Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆ లోకనుతుఁడు మొన్నటి, [1]కీలకసమమున మతంగగిరికడ నొసఁగెన్
బాలసరస్వతులకు నతఁ, డోలిఁ దెనుఁగు టీక దాని కొప్పుగఁ జేసెన్.

50


క.

ఆదిని భీమకవీంద్రుఁడు, గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున నా
మీఁదట రాజనరేంద్ర, క్ష్మాదయితునిపట్టి దాని మహి నెలయించెన్.

51


క.

ఇల నెనుబదిరెం డార్యలు, గలిగి పరిచ్ఛేదపంచకంబునఁ దగు నీ
విలసితఫక్కి మతంగా, చలవిప్రునివలన నీదుసదనముఁ జేరున్.

52


క.

మును నారాయణధీరుఁడు, తనకు సహాయుఁడుగ సంస్కృతము వాగనుశా
సనుఁడు రచియించె దానికి, దెనుఁగింపఁగ నీకు తోడు నే నిపు డగుదున్.

53


క.

సురభాషయందు నల్సా, క్షరముల బహుసూచితార్థసారము లిముడిం
తురు సూత్రంబుల నవి వి, స్తరముగఁ దెనుఁగింపకున్నఁ దరమే తెలియన్.

54


తే.

నారికేళపాకంబుగా నన్నయకవి, ప్రక్రియాకౌమిదిని [2]ముట్టఁ బలికెఁ గానఁ
గేవలాంధ్రులు గాన దాత్రోవ నీవు, గోస్తనీపాక మై యుండఁ గూర్పవలయు.

55


ఆ.

శబ్దశాసనుండు సంస్కృతగ్రంథంబు, గానఁ దెలుఁగుమాట గలయ రామి
లక్షణంబె కాని లక్ష్య మొక్కటియును, బలుకకునికిఁ దెలియబడవు కొన్ని.

56


తే.

ఒక్కసూత్రంబువలన సముద్భవించు, శబ్దములు లెక్క వెట్టంగ శక్య మగునె
నలువకైనను [3]బలుకులేఁజెలువ కైన, నైన [4]నెఱిగింపు మొకకొన్నియైన నీవు.

57


చ.

రమణను సత్కవీంద్రులు పురాణచయం బితిహాసపంక్తికా
వ్యములును దొల్లి యైన నిపు డైనను ముంగల నైన దీని సూ
త్రములను దక్క వేఱొకవిధంబున నాంధ్రముఁ జేయఁజాలమిన్
క్షమఁ దెనుఁగింప దీన నవి సర్వముఁ జేయు ఫలంబు నీ కగున్.

58


క.

[5]తాతనయు [6]నూత్నదండియు, నీ తెనుఁగులలక్షణం బొకించుక [7]తెలియన్
జేతఃప్రౌఢిమఁ జెప్పిరి, క్ష్మాతలమున దీనితెఱఁగుగా నవి యెల్లన్.

59


తే.

ఆంధ్రభాషామహాకాననాంతరమున, సంతతంబును శబ్దాపశబ్దసరణు
లెఱుఁగనేరక మది సంశయించు తెలుఁగు, కవులు నుపదంబు లిందును గాంతు రిలను.

60


తే.

కవుల కుపకార మగుటచేఁ గలుగు సుకృత, లాభ [8]మందున నగు సర్వశోభివృద్ధి
దాన సమకూఱు నాకపదంబు దీనిఁ, దెనుఁగుఁ గావించుకంటె శోభనము గలదె.

61


ఆ.

ధరణి నీకు నిష్టదైవ మెప్పుడుఁ గామె, పల్లె నున్నచక్రపాణి యగుట
నంకితంబు దీని నతనికిఁ జేయుము, విప్రవర్య మాకు వేఱు గలదె.

62
  1. కీలకసమనామతంగ (సూ)
  2. బుట్ట
  3. బలుకులచెలికి నైన
  4. నెఱుఁగింపు (గి)
  5. తాతన - తాతంభట్టు
  6. నూత్నదండి - కేతన అభినవదండి బ్రిదాంకితుఁడు (రా)
  7. యైనన్ (సూ)
  8. మందును (సూ)