(నారకలబంద) పట్టులా సంగటి పెట్లుకాని, ఉలవల పులుసు పోసుకొని తింటా వుండారు. నేను అన్నానికి మామిడికాయ ఊరగాయ
కలుపుకాని తింటా వుండా.
“పాకముపప్పో.. పాకముపప్పు” అంటా అరస్తా సాయిబుల లబాబన్న కావలిలా (బీడుభూమి) దూరి వూరిపక్క పోతావుండాడు.
“పాకముపప్పు తినాలప్పా” అంటా అడిగింది తడువు, మా అబ్బ నోట్లా రెండు వేళ్లు పెట్టుకొని జోరుగా సీలేసె (విజిల్) అది విని నేరుగా మాతావుకి వచ్చె లబాబన్న గౌడు పదిరూపాయల నోటు తీసి లబాబన్నకి ఇచ్చె.
“మీవూర్లా మీరు తప్పితే నా పాకముపప్పుకి కాసులు ఇచ్చే నాతుడే లేడు గౌడు” అంటా మా అందరికి పాకము పప్పు ఇచ్చె.
పాకముపప్పు తింటా మాతావు పంటల గురించి రవంత సేపు మాట్లాడి ఎవరి పనులకు వాళ్లు పోయిరి.
“నువ్వు లబాబన్న కూడా వూరికి పోరా” మా అబ్బ అనె.
నేను లబాబన్న సైకిలు వెనక వూరిదోవన నడస్తా వుండా.
“అనా... నా... పాకము పప్పు చేసేది ఎట్లనా” అంటా అడిగితిని. “అదేమి పెద్ద యిద్ది కాదబ్బయ్య, సెనగిత్తనాలని వేపి, పొట్టును వుజ్జి ఒగ తట్టలా పెట్టుకానాల. బెల్లము నజగొట్టి సట్టిలా వేసి నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాల. ఆ పాకము బాగా మరిలినంక సన్నమంట మీద తట్టలా పెట్టిందే సెనగ యిత్తల్ని వేసి కలుపుకొనాల. రవంత సేపు ఉడకనిచ్చి ఆమీట పెద్ద తట్టలా ఆ పాకాన్ని పోసుకొని ఆరబెట్టి చిన్ననీన్న బీళ్లలుగా కోసుకోవాల... అంతే” అని చెప్పె.
“అవునునా నువ్వు పాత సామాన్లు, చిలుము పట్టిందే ఇనుము సామాన్లు తీసుకొంటావు కదా వాటినీ ఏమి చేస్తావునా” తిరగా అడిగితిని.
“పేటలా పెద్ద పెద్ద యాపారగాళ్లు వుండారప్పా, నేను వాళ్లకి అమ్మతాను. వాళ్లు అవిటిల్ని కరిగిచ్చి తిరగా కొత్తగా తయారు చేస్తారు” అనె.
“అంటే పాతది ఫోయి కొత్తది వస్తుంది కదనా” అంటిని.
“అవును, కొత్తనీరు వచ్చి పాతనీరు పోయినట్ల, కొత్త మనుషులు వచ్చి పాతవాళ్లు పోయినట్ల కాలచక్రంలా మనిషైనా మానైనా విరగాల్సిందే కరగాల్సిందే మన్నులా కలవాల్సిందే” అనీ వూరి ముందర రచ్చతావ సైకిలు నిలిపి “పాకము పప్పో.. పాకము పప్పు” అని గట్టిగా అనె. చిన్నోళ్లంతా వచ్చి చుట్టూ చేరేసిరి.
