పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అంత నెయ్యి అమ్మ వేసేది.

నాగుల చవితి పండుగ సమయంలో అయితే పెద్ద కుండ నిండా శెనక్మాయల ఉండలు, నువ్వుల ఉండలు, వేరు శెనక్మాయల ఉండలు, ఇలా వేరు వేరు రకాల ఉండలు కట్టి కుండలలో భద్రపరిచేవారు.

ఇంట్లో కట్టిన గేదెపాలతో చేసిన వెన్న నెయ్యి కుండల నిండా ఉండేది. పులుసు అన్నంలో తేలాడేలా నెయ్యి పోసుకుని తినేవాళ్ళం. అంతతిన్నా ఆరోజుల్లో కడుపులో ఏలాంటి ఇబ్బందులు కలిగేవి కావు, ఇప్పుడు కొంచెం ఎక్కువ నెయ్యి తింటే చాలు పొట్ట చెడిపోతుంది.

అప్పట్లో పాలు, నెయ్యి తినాల్సిందే.

ఒకసారి గేదె ఈనేంత వరకూ మరో గేదెపాలు, పెరుగు, వెన్న నెయ్యి. అమ్మకుండా కడుపుకు తింటే మూడేళ్లు కడుపు నొప్పి రాదని చెప్పి నాన్న బలవంతంగా మా చేత తినిపించేవారు.

అలాంటి గేదె పాలు, పెరుగు, వెన్న నెయ్యిలతోపాటు, మా తల్లిదండ్రుల మమతల ఒడిలో మేము పెరిగాం. అందువల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను.

కుంటి సాకు చెప్పి బడి మాన్పించారు

అప్పుడు నేను ఏడవ తరగతి చదువుతున్నాను. మా ఊరి పాఠశాల వదిలి వేరే ఊరుకు వెళ్ళలేదు. ఏడవ తరగతి తరువాత కూడా చదవాలనే కోరిక ఉండేది. కానీ నాన్న నా కోరికకు సహకరించలేదు. ఇందులో ఎలాంటి స్వార్థం ఉండలేదు. ఇంటి పరిస్థితుల వల్ల తప్పనిసరిగా అలాంటి నిర్ణయం తీసుకున్నాను.

నాకు అప్పుడు పదమూడేళ్ళు. అప్పట్లో మాకు పదమూడు ఎకరాల పొలం ఉండేది. వ్యవసాయం చేసేవారు ఎవరూ ఉండలేదు. నేను, అన్నయ్య, తమ్ముళ్ళు బడికి వెళ్ళేవాళ్ళం. నన్ను మాత్రమే ఎందుకు బడి మాన్సించారో నాకు స్పష్టంగా తెలియదు. అయితే ఆ వయసులోనే ఖాలీగా ఉన్నప్పుడు పొలం పనులు, ఇంటి పనులు చేసేవాడిని.

ఇంట్లో ప్రదర్శన కోసం జరుగుతున్న ఆటల అభ్యసన సందర్భంలో అభ్యసనానికి కావలసిన బొమ్మలను సందూకం నుంచి, పెట్టెల నుంచి తీసిపెట్టే పనిలో ముందుండేవాడిని. అంతేకాకుండా ఇంటికి వచ్చే మేళం(కళాకారుల బృందం) సభ్యుల అతిథ్య సేవల బాధ్యతలను చూసుకునేవాడిని. బహుశా ఈ పనులను గుర్తించిన నాన్న నన్ను బడి మాన్పించి ఉండాలి.

బడిని వదిలి పెట్టిన ఆరంభంలో అంత దుఃఖం కలగలేదు.

మాకు చాలా భూమి ఉందేది. చుట్టుపక్క రైతుల్లా నేనూ మంచి పంటలు పండించాలనే పట్టుదల, కోరిక కలిగాయి. రెండు మూడేళ్ళు నేను, అన్నయ్య, నాన్న అమ్మ, అందరం కష్టపడి వ్యవసాయం చేశాం. అందులో నేను చేసే పనే ఎక్కువ. అన్నదమ్ములు బడికి వెళ్ళడానికి మునుపే ఉదయం పనులు చేసిన తరువాతే బడికి వెళ్ళేవారు. అనుకున్నట్టుగానే పంట బాగా పండింది. అప్పుడే మళ్ళీ తొమ్మిది ఎకరాల భూమి కొనుక్కున్నాం.

