటలు ఎలా తయారుచేయాలో, ఎలా నేర్పాలో, పిల్లలు తెలుగు భాషను ఇష్టపడేటట్లు ఎలా చేయవచ్చో తెలుసుకొందాం.

ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా తరగతి గదిలో ఒకరిద్దరు పిల్లలు చురుగ్జా ఉండి, అన్నీ తామే చెబుతూ ఉంటారు. మిగిలిన పిల్లలుప్రేక్షకులుగా మిగిలిపోతారు. స్వయంగా ఆలోచించడం మరచిపోయి ఉంటారు. ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి పాల్గొనేలా ప్రయత్నించాలి. ఇందుకు రెండు పద్దతులు పాటించాలి. 1 జట్టు పద్దతి. (ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు) 2, ఏకాంతంగా ఒక్కరే పాల్గొనడం. ఏకాంతంలో ఆలోచిస్తారు. జట్టులో చర్చిస్తారు.

ప్రస్తుతం ౩వ తరగతి స్థాయి, ఆపై తరగతుల పిల్లలకు ఉపయోగపడేట్టు ఉన్న ఆటలు పరిచయం చేస్తున్నాను. ఒకే ఆటను పిల్లల స్థాయినిబట్టి తేలికనుండి క్లిష్నతరంగా ఉండేటట్లు పదజాలం పరిచయం చేయవచ్చు.

3వ తరగతి పిల్లల స్థాయి ఎలా ఉంటుంది? ఇప్పుడిప్పుడే కూడికూడి చదువుతూ ఉంటారు. సరిగ్గా రాయడం రాదు.

ఇప్పుడు మనం పిల్లలకు కొత్త పదజాలం పరిచయం చేయడంలేదు. వారికి తెలిసిన పదాలను బయటకు లాగి వాటిని పలురకాలుగా వాక్యాలలో ప్రయోగించి అర్దాలు తెలుసుకొనేటట్లు చేస్తున్నాం.

మన మెదడుకూడా కంప్యూటర్‌ లాంటిదే. కంప్యూటర్‌లో మనకు కావలసిన దానిని ఎలా వెదుకుతామో, అలాగే మన మెదడులో ఉన్న జ్ఞాపకాలను (జ్ఞానాన్ని వెలికితీయాలి. ఇందుకు మనం సరైన ప్రశ్నను సంధించాలి. మళ్ళీ ఎదురు ప్రశ్న వేసేటట్లు (సందేహించేటట్లు) ప్రశ్న ఉండకూడదు.


ఈ క్రింది ప్రశ్నలను చూడండి.

1.ఏదొ ఒక పదం చెప్పండి?

ఏ పదం చెప్పాలి? అనే ప్రశ్న ఉదయిస్తుంది.

2. ఒక చెట్టు పేరు చెప్పండి?

ఏ చెట్టు పేరు చెప్పాలి? అనే ప్రశ్న ఉదయిస్తుంది.

౩. ఒక పండ్ల చెట్టు పేరు చెప్పండి?

అరటి, మామిడి, జామ, సపోటా - ఇలా చాలా పదాలు వరసగట్టి వస్తాయి.

ఇలాగే భాషకు సంబంధించి “అ"తో వచ్చే పదాలు చెప్పండి. “క "తొ వచ్చే పదాలు చెప్పండి అని అడిగినప్పుడు ఆయా పదాలు వెంటనే గుర్తుకొస్తాయి. “క " గుణింతం చెప్పండి అని అడగడానికి, రాయమని చెప్పడానికి బదులు మొదటి అక్షరం దీర్హం ఉండే పదాలు (కాయ, పాప, తాత) రాయండి అని అడిగితే పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. 'ప 'గుణింతం ఉన్న పదాలు రాయండి. (పిలక, పీట, పూలు, చేప సపోటా) అని అడగవచ్చు. కేవలం ఒక అక్షరానికి సంబంధించి గుణింతం (క్ర,కా,కి, కీ, కు...... ) రాసినందువల్ల పిల్లల్లో ఆలోచనలు రావు.

ఇందులో సృజనాత్మకత లేదు. విసిగిపోతారు. ఇంతకంటే మెరుగైన పద్ధతులు చాలా ఉన్నాయి.

తెలుగు భాషలో ప్రాసకు చాలా ప్రాధాన్యత ఉంది. అకారాంత, ఉకారాంత పదాలు (పలక, పడక) (వారు, తాడు) ఎక్కువ. ఇలాగే అచ్చతెలుగు ద్విత్వాక్షర పదాలు (అట్ట, జిడ్డు) కూడా ఎక్కువే. ఈ పదాలతో ప్రాసవచ్చేటట్లు ఆటలు రూపొందించుకోవచ్చు.

1. కాలు, పాలు.....(చివర “లు” ఉండే పదాలు రాయండి)
2. పాము, రాము.....(ఛివర “ము” ఉండే రెండు అక్షరాల పదాలు రాయండి)
౩. అట్టు, చెట్టు.....(చివర “ట్టు” ఉండే పదాలు రాయండి)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

19