పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనికొచ్చేకథ

ఆదూరి హైమావతి 87902 24030


ఒక్క అలోచన ఊరినే మార్చెసింది!


పేదవాడైనా చాలా తెలివైన రాము, తన ఊరి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొత్తగా వచ్చిన సైన్స్‌మాస్టారు. పిల్లలకు ఎన్నో కొత్త విషయాలు చెప్పి ఉత్సాహపరచేవాడు. “మీలా చిన్నవయస్సులోనే ప్రయత్నించి చాలామంది ఆవిరియంత్రం, టి.వి, బల్బు, టెలిఫోన్‌, సైకిల్‌ వంటి అనేక వస్తువులు కనిపెట్టి మేధావులుగా గుర్తింపు పొందారు. మీరూ మీఊరి కోసం ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆలోచించండి. మీకేదైనా సాయంకావాలంటే నన్ను అడగండి” అని చెప్పేవారు.

రాము వాళ్ళనాన్న పొలం నీటి సౌకర్యంలేక బీడుపడింది. వాళ్ళనాన్న పరాయిచోట కూలిపని చేసి సంపాదించి తెచ్చిన సొమ్ముతో ఇంటిల్లిపాదీ పొట్టపోసుకుంటుండటం రాముకు చాలాకష్టంగా ఉంది. ఎలాగైనా తండ్రి కష్టమే కాక, ఊర్లో చాలామంది రైతుల కష్టం తీరేలాగా ఊరిపొలాలకు నీటిసదుపాయం ఎలా కలుగుతుందాని రోజూ ఎంతో సేపు ఆలోచించేవాడు.

ఒకరోజున సైన్స్‌ పాఠం జరుగుతుండగా బాగా వర్షం వచ్చింది. దూరంగా ఊరికి ఉత్తరంగా ఉన్నకొండల మీద పడ్డనీరంతా పల్లానికి ప్రవహించి పక్క ఊరి సరిహద్డుల్లోకి ప్రవహించడంచూసి, వాడిమనస్సులో ఒక ఆలోచనవచ్చి, క్లాస్‌లో ఉన్నానని మరచి, పెద్దగా “ఆపండి! ఆపండి!” అని అరిచాడు. క్లాసంతా రాము అరుపుకు నిశ్శబ్దమైపోయింది. సైన్స్‌మాస్టారు రాము దగ్గరికి వచ్చి, వీపుమీదకట్టి, “రామూ! ఏమైంది? ఎందుకలాఅరిచావు?” అని అడిగాడు.

రాము ఆలోచనల్లోంచీ బయటికివచ్చి, “మన్నించండి మాస్టారూ! ఏదో ఆలోచిస్తూ అలాపైకి అరిచినట్లున్నాను.” అన్నాడు. సైన్స్‌ మాస్టారు క్లాసయ్యాక రామూను దగ్గరికి పిల్చి అడిగి, వాని ఆలోచనను మెచ్చుకున్నాడు.

ఆ సాయంకాలం పిల్లలందరినీ మాస్టారు ఆ కొండవద్దకు తీసుకెళ్ళి, రామూ ఆలోచన వివరించారు. దాన్ని ఊరి వారికి వివరించను రామూ స్నేహితుల సాయంతో బంకమట్టితో ఒక మోడల్‌ తయారు చేశాడు. గ్రామపంచాయితీ సమావేశం ఏర్పాటుచేసి, సైన్స్‌మాస్టారి సాయంతో ఊరివారి కంతా కొండలు, నీరు ప్రవహించే దిశా, ఆ నీటిని ఆపను- ఒక చెరువు త్రవ్వాల్సిన విధానాన్నీ వివరించాడు.

మాస్టారు రామూ ఆలోచనను మెచ్చుకుని, 'ఊరివారంతా వెళ్ళి ఇతరులకు కూలీచేసేబదులు, తమ ఊరికోసం తామే కొంత శ్రమదానం చేస్తే, అందరికీ ఉపయోగమవుతుందని? అర్ధమయ్యేలా వివరించాడు. కొందరు ఈ చిన్నపిల్లవాని మాటలునమ్మి మేమంతా మాతిండి కోసం చేసే పనులు మానుకుని, కడుపులు మాడ్చుకుని అక్మడ తవ్వితే మా కుటుంబాలకు తిండి ఎలా వస్తుందీ?” అని మాస్టారును ప్రశ్నించారు.

