Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

[1]అలఘుఱళదంత్యచజలకు హ్రస్వవక్ర, ములకు నిందుఁ బ్రత్యేకించి పలుకనియెడఁ
గ్రమతఁ దత్తత్ప్రధానవర్ణముల కెవ్వి, యవియె వానికి నని తెలియంగ వలయు.

18


తే.

అచ్చు లొకవర్గ మయ్యె స్పర్శాక్షరంబు, లైదువర్గంబు లయ్యె యాద్యష్టకంబు
దలఁప నొకవర్గ మింకఁ కొందఱమతంబు, నూష్మములు నొకవర్గమై యొప్పుచుండు.

19

శుద్ధాంధ్రలిపిలేఖనక్రమము

క.

మొదల నకారాద్యచ్చులు, పదియాఱును వానిపిఱుఁద బాణాసురదు
ర్మదహర కాదిలిపులు ము, ప్పదిమూఁడును బుట్టి వాక్ప్రపంచం బయ్యెన్.

20


మూ.సూ.

బాలేందుపరిధిశృంగావర్తకుశగ్రంథిదాత్రపరశుసమాః,
ఆద్యా ఇభకరతుల్యా స్తద్దీర్ఘా శ్శూలసన్నిభా వన్యౌ.

2


సీ.

విజయచంద్రునిమాడ్కి వెలయు నత్వము దానికుడివంక శృంగంబుకొన గుణింపఁ
బ్రభవించుఁ దక్కినప్రాణంబు లెల్లను నడిమికి గుడిఁ జుట్టి విడువ నిత్తు
కుడి నాపుకొమ్ముకైవడి వ్రాయ నుత్వంబు క్రిందను సుడి నిల్ప ఋత్వ మయ్యె
వలపల మీనికి మెలి గొన్న ఌస్వర మెడమ నెత్వం బొప్పుఁ గొడవలిక్రియ


తే.

యామ్యమున గండ్రగొడ్డలియ ట్లొనర్పఁ, గ్రాలు నోత్వ మిన్నింటిదీర్ఘములు కుడిని
గరికరాకృతిఁ [2]దనరుడాకడవలపల, నమరు నైత్వౌత్వములు త్రిశూలములకరణి.

21

[3]వీనికి రూపములు

ా ఇది ఆకారము, ి ఇది ఇకారము, ీ ది ఈకారము, ు ఇది ఉకారము, ూ ఇది ఊకారము, ృ ఇది ఋకారము, ౄ ఇది ౠకారము, ౢ ఇది ఌకారము, ౣ ఇది ౡకారము, ె ఇది ఎకారము, ే ఇది ఏకారము, ై ఇది ఐకారము, ొ ఇది ఒకారము, ో ఇది ఓకారము, ౌ ఇది ఔకారము, "అనుక్త మన్యతః" అను న్యాయముచేత నీశబ్దానుశాసనసూత్రమునందుఁ జెప్పిన యనుస్వారమును, విసర్జనీయమును, సకలదేశప్రశస్తమైన నాగరలిపియందు నెటువలెనో యటులఁ దెలిసికొనునది. తత్స్వరూపంబులు ౦-అం ఇది పూర్ణానుస్వారము, ః-అః ఇది విసర్జనీయము, ఇవి యచ్చు లనంబడు.

అనుస్వారనిర్ణయము

మూ.సూ.

సిద్ధ స్సాధ్య శ్చానుస్వార పూర్ణార్థభేదతో ద్వివిధః,
హ్రస్వా త్పూర్ణో౽పి భవే ద్దీర్ఘాచ్చే త్ఖండ ఏవ స జ్ఞేయః.

3
  1. అలఘురల (సూ)
  2. నిలుపంగ వరుసఁ దనరు (సూ)
  3. ఈ రూపములు సరియయినవి కావు, పూర్వకాలపువ్రాఁత ఎట్లుండెనో తెలియగోరువారు బర్నెలు వ్రాసిన 'సౌతిండియన్ పేలియాగ్రఫీ' అనే పుస్తకము గాని, ఆంధ్రవిజ్ఞానసర్వస్వముగాని చూడవలెను. (గి). వీనిరూపములు (శివ)ప్రతిలో భిన్నములుగా నున్నవి (రా).