పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టిన పట్టు విడవకుండా ప్రతి విషయంలోనూ చివరిదాకా పోరాడే రామోజీ పరువు నష్టం కేసును మధ్యలోనే ఎందుకు వదిలేశారో! రామోజీ అక్రమాలకు సంబంధించి మరో ఆసక్తికరమైన ఆరోపణ మార్గదర్శి అక్రమాలు. నాటి రాజమండ్రి యంపి ఉండవల్లి అరుణకుమార్‌ ఫిర్యాదుతో రామోజీ ఆర్థిక నేరంగా 2006లో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో సుమారు ఐదు వేల కోట్ల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్ని నంత పెద్ద కేసులో రామోజీ రావు ఇరుక్కున్నాడంటే నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్‌ రాజశేఖర రెడ్డితో సహా ఎవరూ నమ్మలేకపోయారు. కోర్టులు నమ్మాయి. అందుకే స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించాయి. ఇప్పటికీ ముగియని ఆసక్తికరమైన ఈకేసు “మార్గదర్శి వివాదంతో మరోసారి చర్చకు” శీర్షికన 289వ పేజిలో చూడవచ్చు.

ఐదు దశాబ్టాల తెలుగు రాజకీయాలు, పత్రికలు, తెలుగు దేశం పార్టీ యన్‌టిఆర్‌ రాజకీయ ఉత్తాన పతనాలు, చంద్రబాబు, రామోజీల పాత్ర, ప్రయోజనాలు పండించుకున్న వైనం ఇలా వివిధ చారిత్రిక అంశాలకు సంబంధించి సాధికారిక గ్రంథం, విజ్ఞాన భాండాగారం అనదగిన పుస్తకం ఇది. తెలుగు నేలకు చెందిన రాజకీయ, పత్రికా రంగాల పరిణామాలు, పరస్పర బంధాలు, ప్రయోజనాలు తదితర అంశాలపైన ఆసక్తి కలిగిన పాఠకులు, విశేష కథనాలు వండి వార్చాలి అనుకునే రచయితలు, రాజకీయ జీవులు, పరిశోధన పత్రాలు సమర్పించాలని అనుకునే నేటి తరం పిహెచ్‌.డి విద్యార్థులు, రేపటి తరానికి అందించాలని భావించే గ్రంథాలయాల వారు అందరూ కొని భద్రపరచుకోతగిన విలువైన పుస్తకం. “రామోజీరావు ఉన్నది ఉన్నట్టు.”

శివరాంప్రసాద్‌ సెల్‌ : 94404 58297

కాలపేటిక

దశాబ్దాలుగా గోడకు వేలాడుతుంది. కాలాన్ని ఖండఖండాలుగా కత్తిరించే కళాఖండమది. దాని అంకెల మీద ఎక్కుతూ దిగుతూ జీవయాత్ర సాగిస్తున్న వాణ్ని నేను.

ఓ రోజు దానితో ఇలా ముచ్చటించాను. “గడియారమా! సూర్యుని తర్వాత నువ్వే నా కర్మసాక్షివి. జీవితంలో నా మూడు దశలను చూస్తున్నావు. ఇవాళ అనుభవాల బరువును నీ ముందు కాస్త విప్పుతాను.

నా చుట్టూ జ్ఞాపకాలున్నాయి అంటే వాటి తాలూకు వస్తువులు లేనట్టే కద! ఎక్కడి నుంచో ఎగిరొచ్చి అవి నా పక్మన కూర్చున్నా గుర్తుపట్టడం కష్టం! లీలగా కొన్ని గుర్తున్నా ఊగుతున్న నీ పెండ్యూలం డస్టర్‌గా మారి తుడిచివేస్తున్నట్టుగా స్ఫురణ.

ఇవాళటి దశ నిన్నటి ఆవరణను కబళించినప్పుడల్లా నా అపురూప వస్తుజాలం అద్బశ్యమై నేను కాస్తకాస్త మరణిస్తున్న భావన.

పిన్నులూ గోలీలూ శంఖులూ చింతగింజలూ నెమలీకలూ పుస్తకంలోని పుటల మధ్య అతుక్కుపోయిన పువ్వులూ అలనాటి భేతాళకథలను ఏ రాక్షసుడు ఎత్తుకపోయాడో!

యౌవనంలో అందుకున్న ఉత్తరాల్లోని ముగ్ధాక్షర పంక్తుల్లో ఆమె ముఖరేఖాచిత్రం మెరిసిపోతోంది. టోపీ, మష్పర్‌, గరం బనీన్‌ ఎక్కడికి ఆవిరైప్రాయ్యాయో తెలియదు. అట్లాసులోని సరిహద్దులు ఎట్లా వుండేవి! ఇప్పుడు మా ఊరు ఊరిలో లేదు. చేజారిన వస్తువుల గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.

ముఖ్యంగా నా మాతృభాష సృష్టిలోనే సుందరమైన విన్యాసాల్తో వెలిగే అక్షరాలు తీయదనవమంతా కూరిన మాటల మాధుర్యాలను ఏ దొంగలు దోచుకుపోతున్నారో!

ఈ సుదీర్ధయానంలో నేను పొందినదెంత పోగొాట్టుకున్నదెంత లాభనష్టాలను బేరీజు వెయ్యడానికి నీకు తెలుసు నేను లెక్కల్లో వీక్‌!

వర్తమానం గతాన్ని రద్దు చేస్తుందా భవిష్యకాంతుల్లో అన్నీ వెలిసి పోతున్నాయా సకలం కలిసిమెలిసి కాపురం చేసే స్వప్నం వొట్టి కలేనా! ఓ నా టిక్‌టిక్‌ల రాణీ ఇప్పుడు నేనే ఓ యాంటిక్‌నై పోతున్నా.”

వింటూనే గడియారం పన్నెండు గంటలు కొట్టింది ఆ సంగీతంలో కొత్తర్జాలు వెతుకుతున్నాన్నేను.

డా॥ ఎన్‌. గోపి 93910 28496

గుండె లోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ “అమ్మనుడి'లోనే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

48