పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ధారావాహిక"

ఈమని శివనాగిరెడ్డి 98485 98446


అడుగుజాడలూ ఆనవాళ్లు-5

నా దుర్గి - ఒప్పిచర్ల యాత్ర

మర్నాడు యాత్రలో భాగంగా, ఒకనాటి రాత్రి గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన దుర్గికి చేరుకున్నాను. అక్కడ, నాగార్జున శిల్పశాల స్థాపకులు చెన్నుపాటి సీతారామయ్య గారింట్లో ఉందామనుకొన్నాను. అంతలోనే, కొల్లిపర మండలం మున్నంగికి చెందిన జగన్నాధంగారు కనిపించి వాళ్లింటికి తీసుకెళ్లారు. దాదాపు 70ఏళ్లనాటి ఇల్లు. లోపల నాపరాతి గచ్చు.కొయ్యస్థంభాలు, దూలాలు, దంతెలు, పైన నాపరాతి పరుపు, దానిపైన చవుడు మట్టికప్పు. పక్కనే వసారా బావి, వంటగది, స్నానాలగది. తాను ఎప్పట్నించో సేకరించి భద్రంగా దాచుకున్న సానరాళ్ళు, నూరుడురాళ్లు, రకరకాల పూసలు, మట్టిబొమ్మలు. పురాతన వస్తువులపట్ల ఆయనకు మక్కువ ఎక్కువ అనిపించింది. ఉట్టిమీదనుంచి చట్టిలోఉన్న గేదెపాల పెరుగు చిలికి, దంచిన జీలకర్ర, అల్లం కలిపి కొంత కొత్తిమీర, ఉప్పువేసిన మజ్జిగ ఇచ్చాడు. ప్రయాణంలో అలసిన నాకు ఉల్లాసాన్నిచ్చాడు. మాటామంతీ తరువాత, రేపు ఉదయం నేను దుర్గి, ఒప్పిచర్ల చూడాలనుకొన్న సంగతి చెప్పాను. నేనొచ్చానన్న ఆరాటంతో, జగన్నాదంగారు, నాటుకందిపప్పును శుభ్రంచేసి, బచ్చలకూర, పొన్నగంటికూర, తోటకూర కాడలు కలిపి, కొంచెం చింతపండు, జతచేసి కలగూరపప్పు, దోసకాయ-వంకాయ, పచ్చిమిరప కాయల పచ్చడి, మిరియాలు, మెంతులు, శొంఠి, థనియాలు, జీలకర్ర బాగా దంచి, మరిగినదాకా కాచిన రసం, సొరకాయ దప్పళం(పులుసు), పచ్చిమిర్శి, అల్లంముక్మలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంచుక పసుపు కలిపిన మజ్జిగచారు, ముంత తిరగేసినా ఏమాత్రం కిందకు జారని గట్టిపెరుగు, పెరుగులోకి కరకరలాదే మినప, గుమ్మడి వడియాలు, వంకాయ దోసకాయ వరుగు సిద్దంచేస్తుంటే నేను తినజోయే ముద్ద, ముద్దా, సిద్దమకరధ్వజమేననిపించింది. ఇవేవీ చాలవన్నట్లు, మునగాకు, పెసరబద్దలకూర, గోరుచిక్కుడు వేపుడు, చిలగడదుంప-వంకాయ పులుసు, గోంగూర -శనగపప్పుకూర, టమోటాగొజ్ఞు, మినపనూక, కందినూక పచ్చడి, ముందుగా ఆరగించటానికి సగ్గుబియ్యం సన్నసేమ్యాలు, బాగా సన్నబియ్యంతో యాలకులు, జీడిపప్పు కలగలుపు పాయసం, ఒకటేమిటి ఎన్నిరకాలో, పల్నాడులో సరైన భోజనం దొరక్క జొన్నపిసరు తిన్న శ్రీనాథుడు, ఈ ఇంట ప్రత్యక్షమైతే ఎంతబాగుండో అనిపించింది. అన్నీ ఆరగించటానికి అరగంట పట్టింది. జెషధ సమనెత ఆహారం అబ్బురపరచింది. మతిమరుపు మళ్లీ తిరిగొచ్చినట్లనీపించింది. జగన్నాధంగారికి ధన్యవాదాలు చెప్పి, రేపటి మా వారసత్వ స్థలాల యాత్ర గురించి ముచ్చటిస్తుంటే, అందించిన కప్పురవిడియం, మెల్లగా జోకొట్టి నిద్రబుచ్చింది. అదీ జగన్నాధంగారి ఆతిధ్య చిక్కదనం.

మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి దుర్గి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న పాటిమట్టి పొలంలో నేనూ, జగన్నాధంగారు, చెన్నుపాటి సీతారామయ్యగారి అబ్బాయి, శిల్పి చెన్నుపాటి శ్రీనివాసాచారి(శ్రీను) కలసి తిరుగుతున్నాం. ఎందుకంటే అది పురాతన స్థావరమని అక్మడ రకరకాల పూసలు, ఇటుకరాతి ముక్కలు, ఎర్రగా మెరిసే కుండపెంకులు, చూచానని జగన్నాధంగారు చెప్పారు. అది ఖచ్చితంగా శాతవాహన స్థావరమై ఉంటుందన్న నా నమ్మకం నిజమైంది. ఆ పొలంలోనేకాదు, చుట్టుపక్కల దాదాపు వంద ఎకరాల్లో చారిత్రక ఆనవాళ్లున్నాయి. జగన్నాధంగారికి ఉన్నట్టుండి బాగా ఎర్రగా, నగిషీగా ఉన్న చిన్న కుండ దొరికి, నన్ను రమ్మని పిలిచారు. అటు వెళుతూవెళుతూ నేలంతా కళ్లు చేసుకొని చూస్తున్న నాకు ఒక బలపపురాయి శిల్పం దొరికింది. పాటిమట్టిలో ఉన్న ఆ బొమ్మను తీసిచూశాను. ఆశ్చర్యం! అది శివుని మహేశమూర్తిబొమ్మ. వక్ష స్థలంవరకే ఉంది. జటాజూటం, వృత్తకుండలం, ముఖకవళికలు పరిశీలించిన తరువాత ఇక్ష్వాకుల అనంతరకాలాని(క్రీ. శ, 4వ శతాభ్ది)కి చెందిందని జగన్నాధంగారికి చెబితే, ఆయన కళ్లు పత్తికాయల్లా వెలిగిపోయాయి. ఆ బొమ్మకు అనేకసార్లు నమస్మరించుకున్నాడు. ఈబొమ్మ దొరకటంద్వారా దుర్గి చరిత్ర ఒక్కసారిగా, శాతవాహన, ఇక్ష్వాకు, ఆనందగొత్రినుల కాలానికి పోయింది. రెండువేల ఏళ్లు!

దుర్గిలో ఉన్న దుర్గమ్మ, శివ వీరభద్ర, గొపీనాధాలయాలను చూడటానికి కాలినడకన వెళ్లాం. ఎప్పుడో 13వ శతాభ్దిలో కాకతీయ గణపతిదేవుడు అధికారి, ఆవూళ్లో కోట కట్టేముందు “దుర్గకు గుడి కట్టటాన ఆ వూరికి దుర్గి అనేపేరొచ్చిందని, క్రమంగా అదే పేరు స్థిరపడిదని స్థానికులంటారు. ముందుగా దుర్గ దేవాలయానికి వెళ్లాం. ఎత్తైన దిబ్బ. చుట్టూ చెల్లాచెదురుగా పడిఉన్న మండప స్థంభాలు, ఆలయ విడిభాగాలు, శాసనాల శకలాలు. మెట్లెక్కి పైన చూస్తే గుడినుంచి విడివడిన ద్వారశాఖలు, దూలాలు, కప్పురాళ్లు,

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

33