పుట:అభాగ్యోపాఖ్యానము (Abhagyopakhyanamu).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సీ.	ఒకదిక్కుననుగుక్కలొక గ్రుక్క గాఁగూయ నొకచెంత బలుదుంత లొలసియార్వ
	నొకమూల ఖరజాల మురులీలనోండ్రింప నొకచోట గుడిసేటియువతులడల
	నొకదండ ముదిముండ లొకదండుగాఁగూడ నొకవంక బలుకుంక లొదిగియుండ
	నొకపొంతఁగడముంతలొకదొంతరగనుండ నొకక్రేవ మధుసేన లొనరఁ జేయఁ
	బెంటపోగులుఁ జీపుళ్ళుఁ బేడకుప్ప ।లలుకుగుడ్డలుఁ గోడియీఁకలునుదనర
	డంబుమీఱిన శునకాసనంబునందుఁ ।గొలువులోఁ జచ్చినట్టులు కూరుచుండె. ౨౭

ఉ.	ఆగతిఁ గొల్వులోన దనుజాధముఁడుండి గులామునొక్కనిన్
	వేగమపిల్చి వేఁటపయి వేడుక నాకిపుడుద్భవిల్లే వే
	వేగమ వేఁటకాండ్ర మనవేపులఁ దోడ్కొనిరమ్ము నావుడున్
	సాగి యతండు చచ్చిచెడి చాలఁగఁజెప్పినరీతిఁ జేసినన్. ౨౮

గీ.	ముడ్డియొండియున్న మొద్దు గుఱ్ఱముమీఁదఁ ।గదలకుండ నెక్కి కాళ్లునేలఁ
	దగులగూరుచుండి తక్కినవారలు	।వెనుకఁజేరితోల వెడలెనతఁడు. ౨౯

వ.	అట్లుమిడిమిడియెండం గాళ్లుగాల నెత్తిమాడఁ బురంబువెడలి. ౩౦

చ.	మలమున మూఁగునీఁగలక్రమంబునఁ బీనుఁగుచుట్టుఁ జేరున
	క్కలగతిఁబుల్లెపైఁగవియుకాకులకైవడి వేఁటకాండ్రుఁ గు
	క్కలసరదార్ల నల్లడలఁగ్రమ్మి రయంబున నేగుదేరఁగా
	వెడలె నతండు కాకములు వేపులు నక్కలుఁ గూయుచుండఁగన్. ౩౧
వ.	అంత. 			                     ౩౨
చ.	దనుజునిఁజూడ సూక్ష్మతరదారుణనేత్ర యొకర్తు ముందుగా
	నెనసినమొండిగోడపయి నెక్కిన ముద్దియయోర్తు వచ్చి తా
	వెనుకకుఁద్రోచె నందుననువెన్కకు నెమ్ములురాలఁగూలి మా
	నిని వెసమూర్ఛపోయె వడి నెచ్చెలు లేడిచి రొక్క పెట్టునన్. ౩౩

ఉ.	వీతశిరోజ యొక్కరిత వే దనుజుంగన గోడయెక్కి యు
	ర్వీతలమందు జాఱిపడి రింగునదొర్లుచు దైత్యుఁజేరె ని
	ర్భీతమనోబ్జయై కలన బీరమునం దనుగెల్వఁ జాలుబం
	ట్రౌతుల డించి తన్నుఁగొని గ్రక్కునఁ బొమ్మని వేఁడవచ్చెనాన్. ౩౪

ఉ.	బాడిదచెట్టు శుష్కకుచభాగ యొకర్తు నరాశనాధమున్
	జూడఁగ నెక్కఁ దన్మహిజసూనచయం బొగి నెండుకాయలం
	గూడి సుపర్వవైరిపయి గుంపులుగాఁ బడు పెంపువొల్చెఁ బె
	న్వేఁడిమి మింట దైత్యుపయి వేలపు లుల్కలు రాల్చిరోయనన్. ౩౫