పుట:అభాగ్యోపాఖ్యానము (Abhagyopakhyanamu).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గీ.	బియ్యమున వడ్లు బెడ్డలు పెక్కుగలిపి
	నేతిలో నంటిపండ్లను నెఱయఁబిసికి
	తప్పుతూనిక తూచుచుఁ దక్కువగను
	గొలుచుచును గోమటులు సొమ్ముఁగూర్చుకొండ్రు.  ౯

గీ.	కూట సాక్ష్యంబు బ్రాహ్మణగురులవలన । బాగుగా నేర్చుకొని పాటుపడుటమఱచి
	జూదములదొంగతనముల శూరులగుచు । శోభఁగాంతురు పురిలోన శూద్రజనులు. ౧౦

చ.	తనపలుముండ్లవాఁడిమిని దప్పక వాసవువజ్రమున్ జయిం
	ప నతిదృఢంపుమట్ట లనుమైమఱువొప్పఁగనేగి ముండ్లచే
	ననిఁ గులిశంబు గెల్చి తనకడ్డగు వేల్పులకండలొల్చి తా
	నొనరెననంగ బ్రహ్మజెము డొప్పగు నెఱ్ఱనిపండ్లగుంపుతోన్. ౧౧

చ.	పురిఁదగుఁ జుట్టునుంగదిసి భూరిభయంకరలీల దట్టమై
	పెరిఁగినగచ్చపెన్బొదలు పెట్టనికోటగ, లోనియీతచాల్
	బురుజులుగాఁగ, దాపునను బొల్చినతుమ్మలు పెద్దముండ్లతో
	సురియలుదూసి సద్భటులు స్రుక్కక కావలిగాచుతీరుగాన్. ౧౨

సీ.	మార్దవం బంగ నామణులచన్నులయంద సాహసంబాహారసమయమంద
	ప్రజ్ఞయంతయును దంభములుకొట్టుటయంద బంటుతనము వంటయింటియంద
	మితభాషణము శాస్త్రతతులచర్చలయంద కలిమి పురంధ్రులకౌనులంద
	నిలుకడ నెలఁతల నేత్రయుగ్మములంద ధైర్యంబు పెద్దలఁదఱుముటంద
	వడి లతాంగుల వంకరనడలయంద ।శాంతి యెంతయు దుష్కర్మసహనమంద
	కానిమఱియెందువెదకినఁ గానరాద ।నంగఁ దద్దయు నాపట్టణమువెలుంగు. ౧౩

గీ.	తివిరిపాప పుంజంబు మూర్తీభవించి ।నచ్చిగుమిగూడి ప్రోల్చొరఁబాఱుకరణిఁ
	బందిగున్నలు చెరలాడు సందులందు ।దున్నపోతులకైవడిఁ జెన్నుమీఱి. ౧౪

గీ.	చేరినిల్చిన వంటయిల్ చేరినిల్చుఁ	।గానవచ్చినఁ బరువెత్తి కానసొచ్చు
	డంబుమీఱిన భటసమూహంబుతోడ ।సాటియౌదురె మాననకోటినెవరు. ౧౫

గీ.	వీటఁగల్గిన ఘోటక కోటితోడ ।నిలిచిప్రాఁకంగ నేరక నీరుసొచ్చె
	వెఱచి తాఁబేటిగుంపులు వేయునేల ।పురినిబుట్టిన నుక్కైనఁబుచ్చిపోవు. ౧౬

చ.	దనుజులు మర్త్యులందునిమి తత్తనుమాంసము మెక్కి పోవఁగా
	నెనసి పురంబునల్గడల నెమ్ములరాసులు భూధరంబుల
	ట్లనుపమలీలనుండఁ బ్రమథావళితోడ మనోజవైరి యా
	మనికికి వెండికొండయని మాటికివచ్చుఁ బరిభ్రమమింపుచున్. ౧౭