“బాలకృష్ణుడు ఎంతవాడని, అంతా అతడ్నినమ్మి, కొండ క్రింద చేరారు? ఎలా ఇంద్రుడ్ని కాక, గోవర్ధనగిరిని, పూజించారు? మంచి మాట ఎవరు చెప్పినా మనమంతా వినాలి. నాకే తట్టని ఆలోచన ఇంత చిన్నవానికి తట్టింది, మీరంతా రండి నేను చూపుతాను. “అనిచెప్పి, అందర్నీ కొండ దగ్గరకు ఒక వర్షం పడేరోజు తీసుకెళ్ళి చూపారు మాస్టారు. అక్కడ కొండ మీద నుంచీ పారే నీటి వాలునుచూసి, ఒక పెద్దగుంత త్రవ్వించి దానికి అడ్డుకట్టవేయగా నీరు నిలిచింది.

“ఎటూ మీకు పనులులేవు. ఊరికే కూర్చునేబదులుగా, ఈసమయంలో మీఊరికోసం శ్రమించండి. రేపు చెరువు ఏర్పడి నీరునిండితే మీ పొలాలకే నీరువచ్చి పంటలు పండుతాయి కానీ, నాకేమి లాభం? ఆలోచించండి. “అన్నారు మాస్టారు.

అంతా అంగీకరించారు. పనిమొదలైంది. అందరూ అత్యుత్సాహంగా చిన్నపెద్ద ముసలీ ముతకా పారలు, పలుగులూ, తట్టలు, బుట్టలూ తీసుకుని పనిలోకి దిగారు. కొండలనైనా పిండి చేయగలది ఐకమత్యం అని నిరూపిస్తూ, కొద్దిరోజుల్లో ఒక చెరువు ఏర్పడింది. సైన్స్‌మాస్టారి కొడుకు సివిలింజనీరు. అమెరికాలో ఉద్యోగంచేస్తూ, తనదేశానికి అవసరమైన చోట తండ్రి సలహామేరకు సాయం చేస్తుంటాడు. అతడు సొమ్ము పంపాడు చెరువు కోసం. ఇంకా లోతుగా తవ్వితే నీరుబాగా నిలువ ఉంటుందని పట్నం నుండీ త్రవ్వేమిషన్‌ తెప్పించి పని చేయించారు మాస్టారు. బాగా ఆలోచించి మట్టి కాలువ కాకుండా సిమెంట్‌లనుతెప్పించి అందరి పొలాలకూ నీరు అందేలా బిగించి, పైపు పని పూర్తిచేయించారు మాస్టారు.

భగవంతుడు వారి శ్రమను, కష్టాన్నీ చూసి కరుణించాడా అన్నట్లు వారంపాటు భారీవర్షం పడి చెరువు నిండిపోయింది. అందరూ ఆనందంగా వానలో తడుస్తూనే నిల్చుని చూడసాగారు. అంతా దుక్కిదున్నుకుని రైతుకూలీలంతా తిరిగి రైతులయ్యారు. వర్షాధారయపొలాలన్నీ చక్కని పంటపొలాలయ్యాయి. ఆలోచన రామూది, భగవంతుని అనుగ్రహంతో సైన్స్‌మాస్టారు లాంటి మంచి మనసున్న గురువుద్వారా ఆ ఊరి కరువు తీరిపోయింది.

ఆ చెరువుకు 'శీరాంసాగర్ ' అని పేరు పెడదామని ఊరి పెద్దలకు చెప్పి వప్పించాడు రాము... శ్రీరాం -మాస్టారిపేరు, సాగర్‌ ఆయన కుమారుని పేరూ. ఊరివారంతా మహదానందపడ్దారు.

చూడండి ఒక బాలుని “ఆలోచన ఒకఊరినే మార్చేసింది” కదూ! మేధావులూ బాలలైనా పెద్దలైనా వారి మాటను పాటిస్తే మంచే జరుగుతుంది. -