పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరరసంలో ఊగిపోతాం తప్ప, ఆపాత్ర, సెక్సప్పీల్‌ వైపు మనద్బ్భష్టి పోదు. భైరప్ప మరో రచన 'వంశ వృక్ష 'లో కథానాయకుడికి చివరలో తను తండ్రికి కాక వేరొకరికి పుట్టినట్లు తెలిసి మనసు వికలమౌతుంది. ఇలా మొరటుగా కాక తన తండ్రికి బ్రహ్మోపదేశం ఇచ్చింది ఒక దళితుడు అని తెలిసి జ్ఞానోదయం అయింది అని మలుపు తిప్పితే బాగుండేది. అటువంటి కథలు ఎన్నో ఇతిహాస పురాణాలలో, జానపదులలో ఉన్నాయి. రవీంద్ర టాగోర్‌ ఇంటా బయటా, గోరా; ఉన్నవ మాలపల్లి, తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాలు,గయోపాఖ్యానం, రామాంజనేయయుద్దం, కొండ, నదులను పాత్రలుగా మలిచిన వసుచరిత్ర భావసంఘర్షణను అద్భుతంగా చిత్రించి మనసును ఊపేస్తాయి,

షేక్‌ స్పెయర్‌ టెంపెస్ట్‌ నాటకాన్ని ఆఫ్రికన్‌ రచయితలు వలస ప్రభావం నుండి బయటపడటానికి మలుచుకున్నారు. ఈ నాటకంలో కథానాయకుడికి ద్వీపాంతర శిక్ష లాంటిదేదో విధించారు.అతడు ఆ ద్వీపంలో కొందరిని లోబరుచుకుంటాడు. వారికి బానిసత్వం నుండి విడుదల చేసి, రాజ్యాన్ని అప్పగించి వెళతానని ఆశపెడతాడు. కాని చాలామంది ఎదురు తిరుగుతూనే ఉంటారు. స్వత్రంత్రం వచ్చాక బానిసలు ఉద్యోగులు, నాయకులుగా మారితే, బీదసాదలు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఈ కథ ఈ నాటికీ ఆఫ్రికన్‌లకు స్పూర్తి నిస్తుంది. అక్కడ కూడా కొందరు యూరోప్‌ పాలన ప్రభావం నుండి మాత్రమే కాదు., అంతకుముందు ముస్లిం పాలకుల ప్రభావం నుండి కూడా బయటపడాలని వాదించే చిన్వేజు లాంటి వారున్నారు. వారిని టార్జాన్‌ యుగంలోకి తీసుకుపోతున్నారని ఓలే సోఎంకా వంటివారు విమర్శిస్తుంటారు.ఇతర భాషలలో ఉన్న ఆఫ్రికన్‌ సాహిత్యం బోధించాలిగాని, ఆ భాషల చరిత్ర సాహిత్యం మనకు ఎక్కించే ప్రయత్నం తగ్గించాలని గుగి పోరు పెడతాడు. ఈ దశలలో రచనలను అమెరికాలో సాహిత్యం బోధించే హోమీ కే బాబా (naties)స్టానికులు, (sellers)స్థిరపడినవారు, (hybrids) అంటుమొక్కలు, విత్తనాలు, కళలు, (mimics) కాపీరాయుళ్ళుగా పేర్కొంటాడు. బెంగాలీ దీపేశ్‌ చక్రవర్తి అటు తన మాతృభాషలో, ఆంగ్లంలో అధోజగత్‌ సహోదరుల ఉద్యమ సంప్రదాయాలకు వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. ప్రపంచమంతా ఇంత చర్చ జరుగుతుంటే తెలుగులో మాత్రం, తీర్ధం తీర్దం, ప్రసాదం ప్రసాదంగా అనువాదాలు, సిద్ధాంతాలు, రచనలు, బోధనలు సాగుతున్నాయి. ఎదో గుంపుకు చేరబడి చతికిలపడుతున్నాయి. జీసస్‌ కిచ్చేది జీసస్‌కు, సీజర్‌ కిచ్చేది సీజర్‌ కు అన్నట్టు, తము చేసే ఉద్యోగాలు చేసే ప్రసంగాలు రచనలు దేనినీ దోవ దానిదే అన్నట్లు వేషం రక్తికట్టిస్తున్నారు.

హరితవిషప్లవం వర్ధిల్లిన పంజాబ్‌, హర్యానాల రైతుసంఘాలు కదంతొక్కుతుంటే, అన్నపూర్ణ అయిన తెలుగునాట సంఘాలు పార్టీలకు తోకాడిస్తున్నాయి.

మన తెలుగు

తెలుగంటే మన భాష
తెలుగంటే ఘన భాష
వేలాది యేండ్లుగా వెలుగునిచ్చిన భాష
బౌద్ద విహారమ్ము -చాళుక్య ద్వారమ్ము
కాకతీయుల కోట - కృష్ణరాయల బాట
క్తీర్తి శిఖరాలుగా వ్యాప్తి చెందిన భాష
కడప కలమళ్లలో కంకులేసిన భాష
అద్దంకి సీమలో ముద్దులొలికిన భాష
బెజవాడ నగరాన ప్రజలు మెచ్చిన భాష
నన్నయ గంటమై
తిక్కన్న కంఠచై
పాల్కురికి సోమన్న పదమైన జనభాష
పోతన్న కవితలో పులకరించిన భాష
వేమన్న వేదమై- త్యాగయ్య నాదమై
గురజాడ - గిడుగుల - జనవాణి సాక్షిగా
ఉద్యమ స్ఫూర్తితో ఉరకలేసిన భాష
మదుర తంజావూరు- మొరస నాడుల్లోన
వీనుల విందుగా విస్తరించిన భాష
చెన్నపురి నగరాన వన్నె కెక్కిన భాష
కొంగునాడంతట చెంగు చెంగున సాగి
రంగూను నగరాన పొంగులెత్తిన భాష
సురవరం మాటగా
సుద్దాల పాటగా
మన తెలంగాణలో మారు మోగిన భాష
కర్నాటకము నుండి ఖండాంతరాల్‌ దాక
కడలి కెరటమ్ముగా కదలి సాగిన భాష

-మేడిశెట్టి తిరుమలకుమార్‌, 9483502333

కవిసంధ్య, వింజమూరి అచ్చుతరామయ్య స్మారక వచన కవితల పోటీలు - 2021


మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవిసంధ్య, వింజమూరి అచ్యుతరామయ్య స్మారక సమితి సంయుక్త నిర్వహణలో వచన కవితల పోటీలను నిర్వహిస్తున్నాం. మొదటి బహుమతి రూ. 2,500/-, రెండవ బహుమతి రూ. 1500/- మూడవ బహుమతి రూ. 1000/-.ప్రోత్సాహక బహుమతులు 5 కవితలకు ఒక్కొక్కదానికి రూ. 500/- పోటీలో పాల్గోనే కవులు తప్పక కవిసంద్య చందాదారులై వుండాలి. కవితల ఇతివృత్తం వర్తమాన సామాజిక పరిస్థితులను ప్రతివింబించేదై వుండాలి. కవితలను సాధారణ పోస్టు రిజిష్టర్‌ పోస్టు, స్పీడు పోస్టు, కొరియర్‌ ద్వారా మాత్రమే పంపాలి. చివరి తేది.15ఫిబ్రవరి 2021. బహుమతులు 2021 మార్చి 21 జరిగే కవితా దినోత్సవ సభలో ప్రదానం చేయబడతాయి. వివరాలకు ఫోను: 9440155987

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

42