పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కృత వ్యాకరణంలో శాస్త్రీయమైన శిక్షణ లేకపోడం చేత ఒక పదంలో కనిపించే ప్రత్యయాన్ని లేదా ఉపసర్గని థైర్యంగా ఇంకో పదానికి అన్వయించుకోలేరు. అన్వయించబోతే అన్నీ తప్పులే వస్తాయి. అందుచేత అలా ఎన్నింటిని దిగవేసినా ఇంకా ఇంకా భారీగా దిగవేయాల్సి వస్తూనే ఉంటుంది. ఆ దరిద్రానికి అంతులేదు. దీనిక్కారణం - అవి తెలుగు కాకపోవడం, అవి తెలుగు వ్యాకరణంలో ఇమడకపోవడం. తెలుగు వ్యావహారిక శైలిలో అసలే ఇమడకపోవడం. దీనికి పరిష్కారం - సంస్కృతపదాల బదులు కొన్ని సంస్కృత ప్రత్యయాల్నీ ఉపసర్దల్ని తెలుగులోకి తెచ్చి వాటిని నేరుగా తెలుగు పదాలకే కలపడం.

ఉదాహరణకి :- ఉప -అద్దె (sub-rent), తెలివిమంతుడు, నిష్పూచీ మొ॥

4. సమాసఘటన చేసేటప్పుడు సంస్కృతపదాల్ని సంస్కృత పదాలతోనే కలపాలనే చాదస్తం మనవాళ్ళలో చాలా చాలా ఎక్కువ. అలా అవసరం లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా సంస్కృతపదాలు సమాసాల ద్వారా తెలుగులోకి వచ్చి తిష్టవేశాయి. తిష్టవెయ్యడమే కాదు, సమాసాల ద్వారా అలవాటైన సంస్కృతపదాలు కొన్ని సందర్భాలలో అసలైన తెలుగు పదాల్నే భాషలోంచి ఏకమొత్తంగా తుడిచిపెట్టాయి. ఉదా :- ఉత్తరం, దక్షిణం.

మన ముందున్న కార్యావళి (agenda)

20. తెలుగులో కొత్త పదాల్ని కల్పించడమనే కార్యకలాపం నాలుగు దిశల్లో జఱగాల్సి ఉంది.

(అ) ఇంగ్లీషు పదాలకి సమాధకాల (equialents) కల్పన /అన్వేషణ

(ఇ) ఇంగ్లీషులో లేనటువంటివి/మన స్థానిక తెలుగుభాషుల (Natie Telugu speekers) భావాల వెల్లడింపుకి ఉపయోగపడేవీ అయిన కొత్త పదాల నిష్పాదన (Coinage)

(ఉ) అన్యదేశ్యాల స్థానికీకరణ (natiization)

(బు) కొత్త పరిభావనల (Concepts) గుర్తింపు మఱియు నామకరణం.

ఔత్సాహిక పదనిష్పాదకులు ఈ పై నాలుగో కార్యకలాపం గుఱించి కొంచెం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మనమిప్పటి దాకా చేస్తూ వస్తున్నది ప్రధానంగా, ఆంగ్ల ఆరోపాలకి తెలుగు సమార్థకాల్ని నిష్పాదించడం. ఈ మార్గంలో మన భాష ఇంగ్లీషువారి పరిభావనలకి ప్రతిబింబప్రాయం మాత్రమే కాగలదు. పదాలనేవి పరిభావనల వ్యక్తీకరణలు మాత్రమే. అసలు పరిభావనలంటూ ఉంటే పదాలు పుట్టడం కష్టం కాదు. కనుక ముందు సరికొత్త పరిభావనల్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా జఱగాలి. చూడగల కళ్ళుంటే మనచుట్టూ ఉపయుక్తమైన సరికొత్త పరిభావనలు ఉన్నాయి. వాటిని గుర్తుపట్టాలి. అది భాషాస్వకీయత (originality) కీ, సుసంపన్నతకీ దారితీయగలదు. ఉదాహరణకు -

