Jump to content

పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొనసాగింది.

సంతానం కోసం ఆటబొమ్మలను అమ్మ పూజించేది. వీధిలోని పిల్లలను తెచ్చుకుని వాళ్ళకు అన్నం పెట్టేది. బట్టలు ఇచ్చేది. ఇంటికి బిచ్చానికి వచ్చిన సాధువు-సంతులకు భోజనం పెట్టడం చేసేదట. మా ఇంట్లో ఇప్పటికీ ఈ పద్దతి ఉంది. పారంపర్యంగా వచ్చిన సంప్రదాయాన్ని అదే రీతిలో ముందుకు కొనసాగించాం.

ఊరికి వచ్చిన సాధువులు-సంతులు మరొక ఊరికి లేదా వాళ్ళ ఊరికి వెళ్ళటానిక బస్సు ఛార్జీలకు లేదనీ మా ఇంటికి వస్తే వాళ్ళ ఊరికి వెళ్ళటానికి కావలసినంత డబ్బు ఇచ్చి పంపేవాళ్ళం.

మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అదీ ప్రత్యేకించి బొమ్మల పూజ చేయడం ప్రారంఖించిన పన్నెండేళ్ళకు మా అమ్మకు సంతానం కలిగింది. ఈ విషయాలను నాన్న కథలా చెప్పేవారు. వీరన్నకు కట్టిన ముడుపు కారణంగా పుట్టిన మొదటి కొడుకుకు అంటే మా అన్నకు వీరన్నగౌడ అని పేరు పెట్టారట. “నేను గొడ్రాలిని అనే అపవాదం నుంచి విముక్తి కలిగించమని శ్రీకృష్ణుని దగ్గర ఒక బిడ్డను ఇవ్వమని అడిగాను. అయితే ఆ దయామయుడు కృష్ణుడు ఫాండువుల్లా అయిదు మంది పిల్లలను ఇచ్చాడు” అని అమ్మ సంతోషంతో చెబుతుండేది. ఆ కథ విని నాకు ఒక్కోసారి ఏడుపు వచ్చేది. ఆ ఏడుపే నేను సుసంస్కృతంగా పెరగటానికి కారణమైందేమోనని అనిపిస్తోంది.

మా తల్లితండ్రులు మమ్మల్ని పొందటానికి పడిన కష్టం నన్ను పదేపదే వేధించేది. నా కొడుకుకు తొందరగా పిల్లలు కలిగినప్పుడు కూడా నాకు మా తల్లితండ్రులు చెబుతున్న కథ గుర్తుకొచ్చేది.

మేము అయిదు మందిమి. అందులో నలుగురు మగపిల్లలు. ఒక ఆడపిల్ల. నేను రెండోవాడిని. చెల్లెల్ని నాన్న ఎప్పుడూ కూతురుగా భావించలేదు. కేవలం ఆడపిల్లగా చూడలేదు. మా ఇంటి వెలుగు, జ్యోతి, దీపం అనేవారు. నలుగురు మగపిల్లలను ముందుకు నడిపించే దేవత అనే పిలిచేవారు. ఆమె కూడా అంతే. నాన్నంటే ప్రాణం పెట్టేది. నాన్నను కన్నతల్లిలా చూసుకునేది.

మేము అంత ధనవంతులం కాము. అంత బీదవాళ్ళమూ కాము. నాన్న కాలానికి లేదా మా చిన్నతనంలోని రోజులతో పోల్చితే ఈ రోజు శ్రీమంతులమయ్యాం. నాన్న కాలంలో టిండికీ, బట్టకూ కొరత లేదు. నాన్న ముఖ్యమైన వృత్తి వ్యవసాయం. సంవత్సరంలోని కొన్ని రోజులు పురాణ ప్రవచనాలు చేసేవారు. అప్పట్లో బొమ్మలాట ప్రదర్శనలు విపులంగా ఉండేవి. మా తాలూకాలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అనేక తండాలు ఉన్నప్పటికీ నాన్న ప్రదర్శించే కొయ్యబొమ్మలాట చాలా ప్రసిద్ది చెందింది.

నాన్న వ్యవసాయం చేస్తున్న పొలంలో పంట కూడా బాగానే పండేది.

అప్పుడు మేము చిన్నవాళ్ళం.

ఇంటి ఖర్చు తక్కువే. ఆదాయం ఎక్కువ.

