పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పనికొచ్చేకధ.

అందరినీ అలరించే మంత్రమా?

సుబ్బన్న పేద పండితుడు. ఊళ్ళో ఇంటింటికీ తిరిగి అందరినీ పొగుడుతాడు. మగ వాళ్ళని అయితే, “నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అంటాడు. ఆడవాళ్ళతో , “అమ్మా! నువ్వు భూదేవివి, శ్రీదేవివి అంటాడు. ఆ పొగడ్తలు విన్న వారందరూ ముసి ముసి నవ్వలతో, సుబ్బన్నకు, కొంచెం బియ్యమో - కాయో పండో - పాలో పెరుగో ఇస్తారు. ఆ రకంగా సుబ్బన్న ఇల్లు గడుపుకుంటూ వుంటాడు.

ఆ ఊళ్ళో రామయ్య అనే పేద రైతు మాత్రం పొగడ్తల్ని ఇష్టపడడు. పొగిడే వాళ్ళకి పిడికెడు బిచ్చం కూడా పెట్టడు.

కానీ ఒక రోజున సుబ్బన్న ఒక శిష్యుడితొ, రామయ్య ఇంటికే బయల్టేరాడు.

సుబ్బన్నని చూడ గానే రామయ్య మొహం చిట్లించి, “ఇక్కడి కెందు కొచ్చావు సుబ్బన్నా? నీ పొగడ్తల్లో నేనూ పడతా ననుకున్నావా?” అని కస్సు మన్నాడు.

సుబ్బన్న చిరునవ్వు నవ్వుతూ రామయ్య పక్మనకూర్చున్నాడు - “ఎంత మాట రామయ్యా! నీ గుణం తెలుసుకోలేనంత అజ్ఞానినా నేను? పొగడ్తలకు లొంగే మూర్ఖుడెవడో, వాటిని చేర నివ్వని విజ్ఞుడెవడో తెలుసుకోలేని మందమతినా నేను? మూర్ఖులైతేనే పొగడ్తల్ని నమ్ముతారు, సంతోషిస్తారు. నువ్వు అటువంటి అల్పుడివా? పొగడ్తల్లో నిజం వుండదని తెలుసుకోగలుగుతారు జ్ఞానులు. అలాంటి వాళ్ళ దగ్గిర కూడా నా పొగడ్తలు వినిపిస్తానా రామయ్యా?” అన్నాడు.

రామయ్య, భార్యని పిలిచి “ఈయనకి సంచి నిండా బియ్యం పోసి పంపు” అని చెప్పాడు.

సుబ్బన్న శిష్యుడు, బియ్యం మూట నెత్తి మీద ఎత్తుకొని నడుస్తూ దారిలో, “గురువు గారూ! మీరు రామయ్యని కూడా చాలా బాగా పొగిడారే! అది ఆయనకి అర్ధం కాలేదా?” అని ఆశ్చర్యపోతూ అడిగాడు.

“ఎందుకు అర్థం కాదురా అబ్బీ? ఈ భూమి మీద పొగడ్తలకు లొంగని వాడెవడురా? ఇంద్రుదివి, చంద్రుడివి' అంటే నూటికి తొంభై తొమ్మిది మంది బుట్టలో. పడతారు. ఇక ఒక్కడు మిగులుతాడు.. 'నువ్వు ఇంద్రుడన్నా లొంగవు, చంద్రుడన్నా లొంగవు” అంటే, ఆ ఒక్కడు కూడా అదే బుట్టలో పడిపోతాడు. అంటే, కొంత మంది దగ్గిర, పొగిడే మాటలు మార్చాలిరా, అంతే” అని వివరించాడు గురువు.

శిష్యుడు చాలా అయిష్టంగా, “నేను. గడ్డి కోసుకునో,. కట్టెలు కొట్టుకునో బతుకుతాను గానీ ఈ రకంగా అందర్నీ పొగిడి బతకను గురువు గారూ! ఇది నాకు నచ్చ లేదు” అన్నాడు.

గురువు చిరునవ్వుతో, “అలాగే చెయ్యి నాయనా! నా వంటి అల్పుడివి కావు నువ్వు నిన్ను చూస్తున్నానుగా? నీ తత్వం వేరు అన్నాడు. - శిష్యుడు కోపంగా, 'మీరు నన్ను కూడా పొగిడి బుట్టలో వెయ్యాలని చూశారు. నేనలా పడను! మీ మూటలు మోసే పని నాకొద్దు. గడ్డి కోసుకుని బతుకుతా” అనేసి, మూటని అక్కడే పడేసి వెళ్ళిపోయాడు.

-- రంగనాయకమ్మ

(ఒకటో తరగతి తెలుగు వాచకం నుంచి)