పుట:అభాగ్యోపాఖ్యానము (Abhagyopakhyanamu).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
క.	ఆనాదము విన్నంతనె ।మానసమున కెన్నరానిమమతజనించెన్
	శ్వాసనినాదమొ యొకఖర ।యాననినాదంబొ వేగ నారసిచెపుమా. ౪౪

చ.	అనవిని భృత్యుఁ డాక్షణమ యానతిఁగైకొని గట్టుడిగ్గి కా
	ళ్ళను బెనుముండ్లు గ్రుచ్చుకొనలాగుచు మ్రొగ్గుచు వేగలేచుచున్
	జనిచని డొంకముండ్ల మెయి సర్వముఁ జీరుకుపోవ నోర్చుచున్
	బొనుపడుచున్న పాడుగుడిపొంతను మొద్దగుచాపరాతిపైన్. ౪౫

మ.	కనియెన్ దానవదూత సూక్ష్మనయనన్ గాలాంతకాకార ని
	ర్ధనజీవన్ ఖరవాణిఁ గీశసమవక్త్రన్ రక్తవర్ణాలకన్
	గనదుద్యద్వసుధాధరాంచితవలగ్నన్ భూరినీలాధరన్
	ఘనదేహన్ లసదుష్ట్రయాన విలసత్కాంతాకదంబాధమన్. 	౪౬

చ.	కనుఁగొని దైత్యుచెంగటికిఁ గ్రమ్మఱ వచ్చి యతండువల్కె నో
	దనుజకులావతంసమ ముదంబున నీవటు నన్నుఁ బంపఁగా
	ఘనమగుముండ్లచెట్లనక కంకరరాళ్ళన కెంతదూరమో
	చనిచని పాడు దేవళముచక్కిని నేను మహాద్భుతంబుగన్. ౪౭

సీ.	వ్రేలుచన్నులు కొంత బిలమువెల్వడిక్రింద జనుకొండచిలువలజంటగాఁగ
	నేత్రాంతములనుండి నెంవడిఁ బఱతెంచుకన్నీళ్ళు సెలయేటిగ ములుగాఁగఁ
	గర్ణరంధ్రంబులు ఘనవక్త్రబిలమును రమణీయతరగహ్వరములుగాఁగ
	గాత్రమంతట నిక్కుఘనరోమసంఘంబు ధాత్రీరుహములబృందంబుగాఁగఁ
	గుఱుచలౌ యెఱవెండ్రుకగుంపులడరి ।యడవిదహియించునట్టి దావాగ్ని గాఁగ
	గొప్పపర్వతముకరణిఁ గూరుచున్న ।పొలఁతిఁగంటిఁ బురాకృతపుణ్యమునను. ౪౮

వ.	తదీయరూపాతియంబులు వివరించెద నాకర్ణింపుము. ౪౯

చ.	చెడుగులనేఱ యొక్కగుమిచేసి విధాతృఁడు గార్దభంబులన్
	బుడమి సృజింప వానిమెయి భూరికురూపము చాలమిం బదం
	పడి యొనరించెలొట్టియల వానికి మిక్కిలి కుస్వరంబు చే
	పడమి నొనర్చె నేర్పుమెయి భామను రెండునుగల్గియుండఁగన్. ౫౦

చ.	పవలునునుండు పెన్దమము పాడుగుణంబులు రూపుదాల్చి యీ
	భువనములోనఁ గ్రుమ్మరఁగఁబుట్టినభీకరవిగ్రహంబు బాం
	ధవనిచయంబునేచ వసుధాస్థలిఁగల్గుపిశాచభామ తా
	భువిఁ జరియించుసంపదలముద్దియయక్క నెలంత యెంతయున్. ౫౧