నేను బడి మానేసి రెండేళ్ళు గడిచి ఉండాలి. అప్పుడు మళ్ళీ బడికి వెళ్ళాలనే ఇచ్చ కలిగింది. పొలంలో పనులు చేస్తున్నప్పుడు ఒకసారి నా మనసులోని కోరిక చెప్పాను. నా మాటలు వింటుండగానే నాన్న కోపగించుకున్నారు. పెద్దగొంతుతో “వయసు పెరిగిన తరువాత బడికి పోతారా? " పెద్దలు 'చదువ ఒకపాలు, బుద్ది ముక్కాలు 'అంటారు. బుద్ది ఖర్చు చెయ్‌. అభివృద్ధిలోకి వస్తావని అన్నారు.

అంతేకాకుండా మా ఇంట్లో మా అత్త కూతురును సాకుతున్నారు.

మేము పుట్టడానికి ముందే మా అత్త అంటే మా నాన్న అక్క భర్త చనిపోయిన తరువాత మా ఇంటికి వచ్చింది. వచ్చిందని అనటం కంటే మా నాన్నే పిల్చుకొచ్చారు. ఆమె చాలా మంచిది. నెమ్మదైన మనిషి. ఇంటి పనులలో ఆమె మా అమ్మకు చాలా సహాయం చేసేది. ఆమె మా ఇంట్లో ఉంటున్న కారణంగా ఆమె కూతురు కూడా మా ఇంట్లోనే ఉండేది. ఆ అమ్మాయితోనే నాకు పెళ్ళి జరిపించాలని నిర్ణయించుకున్నారు.

ఆ నాటి కాలంలో పిల్లలు పుట్టినపుడే ఆమె ఫలానా వాడి భార్య, ఫలానా ఇంటివారి కోడలు అని నిర్ణయించే పద్దతి కుటుంబ సంబంధాలలో ఉండేది. నేను బడికి వెళ్లాలనే కోరిక బయటపెట్టినపుడు ఆమె ఆరవ తరగతి చదవుతుండేది. “నీ భార్య చదువుతోందికదా? నువ్వు చదివినా ఒకటే నీ భార్య చదివినా ఒకటే. ఆ సర్టిఫికెట్‌ నీకే చెందుతుంది కదా?” అని కుంటిసాకులు చెప్పిన “ముసలోడు” (రామనగౌడు, ఇతర సోదరులంతా తమ తండ్రిని ఇంట్లో ప్రేమగా 'ముసలోడు ' అని పిలిచేవారట. ఈ పేరుతో మొదట తమ తల్లే పిలిచేదట. అందువల్ల మాకూ అలా పిలవటమే అలవాటటైందని రామనగౌడ అంటారు.)

అయితే ఆ ముసలోడి మనసులోని కోరికనే వేరుగా ఉంది.

తన తదనంతరం ఈ “కొయ్యబొమ్మల ఆట "ను ముందుకు కొనసాగించే చేవ ఇతనిలో(నాలో) ఉందనీ ఆయన గుర్తించారు. ఈ అభిప్రాయాన్ని ఎన్నోసార్లు తన సహచరుల దగ్గర, మేళం వారి దగ్గర చెప్పుకున్నారు. పిల్లలందరూ బడికి వెళితే వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను ప్రదర్శించేవారు ఎవరు? అనే భయం నాన్నకు ఉండేది.

అందువల్లనే నన్ను బడికి పంపడానికి ఇష్టపడలేదేమో?

నేను మళ్ళీ బడికి వెళతానని చెప్పటంతో కాబోలు మూడు నాలుగునెలల తరువాత తనతోపాటు ఆటలు ఆడటానికి (ప్రదర్శించడానికి) పల్లెలకు పిల్చుకుని పోవటం మొదలుపెట్టారు.

నా కళ్ళముందు కొత్తలోకం కనిపించటం ప్రారంభమైంది!

(తరువాయి వచ్చేసంచికలో...)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

40