పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపంలో సూచిస్తున్నప్పుడు తెలుగులో కూడా దాన్ని ఒక సమాసంగా అనువదించి ఆపైన దానికి ఒక తెలుగు ప్రత్యాహార రూపాన్ని ఇవ్వడం తప్పు కాదు.

ఉదా :- portable Document Format(PDF) = వహణీయ పత్ర సంప్రకారం (వ.ప.సం.)

4. ఆదాన అనువాదాలు (loan translations) - అంటే మూలభాషలోని అర్థాన్ని మన భాషలోకి అనువదించి పదాలు కల్పించడం) కొన్ని సార్లు తప్పవు. కానీ అన్నీవేళలా అదే మంత్రం గిట్టుబాటు కాదు. బ్లాగ్‌ లాంటి పదాల్ని “దాదాపుగా” అలాగే ఉంచి తత్సమాల్లా వాడుకోవడం మంచిది.

5. తెలుక్కి స్వాభావికమైన జాతీయాన్ని నుడికారాన్ని (idiom) భ్రష్టు పట్టించకూడదు. తెలుగులో ఇమడని నిర్మాణాలు(structures) శీఘ్రంగా పరమపదిస్తాయని మఱువరాదు.

6. భాషాపరిశుద్దతని నిలబెట్టడమే మన అంతిమలక్ష్యం కాదు. భాషని సుసంపన్నం చెయ్యడమూ, ప్రయోగాత్మకతని ప్రోత్సహించడం కూడా మన లక్ష్యాలే. కాబట్టి వైరి సమాసాల్నీ మిశ్రసమాసాల్ని విఱివిగా అనుమతించాలి. అయితే అవి శ్రవణసుభగంగా (వినసొంపుగా) ఉంటేనే పదికాలాల పాటు నిలుస్తాయి. వికారమైన పదసంయోజనలది అల్పాయుర్థాయం. తప్పనిసరై దిగుమతి చేసుకున్న ఇంగ్లీషు పదాలకి సంస్కృతప్రత్యయాల (suffixes)నీ, ఉపసర్గల (prefixes)నీ చేర్చి వాడుకోవడం ఆమోదయోగ్యమే. ఉదా : కర్బనీకరణ మొదలైనవి.

7. ఇంగీషులో లాగే తెలుగులో కూదా ప్రత్యాహారాల (abbreiations) ద్వారా ఏర్పడే acronyms ని (వెకిలిగా పరిగణించకుండా) వాటికి ఒక గౌరవనీయ స్టానాన్నీ కల్పించడం చాలా అవసరం. తెలుగులో ఇప్పటికే అలాంటివి కొన్ని ఉన్నాయి.

ఉదా :- అ.ర.సం (అభ్యుదయ రచయితల సంఘం)

వి.ర.సం (విప్లవ రచయితల సంఘం)

సి.కా.స (సింగరేణి కార్మిక సమాఖ్య)

వీటి సంఖ్య ఇంకా ఇంకా పెఱగాలి. ముఖ్యంగా తెలుగు శాస్త్ర సాంకేతిక రంగాల్లో !

8. మిశ్రపద నిష్పాదన (Hybrid coinage) ని ప్రోత్సహించాలి. అంటే, ఒక భాషకి చెందిన ఉపసర్గల్నీ ప్రత్యయాల్నీ ఇంకో భాషకి చెందిన దేశిపదాలకి చేర్చి కొత్త పదాలు పుట్టించడం. ఉదాహరణకి:2- దురలవాటు. ఇందులో “దుర్‌” అనే ఉపసర్గ సంస్కృతం. “అలవాటు” తేట తెలుగుపదం. ఇలాంటివే నిస్సిగ్గు, ప్రతివాడు, అతితిండి మొదలైనవి. ఇలాంటివి చాలా ఉన్నాయి కాని సరిపోవు. ఇవి వందలూ, వేలుగా పెఱగాలి.

9. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. పాతపదాలు, కావ్యభాష గ్రాంధికం అంటూ కుహనా అభ్యుదయవాద శైలిలో అన్పృశ్యతానామాంకాలు (Labels) వేసి మన ముందటితరంవారు తెలుగుపదాల అనర్హ విలువను గుర్తెఱగక నిర్దాక్షిణ్యంగా సంఘబహిష్మరణ చేసిన అచ్చతెలుగు పదజాలం అపారంగా ఉంది. అలాగే అలాంటి సంస్కృత పదజాలంకూడా విపరీతంగా ఉంది.

