పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మశ్రీ గౌరవాన్ని పొందిన

ఆదివాసీ కళాకారుడు కనకరాజుకు జేజేలు

భారత గణతంత్ర దినోత్సవంనాడు ఒక గురువు, నిరుపేద ఆదివాసీ కళాకారుడు కనకరాజుకు 'పద్మశ్రీ' గౌరవాన్ని అందించి కేంద్ర ప్రభుత్యం ఆలస్యంగానైనా మంచిపని చేసింది. మూలవాసుల భాషాసంస్కృతులను గౌరవించినట్లయింది.

గోండి ఆదివాసీ ఆట దండారి కళాకారుడు కనకరాజు గణతంత్ర దినోత్సవంలో, ఇందిరాగాంధి, జ్ఞానీ జైల్‌ సింగ్‌, అబ్బుల్‌ కలాం వంటి మహామహుల ముందు ప్రదర్శనలిచ్చాడు. దశాబ్దాలుగా ఆ ఆటను యువతరానికి నేర్చుతున్నాడు. ఆయనకు ఇప్పుడు పద్మశ్రీ పురస్మారం రావటం, గోండ్వానాతో, దండకారణ్యంతో ముడిపడిన ఆ సంస్కృతికి, వారి కళకు గుర్తింపునిస్తుంది. ఆశ్రమపాఠశాలలో కూలీగా పనిచేస్తున్న తనను ఈ పురస్మారంతో పాటు ఇచ్చే నగదు కొంతైనా ఆదుకొంటుందని ఆశపడుతున్నాడు. ఇటువంటి కటిక దరిద్రం లోకూడా తమ తము సమష్టి నంప్రదాయాలను నిలబెట్టుకోవాలనే ఈ మూలజాతులకు జేజేలు పలకాలి.

మొక్కజొన్న పంట చేతికందే దీపావళికి ఊరూరా తిరుగుతూ జరుపుకునే గోండులు పండుగలో, తప్పిదాల వల్ల శాపగ్రస్తులైన, తమ పూర్వులు ఒక గుహలో బందీ కావటం, మహాదేవుని మనసు కరిగేలా వారి కష్టాలను గానం చేసి వినిపించిన నృత్య గాన దేవతలను ఆహ్వానిస్తూ 16 వాయిద్యాలు, 18 నృత్తరీతులతో ఆడేదే ఈ డండారి.వారిని ప్రసన్నం చేసుకుని, వారి పరమగురువు పహండికూపర్‌ లింగాల్‌ నాలుగు గోత్రాల వారికి, నాలుగు జెండాలు, నలుగురు దేవతలను ఏర్చరచి, వారిని వ్యవసాయంలో స్థిరపరచటంలో ఒడిదుడుకులు ఈ పాటలు, తంతులో కథావస్తువు. ఈ దండారిలో నెమలీకలు ధరించి తలపాగాలో అద్దాలు, పూసలు, గవ్వలతోపాటు జింక, మేకకొమ్ములు; చేతికర్ర, భుజాన జింక, పులిచర్మాలతో అలంకరించుకునే గుసాడీ ఈ బృందంలొ ప్రత్యేక అకర్షణ. గుసాడీలు ఒళ్ళంతా ఊపుతూ ఆడుతుంటే, వాయిద్యాలు మోగుతుంటే, వారు వేసుకున్న గుల్లలు, గంటలు, బెండ్లు లయాన్వితంగా చప్పుడు చేస్తుంటాయి. డెంసా పాటలు పాడుతూ గుమ్మెల దరువులకు అనువుగా పార, తుర్చులి, డప్పు, పిప్రి, కాలికోం వంటి వాద్యాలు వాయిస్తూ పర్దాన్‌, కొలాం, తోటి తెగవారు కూడా పాల్గొంటారు. మథ్యలో ఖేల్‌ అంటే రాజకీయ సామాజిక పరిస్థితుల మీద చిన్న నాటికలు వేస్తారు. “గోండుదేవతలను ఆరాధిస్తూ భజనలు చేస్తారు. పక్మన మహార్యాష్టలో పండరి భజనలో లాగా ఒకరు స్త్రీ వేషం వేసుకుని భజనలకు అనుగుణంగా నర్తిస్తారు.. ఇలా భక్తిని రక్తిని ముక్తిని మేళవించుకున్న విశిష్టమైన పరంపర ఈ దండారి.

కొమరం తిరుగుబాటును అణిచివేశాక ఈ జాతుల సంస్కృతి, అభివృద్ధి సమస్యలను అర్థం చేసుకోడానికి మానవ శాస్త్రవేత్త హైమెండార్భ్‌ను నాటి ప్రభుత్వం పిలిపించింది. ఆయన చెంచు, కొండరెడ్డి, గోండు జాతులను అధ్యయనంచేసి, నిజాం ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. ఆయన శిష్యుడు మైకేల్‌ యార్క్‌ వారి ఆటపాటలను ఫిల్మ్‌గా తీశారు. 1977లో పి.యస్‌. సుబ్రహ్మణ్యం, తరువాత గారపాటి ఉమామహేశ్వరరావు గోండు భాషను అధ్యయనం చేశారు. జయధీర్‌ తిరుమలరావు మరుగుపడిపోతున్న లిపిని ప్రచారంలోకి తెచ్చారు. అదిలాబాదు ఆకాశవాణి ద్వారా ఈ తెగల పాటలను రికార్డ్‌ చేయటమే కాక, గిరిజన సంక్షేమశాఖ ద్వారా మైకేల్‌ యార్క్ పర్యటనను ఏర్పాటుచేయటం, నాటి ఫోటోలు, ఫిల్ములు భద్రపరుస్తున్నారు. శక్తి శివరామకృష్ణ అటవీ హక్కుల గుర్తింపులో, పంచాయత్‌ రాజ్‌ చట్టం అమలుకు కరదీపిక తయారు చేసి శిక్షణనిచ్చారు. గిరిజనోద్యమ నాయకులు రాసిన 'అడవిలో వెన్నెల కథా సంకలనం నాటికీ నేటికీ గిరిజనుల సమస్యలకు అద్దం పడుతుంది. అల్లం రాజయ్య రచనలు ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తాయి. ఇందరి కృషిని రంగరించుకుని ముందుకుపోతూ దండారి వంటి గిరిజనుల ఆటపాటలు వృద్ధిలోకి రావాలని ఆశిద్దాం.

మూలవాసుల కళలతోపాటు వారి భాషలు కూడా ఎదిగేందుకు కనీనం ప్రాథమిక విద్యనైనా వారి సొంతనుడిలో చదువుకోనిచ్చేందుకు తగిన వసతులను, అవకాశాలను కలిగించాలి. వారు ఆరోగ్యంగా జీవించేందుకు, అభివృద్ధిచెందేందుకు ప్రభుత్యం అన్ని చర్యలు తీసుకోవాలి. “పద్మశ్రీని అందించి 'కనకరాజును గౌరవించడంతో సరిపెట్టుకోకుండా, డెబ్బదేళ్ల వయసులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో కలసి సుఖంగా జీవించేందుకు తగిన ఆర్థిక సహాయాన్నీ ప్రభుత్వం అందించాలి. -అమ్మనుడి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి. * ఫిబ్రవరి-2021

8