విత్తనాల ఏకాసి పండగనాడు చేను చేనులంతా విత్తనాలు చల్లిరి. వాన ఎనక వాన పడతా వుంది. మొలకలు పెరిగి పెద్దవవుతా వుండాయి. చేనులకంతా గుంటువ వేసి చెత్తా, చెదారా లేకుండా చేసిరి. వయిర్లు గుమ్ములు కట్టి గుంపులు గుంపులుగా చేన్లంతా నిలిచిండాయి. అత్తాన పొంగలి నాపొద్దు (నాడు) కూలోళ్ల కష్టానికి పందినంజర వంటావార్పు. చేనుపంటలే కాదు కానపంటలకీ మా తావు పెట్టింది పేరు. మావూరి చెరువుకట్ట నాలుగు పర్నాంగుల విస్తీర్ణం వుంటే కట్టకింద కాన 40 పర్నాంగుల దూరం వుంటుంది.
కాన కానంతా కిచిడి వడ్లు, బెద్ద బేరొడ్లు జయా వడ్లు నల్ల వడ్లుర్ల, బవానీ వడ్లు, గిడ్డ బయ్యర్డు మూన్నైెల్ల వడ్లు, ఆర్నెల్ల వడ్లు, గమ్ముల వడ్లు, రకరకాల వడ్లపయిర్లు పచ్చగా పెరిగిండాయి.
కాన చుట్టూరా టెంకాయ, చింత, సీమచింత సేపు(జామ), పరంగి(బొప్పాయి), బంకశలి, కలవరేణి, బిక్కి సీతాపలము, పనస, నేరడి, జంబు నేరడి, కరప, అత్తి(మేడి) మాన్లు అంతెత్తరము పెరిగి నిలిచిండాయి.
మానుపనికి అయ్యే జాలిమాను, బాగిమాను, పువ్వరిసి మాను, ఫొగుడుతండి మాను, వెర్రియాప మానులు ఏ. కాలానివో అవెన్ని కాలాలని చూసిండాయో.
మరాలు, మక్కిర్లు, బుట్టలు అల్లేకి పనికి వచ్చే వెదురు గుమ్ములు, సంగటికట్టె, మెట్టుకట్టెకి పనికి వచ్చె సిగరమాన్ల సొగసు చూడాల.
విస్తరాకులకి అయ్యే మోతుకు మాను, మేకలకి మేపులకి అయ్యే పందివేప మాను, పందెమేసుకొని పెరిగినట్లుండాయి.
కట్టకి కావలి కాస్తా కట్ట పొడవునా పెరిగిండే పిల్లగోవి చెట్లు, తెల్లనల్ల జిల్లెడి చెట్టు, వార్డీపు మాన్సు, తాటి మాన్లు ఈత మాన్లు ఆడాడ మాన్లకింద అలుమాకు, ఆనబరుగు కసువు, పాలాకు, బొద్దాకు, కాశాకు, గరిగకసువు, సొంటికసువు, ఏటిజంబు సొగసుగా 'పెరిగిందాయి.
కాన పక్కలానే కావలి (భీడుభూమి). కావలికి కల్లగా సన్న కల్లి, పెద్దకల్లి పొదలు, కొటము పొడవు పెరిగిందే మంచి కత్తాళి, వెర్రి కత్తాళి, జాలి, ముగళి, మర్రి, గొడ్డలిమిట్ట మాన్లు.
కావలంతా పచ్చి కసువు, ఆ కసువు మద్దెలా అడవి టెంకాయలు (ఏలకుల సైజులో పచ్చగా వుంటాయి. కాయలోపల నల్లని విత్తనాలు వుంటాయి. వాటిని తింటారు). కారి, మిండ, కుడితి పంట్ల కత చెప్పే పనిలేదు.
ఎర్రని పండ్లతో నాగదళ్లకాయ (నాగజెముడు) చెట్టు. ఈ పండు తినాలంటే పండు కొననీ రవంత కోసి పక్కన పెట్టి మిగిలిన పండు తినాల. ఆ కొన పండులా చక్రము మాదిరిగా వుండే ముల్లు వుంటుంది. దాన్ని తీసి తినాలా, లేదంటే ముల్లు గొంతులా
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021
4