Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భగవద్వాక్యము

ఆ.

[1]మోడ్పుఁగేలు ఫాలమునఁ జేర్చుకొనియున్నఁ, గరుణ నతఁడు నన్నుఁ గాంచి పలికె
న న్నెఱింగి వందనం బొనర్చితి వాత్మ, మెప్పు పుట్టె నీదు మెలఁకువకును.

39


ఉ.

ఈ యువతుల్ రమాధరణు లేను బయోరుహపత్రనేత్రుఁడన్
నీయెడఁ గూర్మి గల్గి ధరణీదివిజోత్తమ వచ్చినాఁడ [2]శ్వ
శ్రేయస మబ్బు నీకు నిఁక సిద్ధము నన్నయఫక్కి [3]యంధ్రముం
జేయుము మాయనుగ్రహముచేఁ గవు లచ్చెరు వంది మెచ్చఁగన్.

40


క.

వినియును గనియును నెఱుఁగని, ఘనఫక్కిం దెనుఁగుఁ జేయఁగా నెట్లగు నా
కనవలదు దానిలక్షణ, మును నీ కది గలుగుచందమును విను మింకన్.

41

గ్రంథప్రభావము

తే.

ఆంధ్రశబ్దచింతామణివ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు
బాసచేఁ జెప్పె నన్నయభట్టు దొల్లి, పర్వములు మూడు శ్రీమహాభారతమున.

42


వ.

ఆసమయంబున.

43


తే.

భారతముఁ [4]దెనుఁగించుచుఁ దా రచించి, నట్టి రాఘవపాండవీయము నడంచె
ఛందము నడంచ నీఫక్కి సంగ్రహించె, ననుచు భీమన [5]మ్రుచ్చిలి యడఁచె దాని.

44


ఉ.

ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపఁగాఁ బడియె నెందును దానినె కాని సూత్రసం
పాదనిలేమిచేఁ దెనుఁగుపల్కు మరొక్కటిఁ గూర్చి చెప్పఁగా
రా దని [6]దక్షవాటి కవిరాక్షసుఁ డీ నియమంబుఁ జేసినన్.

46


క.

ఆ మూఁడుపర్వములలో, నా మాన్యుఁడు నుడువుతెఱఁగు లరసికొని కృతుల్
దాము రచించిరి తిక్కసు, ధీమణి మొదలైన తొంటి[7]తెనుఁగుకవీంద్రుల్.

47


తే.

రాజరాజరేంద్రతనూజుఁ డార్య, సఖుఁడు సారంగధరుఁడు శైశవమునందు
నన్నయి రచించునెడఁ బఠనం బొనర్చె, నన్యు లెవ్వ రెఱుంగ రీ యంధ్రఫక్కి.

48


క.

అతఁడు [8]కాళ్లుఁ జేతులు, మతి సెడి జనకుండు [9]దఱుగ మత్స్యేంద్రునిసం
గతి నవి గ్రమ్మఱ మొలచిన, క్షితి సిద్ధులఁ గలసి యొక్కసిద్ధుం డయ్యెన్.

49
  1. మోడ్పుకేలు (గి)
  2. సూ. శ్వసోవసీయ శ్శ్రేయసః. 5-4-80 పాణిని అష్టాధ్యాయి. శ్వశ్శ్రేయసం శివం భద్రం కల్యాణం మంగళం శుభమ్. అని అమరము.
  3. యాంధ్రము (గి)
  4. దెనుఁగింపుచు (గి అధస్సూచి), తెనిఁగింపుచు - ఇప్పటిరూపము (రా)
  5. యెంతయు నడఁచె (సూ)
  6. ద్రాక్షవాటి (సూ)
  7. తెనుఁగు (సూ)
  8. దనకాళ్లు చేతులు మతి చెడి (సూ)
  9. దరుగ (పూ.ము.)