అభ్యుదయవు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్సించని
పదాలన్నీ కావాలిప్పుడు
దాస్తే దాగని భాష ! (మహాకవిశ్రీశ్రీకి క్షమాపణలతో)


ఆ పదజాలాన్నంతా ఇప్పుడు వెలికి తీయక తప్పదు. ఈ సందర్భంగా వ్యావహారికవాదం 'పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన కొన్ని దురభిప్రాయాల్ని కూడా సవరించాలి.

10. సంపూర్ణ సమానార్ధకాలు అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు సమీపార్ణకాలతో సరిపెట్టుకుందాం. భాష నిరంతర పరిణామశీలి కనుక మనం ఎంపిక చేసినవాటి కన్నా మంచి పదాలు భవిష్యత్తులో ప్రతిపాదనకొస్తాయని ఆశిద్దాం. ఒకే పరిభావనకి ఇద్దఱు -ముగ్గుఱు వేఱువేఱు నిష్పాదకులు రెండుమూడు వేఱువేఱు పదాల్ని కల్పించగా, ఆ అన్ని నిష్పాదనలూ సర్వోత్తమంగా ఉన్నట్లు అనిపిస్తే వాటన్నింటినీ పర్యాయపదాలుగా భావించి స్వీకరిద్దాం.

11. పాతపదాలకి కొత్త అర్ధాలు కల్పించడం ద్వారా కొత్త పదాల్ని శూన్యంలోంచి కల్పించే అగత్యం నుంచి బయట పడతాం. కొన్నిసార్లు ఉన్న పదాల్ని “తగువిధంగా” రూపాంతరించడం (modifying) ద్వారా కొత్త పదాల్ని కల్పించి భాషని సంపన్నించవచ్చు. మన తెలుగుభాషలో ఇందుకు చాలా ఉదాహరణలున్నాయి.

ఉదా :

పథం = దారి
పథకం = scheme
పన్నకం = ఉచ్చుల అమరిక
పన్నాగం = కుట్ర
మొలక = మొలిచిన గింజ
మొల్క = మొక్క = చిన్న చెట్టు
సలుపు = ఇబ్బందిపెట్టు
జలుబు = శీతబాథ
జీవితం = బ్రతుకు
జీతం = బ్రతకడానికి సరిపోయే పైకపు చెల్లింపు
కట్టు = చుట్టికట్టేది
గట్టు = సరిహద్దుగా కట్టేది
వంక = ఏఱు
వాక = అదే (ఏఱు)
పోడు = కొంతకాలం వ్యవసాయం చేసి ఆ భూమిని తగలబెట్టడం
బోడు/బోడి = మొక్కలూ గడ్డీ అన్నీ పెఱికి పారేసిన నేల
దిగుబడి = పొలం నుంచి ఇంటికి తెచ్చుకుని దించుకునే పంట
దిగుమతి = ఓడ/పడవ మీదినుంచి దించుకున్న సరుకు
కంప = పొడవైన తీగెలూ ముళ్ళూ గల గుబురు (మూలం =కమ్ము = కమ్మీ)
గంప = పొడవైన వెదురుకమ్ముల్ని వంచి చేసిన పాత్ర (ఇనుము - ఇనప, ఱొమ్ము - ఱొంప అయినట్లు)
చేకూరు = పోగగు
చేకూరించుకొను = పోగు చేసుకొను - చేకుఱించుకొను -సేకరించుకొను (దీన్ని సేకరణ అని సంస్కృతీకరించడం కేవలం అసందర్భం. :ఇలాంటి పదమేదీ సంస్కృతంలో లేదు)
పెంట = మానవ శరీర పరిత్యక్తం
పెండ (తెలంగాణాలో వాడుకలో ఉంది) = జంతుశరీర పరిత్వక్తం
పచ్చిది = ఉడికించనిది
పచ్చడి = ఉడికించకుండా నూఱి ఉప్పు, కారమూ, పోపూ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

29