పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యాశాఖామంత్రుల సమావేశంలో భాషాపరమైన మైనారిటీల మాతృభాషల్లో విద్వార్షన హక్కును గూర్చి ప్రత్యేకంగా నొక్కిచెప్పారు మౌలానా ఆజాద్‌. వివిధ రాష్ట్రాల్లో ఉన్న భాషాపరమైన మైనారిటీల మీద ఆయా రాష్ట్రాల్లోని మెజారిటీ భాషల్ని రుద్దడంగూర్చి ఆందోళన వ్యక్తం చేశారు. భాషాపరమైన మైనారిటీలు ఉపయోగించే భాషలు కూడా భారతీయ భాషలే కాబట్టి విద్యార్ధన కోసం / బోధనా మాధ్యమంగా వాటిని ఉపయోగించడంలో ఏలాంటి సమస్యా ఉండకూడదన్నారు. మన లక్ష్యం ఐక్యతను సాధించడమైనప్పటికీ ఐక్యత అనేది మెజార్టీ భాషల్ని రుద్దడం ద్వారా సాధించలేమన్నారు. అందుకే సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కనీస సంఖ్యలో విద్యార్ధులుంటే ప్రాధమిక స్థాయిలోనూ, తగినంత మంది కోరితే మాధ్యమిక స్థాయిలోనూ విద్యాబోధన భాషాపరమైన మైనారిటీల మాతృభాషలోనే జరగాలని ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. పిల్లల మాతృభాష ఏదో వాళ్ళ తల్లిదండ్రులు తప్ప మిగిలినవారు నిర్ణయించగలరా అని ప్రశ్నించారు. కొత్తగా సంపాదించుకొన్న స్వాతంత్రం సందర్భంలో భాషా సమస్యకు సంబంధించి సంతృప్తికరమైన సమాధానాన్ని సాధించడం అత్యంత ప్రధానమైందన్న ఆజాద్‌-మాతృభాషలాంటి ప్రాధమిక విషయాలకు సంబంధించి సమస్యలు వచ్చేవిధంగా మనం ప్రవర్తిస్తే అది మన జాతిజీవనానికే ప్రమాదం కలుగజేస్తుందని హెచ్చరించారు. కాబట్టి భాషాపరమైన మైనారిటీల మాతృభాషల్లో విద్యాబోధనకు సంబంధించి విశాల హృదయంతోనూ, ఉదారంగానూ వ్యవహరించాలని ఆకాంక్షించారు. (సంపుటి. 4,పు. 118-123).

భాషాపరమైన మైనారిటీలకు వారి భాషల్లో విద్యాబోధన మాధ్యమిక స్థాయి వరకు మాత్రమే యివ్వగలమనీ, యూనివర్సిటీ విద్యకై వారు తామున్న రాష్ట్ర భాషను తప్పకుండా నేర్చుకోవాల్సిందేననీ ఖచ్చితంగా చెప్పారు మౌలానా అజాద్‌. 1949 మార్చి 18న కేంద్ర శాసనసభలో మొత్తం విద్యనంతటినీ - ప్రాధమిక స్థాయి నుండీ యూనివర్సిటీ స్థాయి వరకు - మాతృభాషలోనే ఎందుకివ్వకూడదు అని మౌలానా హజ్రత్‌ మోహాని (ఉత్తర ప్రదేశ్‌) మౌలానా ఆజాద్‌ను ప్రశ్నించాడు. ఉర్ధూ మాధ్యమంలో ఉన్నత విద్య ఎందుకివ్వకూడదనేది హజ్రజత్‌ మోహాని పరోక్ష ప్రశ్న. దీనికి సమాధానమిస్తూ మాధ్యమిక స్థాయి వరకూ అది సాధ్యమేనని, కానీ యూనివర్సిటీ విద్యమాత్రం ఒకే రాష్ట్రంలోని వివిధ భాషల్లో ఉదాహరణకు హిందీ, ఉర్లూ లేదా తెలుగు, ఉర్ధూ - యివ్వడం కుదరదని యూనివర్సిటీ విద్యమాత్రం ఒక ప్రాంతంలోని ఒకే ప్రాంతీయ భాషలో ఉండాలన్నారు. మాతృభాషలో విద్వాభ్వాసానికిసంబంధించి హజత్‌ మోహాని చాలా దూరం వెళ్ళారు. చాలా ఆదర్శంగా ఆలోచించారు. వాస్తవానికి పరిస్థితులు భిన్నంగా ఉండినాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌-భాషాపరమైన మైనారిటీల మాతృభాషలో విద్యార్దనకు సంబంధించిన హక్కును ఉల్లంఘిస్తున్నాయని తనకు అనేక ఫిర్యాదులందుతున్నాయని మౌలానా ఆజాద్‌ తెలిపారు. (ప్రాధమిక, మాధ్యమిక స్థాయిలకు సంబంధించే పరిస్థితి ఇలా ఉంటే, యూనివర్సిటీ విద్యగూర్చి ఎలా ఆలోచించగలమనేది అజాద్‌ వాదన.) ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తోందని, త్వరలోనే వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. (సంపుటి. 4,పు. 85)

