Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వదలక మును గొన్న వర్ణంబు కృతులను బలుమాఱు నుడివినఁ బ్రాస మయ్యె
నది సుఖకర దుష్క రావసాన ద్వి త్రి చతు రను సంజ్ఞల సప్తవిధము
లయ్యె ననుప్రాస మందులోపల ఛేకవృత్తిలాటము లన ముత్తెఱంగు
లేకార్థశబ్దంబు లేకపద్యంబులోఁ బునరుక్తిదోషంబు పొందకుండ
నుడుగక నేమాఱు [1]నుడువఁగ లాటాఖ్యఁ జను ననుప్రాస మై జరగుచుండు
లాటంబులో శృంఖలన్యాయబంధంబు ప్రతిషేధశృంఖలబంధనంబు
మాలికాదీపసమాఖ్యయు సారంబు నేకావళియు నన నెసఁగు నైదు
పలుమాఱు నొకభంగిపలుకులు పలుకుచో సర్ణంబు వేఱైన యమక మదియు
నాదిగతంబు మధ్యగతంబు నంతగతాఖ్యంబు నాదిమధ్యమగతంబు
నాద్యంతగతము మధ్యాంతగతంబును జరణత్రయగతంబు సర్వగతము
నుపమానపదగోపనోక్తియు నన నవవిధములై యమకముల్ విస్తరిల్లు
సరిగమపధను లోష్ఠ్యనిరోష్ఠ్యములు తలకట్లును గుడులు శృంగములు నేక
[2]వర్ణంబులు నభీష్టవచనసంఘట్టనంబులు నాదిగా నిట్లు వొదలు టెల్లఁ
జిత్రకవిత్వప్రసిద్ధనామంబులై పెంపొంది వీనుల కిం పొనర్చు
సరవి గూఢచతుర్థచరణవర్ణముఁ జతుర్విధకందమును బంచవిధసువృత్త
పద్యంబు సీనరూపద్విపదాఖ్యయుఁ గందగర్భితమణిగణనికరము
మొదలు గా నొకపద్యమునఁ బెక్కుపదియంబు లిమిడి ఛందో౽ర్థదోషములు లేక
కనుపట్టునవి యెల్ల గర్భకవిత్వవిఖ్యాతిచే శ్రవణసుఖం బొనర్చు
గోమూత్రికాఛత్రగుచ్చకుండలినాగకంకణమర్దలఖడ్గచక్ర
పంకజసర్వతోభద్రమాలా[3]క్షురప్రభృతిబంధంబు లేర్పడఁగఁ జెప్పు
వృత్తము ల్బంధకవిత్వవిశ్రుతములై కవులకుఁ జెవులపండువులు సేయుఁ
బ్రాసాదిగాఁ జెప్పఁబడిన వన్నియు శబ్దవితతి కలంకారవితతు లయ్యె
ధర నలంకారప్రధానతానురసప్రధానతావస్తుప్రధానతలును
భాసిల్లు నారభటీసాత్వతీభారతీకైశికీనామధేయవృత్తు
లర్థస్ఫురణసమాఖ్యయు లాంగలీఫలపాకమృద్వీఫలపాకములును
గడు ముఖ్యగౌణలక్ష్యధ్వనివ్యంగ్యముల్ గణుతింప నర్థలక్షణము లయ్యెఁ
జర్చింపఁ గృతులకు జాతిగుణంబులు ద్రవ్యక్రియలు జీవితంబు లగుట
నది యేతెఱంగున నమరు నట్లన చెప్ప వఱలు జాతియు స్వభావంబు ననఁగ
నది మొదల్కొని మూఁడుపదులపై నెనిమిది యెసఁగుతద్భేదంబు లెఱుఁగవలయు

  1. నుడుగంగ
  2. వర్ణంబు లభికష్ట (సూ)
  3. క్షురి (సూ)