1. చదువు చెప్పేవాడు = ఉపాధ్యాయుడు
చదువుకునేవాడు = విద్యార్థి
చదువు చెప్పించేవాడు (తండ్రి/ బడి యజమాని) =
2. భవనం కట్టించేవాడు = కాంట్రాక్టరు, బిల్డర్‌
భవనం కట్టేవాడు = మేస్త్రీ
కట్టించుకునేవాడు =
3. వెలుగు X నీడ
ప్రతిఫలితమైన వెలుగు (reflected light) ని ఏమనాలి ?
అలాగే ప్రతిఫలితమైన వెలుగు వల్ల ఏర్పడే నీడని ఏమనాలి ?
4. ఎంజిన్‌ పనిచేస్తున్నది = బండి/ యంత్రం కదులుతున్నది. ఇది యాంత్రిక చలనం.
ఇంకో దృగ్విషయం : ఎంజిన్‌ పనిచేస్తున్నది కానీ బండి/యంత్రం కదలడం లేదు. దీన్నేమనాలి ?
5. సోదరి కొడుకు మగవారికి మేనల్లుడు.
మఱి తమ సోదరుని కొడుకు వారికి ఏమవుతాడు ?(మేనకొడుకు అందామా ?)
అలాగే సోదరుని కొడుకు ఆడవారికి మేనల్లుడు. మఱి తమ సోదరి కొడుకు వారికి ఏమవుతాడు ?
6. మన పూర్వీకులు మానవ శరీరంలోని అన్ని భాగాలకీ పేర్లు పెట్టలేదు. కొన్నిటిని వదిలేశారు. వాటికి ఏమని పేర్లు :పెడదాం ?

ఏది చెయ్యాలన్నా ముందు మన భాషాస్వరూపం గురించి మనకి కొంత అవగాహన ఉండాలి. అది ఏర్పడాలంటే శబ్టార్ధ చంద్రిక వంటి కోశాలను అనునిత్యం పరిశీలిస్తూ ఏ పదమైనా మనకి పనికొచ్చే లక్షణాలు కలిగి ఉందా ? అని కాస్త మధనపడాలి. రెండోది- బాలవ్వాకరణాన్నీ సిద్దాంతకౌముదినీ కూడా శోధించాలి. ఎందుకంటే ఒక మహాకవి చెప్పినట్లు “గతం నాస్తి కాదు నేస్తం, అది అనుభవాల ఆస్తి.” పాతపుస్తకాల బూజుదులిపి దుర్శిణితో గాలిస్తున్నంత మాత్రాన ప్రతి చాదస్తాన్నీ నెత్తిన వేసుకుంటామనుకోరాదు. "కొత్త పదాలు” అంటే - ఏ విధమైన కొత్త పదాలు ? పదాల్లో రకాలున్నాయి. ఇంగ్లీషువారు వాటికి Parts of speech అని పేరుపెట్టారు. మన భాషకి సంబంధించినంత వఱకు మనం సిద్దం చెయ్యాల్సినవి:

1. క్రియాధాతువులు (erb-roots)
2. నామవాచకాలు (nouns)
౩. విశేషణాలు (adjecties)

మళ్ళా వీటిల్లో చాలా రకాలున్నాయి. తెలుగుభాష నామవాచకాల్ని క్రియలుగా ఎలా మారుస్తుంది ? క్రియల్ని నామవాచ కాలుగా ఎలా మారుస్తుంది ? ఒక నామవాచకంలోంచి ఇంకో నామవాచకాన్ని ఎలా నిష్పాదిస్తుంది ? వీటన్నింటి నుంచి విశేషణాల్ని ఎలా పుట్టిస్తుంది ? మళ్ళీ విశేషణాల్లోంచి నామవాచకాల్నీ క్రియల్నీ ఎలా రప్పిస్తుంది ?

ఇవన్నీ కూలంకషంగా తెలునుకుంటే సగం అయోమయంలోంచి బైటపడతాం.

21. తెలుగులో పదనిష్పాదన మఱింత ప్రజాస్వామికం కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఎప్పుడూ ఎవఱొ ఒకటిద్దఱు లేదా ముగ్గుఱు, నలుగుఱు సమార్ధకాల్ని సూచించడం, వారి వద్ద మాత్రమే నమాధానాలు ఉండడమూ, మిగతావారివద్ద ప్రశ్నలు మాత్రమే ఉండడమూ తరగతిగదిలాంటి ఈ పరిస్థితి శీఘ్రంగా మారడం మిక్కిలి వాంఛనీయం. ఇది నిజానికి ఒక అభ్యసనాప్రక్రియ. ఇది ఒక ఇబ్బందికరమైన ప్రక్రియ. ఎందుకంటే మనం స్వయంగా నేర్చుకునే కంటే ఇతరులకి నేర్పడానికి ఎక్కువ ప్రయత్నిస్తూంటాం. ఈ వైఖరి మన మనోభివృద్ధికి అడ్డుపడుతుంది. అదే సమయంలో భాషాభివృద్దికి కూడా!

1. మఱింతగా పాత -కొత్త తెలుగు-ఇంగ్లీషు పుస్తకాల్ని చదవడం అలవాటు చేసుకోవాలి. అంతకన్నా ముఖ్యంగా పూర్తిగా తెలుగులోనే ఆలోచించడం, మాట్లాదదం అలవాటు చేసుకోవాలి. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో మాట్లా డడం పనికిరాదు.

2. ప్రతిపదానికి తెలుగు సమార్ధకం ఏమై ఉంటుందో అని

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

24