నాన్నకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఆయన అన్నదమ్ముల నుంచి (సవతి పిల్లలు) వేరుపడినప్పుడు ఆయన పాలికి వచ్చింది కేవలం ఒకటిన్నర ఎకరం ఫొలం మాత్రమే. ఆయన ఒక్క రోజు కూడా ఊరి హోటల్లో ఏమీ తిన్నవారు కారు. ఆట ఆడటానికి పల్లెలకు పోయినప్పుడు కూడా అంతే. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే హోటల్లో భొజనం చేసేవారు. అక్కడ ఎవరైనా భోజనాలకు పిలిస్తే చాలు వారింట్లో భోజనం చేసి వచ్చేవారు. సంపాదించిన సొమ్మును పొదుపుగా ఖర్చు చేస్తూ ఎంతో కొంత కూడబెట్టేవారు. బహుశా ఆ కారణంగానే నలభై ఎకరాల పొలం చేసుకున్నారు. ఇందువల్ల నాన్నతో కలిసి ఆట ఆడటానికి వచ్చిన కళాకారులకు సమయానికి వారి సంభావన (కట్నం) ఇవ్వడానికి, అవసరమైతే మరింతగా సహాయపడటానికి సాధ్యమయ్యేదని నాన్న చెప్పేవారు. మేము కూడా ఇలాంటి గుణాలను అలవరుచుకుంటే మంచిదన్నది ఆయన ఆశయం.

అయితే నాన్నలోని అన్నీ మంచి గుణాలను అలవరుచుకుని బతకడానికి నా వల్ల కాలేదు. కొన్నింటిని వదలకుండా పాటిస్తాను. నాన్న కష్టపడినంతగా నేను కష్టపడలేదు. ఆయన సవితి తల్లి ఆశ్రయంలో, తల్లితండ్రుల ప్రేమ కొరతలో పెరిగారు. ఒక్క పూట భోజనం కోసమూ కష్టపడ్డారట. తనలా తన పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ కొరతలో, ఆహారం కొరతలో కుమిలిపోకూడదని ఆయన కోరిక. తన కుటుంబం ఎక్కడ కష్టపడిపోతుందనే భయమూ ఆయనలో ఉండేది. బహుశా అందువల్లనే అంత పొదుపుగా ఉండి ఆస్తి సంపాదించారేమో! మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. పెంచారు.

అలాంటి ప్రేమ, అక్మరల మధ్య పెరిగినవాళ్ళం మేము. దేవుడికి వదిలిన గేదెల పాలు తాగి పెరిగాం

మా చిన్నతనంలో మా ఇంట్లో చాలా పశువులు ఉండేవి. పాలు-వెన్నలకు కొరతే లేదు. అంతేకాకుండా దేవుళ్ళకు గేదెలను వదిలే సంప్రదాయం మా ఇంట్లో ఉండేది. అంటే దేవుడి పేరిట, ముడుపు రూపంలో వదిలిన రెండు గేదెలు ఉండేవి. అలాంటి రెండు గేదెలలో ఒక గేదె కులదేవత 'చంద్రగుత్తెమ్మ' పేరిట, మరో గేదె గ్రామంలోని 'వీరభద్రస్వామి ' దేవుడి పేరిట ఉండేది.

గ్రామంలోని వీరభద్రస్వామి దేవాలయానికీ మా వంశానికీ ప్రాచీన కాలం నుంచీ ఆచరణ సంబంధం ఉంది. ఇది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. మేమేమి ఆ దేవుడి పూజారులం కాదు. వీరభద్రుని జాతరలో చేసే ఆచరణల కోసం ఉపయోగించే 'డప్పు ' మా ఇంట్లో ఉండేది. ఇప్పటికీ ఆ సంప్రదాయముంది.

అయితే దేవుడికి గేదెను వదిలే సంప్రదాయం లేదు. ఇది నాన్న కాలంలోనే మాయమైంది. అలాంటి ఎన్నో సంప్రదాయాలు ఈ రోజు కనుమరుగయ్యాయి. దీనివల్ల మాకు అనేక పరిమాణాలు జరిగాయి. జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మా ఇంట్లో పాలు లేవు. పిల్లలకు, మనవళ్ళకు పాలకోసం డబ్బులు చేతిలో పట్టుకుని గంటలకొద్దీ అంగళ్ళ ముందు నిలబడవలసి వచ్చింది. ఇలాంటి ఊహించలేని పరిస్థితిని తెచ్చుకున్నాం. మా చిన్నతనంలో ఇలాంటి రోజులు ఉన్నట్టు లేదు.

మేము ఈ రోజు పిల్లల్లా బయట తిన్నవాళ్ళమూ కాదు.

ఇంట్లోనే పెరిగినవాళ్ళమూ కాదు.

ఇంట్లో జొన్న రొట్టె, వెల్లుల్లి కారం, వేయించిన పప్పులు, ఆ పప్పులు ఎంత ఉంటాయో అంత వెన్న వేసి తినడానికి మా అమ్మ ఇచ్చేది. పచ్చి వెన్న తింటే కడుపుకు చల్లదనం. కడుపు నొప్పి రాదని అనేది. రొట్టెలకు వెల్లుల్లి కారం పూస్తే అది ఎంత ఉంటుందో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

39