స్వాతంత్య్రం సిద్దించాక దేశంలోని వివిధ వ్యవస్థలను ముఖ్యంగా విద్య, సాంస్కృతిక రంగాలను నిర్వలసీకరించడంలో వలస భావాలనుండి విముక్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు మౌలానా ఆజాద్‌. అంటే జాతీయ పునాదిపై సదరు రంగాలను గట్టిగా రూపుదిద్దాలనుకున్నారు. భారత దేశ విద్య, అందులోనూ మాతృభాషలో విద్య స్త్రీ విద్య, మైనారిటీల విద్య పట్ల మౌలానా ఆజాద్‌ ప్రదర్శించిన క్రాంతదర్శిత్యం ద్యోతకమవుతుంది. ఎందుకంటే ఆయన లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ఆయనే సూచించిన సమాధానాల సాధన దేశంలో కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగల అంశాల్లో విద్య ప్రాణసమానమైందని గుర్తించాడు అజాద్‌. ఏకకాలంలో విద్యను ప్రజాస్వామీకరించడం విద్యలో భాషను ప్రజాస్వామీకరించడాలను పరమ లక్ష్యాలుగా గుర్తించాడాయన. సాంకేతిక విద్య బలాన్ని పరిగణించాడు. సామాజిక శాస్త్రాల ఆత్మిక సౌందర్యాన్ని విస్మరించలేదు. విద్యకు సాంస్కృతిక రంగాలతో ఉన్న భావసారూప్యతను నిలబెట్ట దలచాడు. ఆంగ్లం దేశంలో వివిధ భాషల 'ప్రజల మధ్య భావ సంశయాన్ని అనుసంధానం చేస్తే దాన్ని గౌరవిస్తూనే దేశభాషల అభివృద్దిద్వారా వాటి ఆత్మగౌరవాన్ని దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని నిలబెట్టటానికి పూనిక వహించాడు. వర్తమాన దేశ విద్యా వ్యవస్థ సాగుతున్న దిశలో సాధించిన విజయాలు మౌలానా ఆజాద్‌ ప్రారంభించినవేనని, ఎదుర్కొంటున్న అపజయాలు, సవాళ్ళు ఆయన దృక్పధాన్ని సాకారం చేసుకోవడంలో మనం మిగుల్చుకున్న వైఫల్వాలేనని ఆయన ప్రతిపాదనలు రుజువు చేస్తున్నాయి.

డాక్టర్‌ షేఖ్‌. మహబూబ్‌ బాషా మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్జూ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో సహాయ ఆచార్యులు డాక్టర్‌ మొహమ్మద్‌ కరీం రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ఐ.క్వూ.ఏ.సీ., మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

18