Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిస్తుతి

సీ.

వల్మీకభవుపాదవనరుహంబులు కొల్చి సాత్యవతేయుఁ బూజనము సల్పి
భట్టబాణునివచఃప్రాభవంబు గణించి కాళిదాసుని కిరుగేలు మోడ్చి
పండితాగ్రేసరు దండి వక్కాణించి భవభూతివాక్యజృంభణము మెచ్చి
జయదేవునకు నమస్కారంబు గావించి మల్హణు హృదయపద్మమున నుంచి


తే.

చోరుఁ గడుఁ బ్రస్తుతించి మయూరు నెంచి, మాఘు భూషించి భారవి మదిఁ దలంచి
హీరునకు మ్రొక్కి కవితావిహారమతుల, నితరవిద్వత్ప్రకాండుల నతులు చేసి.

26


సీ.

శబ్దశాసనుపాదజలజంబులు భజించి యుభయసత్కవిమిత్త్రు [1]నభినుతించి
శంభుదాసునకు నంజలి వేడ్క నొనరించి సహజపాండిత్యుని సంస్మరించి
సకలవిద్యాసనాథకవీంద్రుఁ గొనియాడి సౌజన్యజేయువాక్సదణిఁ బొగడి
నంధ్రకవితాపితామహు వర్ణించి సుజనవిధేయు హెచ్చుగ నుతించి


తే.

రామరాజవిభూషణరత్నఖచిత, చారుమస్తకలాపాదిహారివాక్య
గౌరవము పెక్కుభంగుల గణన చేసి, పిదప నితరాంధ్రకవులకుఁ బ్రియము పలికి.

27


తే.

కాళిదాసమయూరాదికవుల కైనఁ, గలవు తప్పు లనంగ నన్యులకు లేవె
దిద్దఁ దగుపట్ల దిద్దుడు దిద్ద రాని, యెడల నానేరములు క్షమియించు టొప్పు.

28


వ.

అని వర్తమానకవులం బ్రార్థించి.

29


క.

వినఁదగు వెండియుఁ బొత్తము, గనఁ దగు బుధజనుల నడుగఁగాఁ దగుఁగా కెం
దును దెలియని పట్టునఁ ద, ప్పన వల దని [2]భావిజనుల కంజలి మోడ్తున్.

30

గురుస్తుతి

సీ.

ఆదిని రెండవవేదంబు చెప్పిన మార్తిసర్వన్నఁ గ్రమస్వరాదిఁ
దరువాత శబ్దశాస్త్రముఁ జదివించిన కాండూరి గిరిదేశికప్రకాండు
నామీఁద సకలసిద్ధాంతము ల్దెలిపిన ధీరవర్యుఁ బ్రధాని సూరభట్టు
వెస నన్ను లక్షణవేత్తఁ గావించిన ఘను మంచికంటియోబనకవీంద్రు


తే.

స్మార్తకర్మంబు లెఱిగించి సభలఁ బూజ్యుఁ, జేయు నల[3]కొలిచలిమల్లసింగనార్యు
నాగమము లుపదేశించినట్టి రాజ, యోగివర్యునిఁ దలఁతు విద్యాగురులను.

31


క.

అని యిష్టదేవతాస్తుతి, యును సకలకవీంద్రులనుతియును గురునుతియున్
వినయమున సలిపి తెలుఁగున, ఘనకావ్యం బొకటి సేయఁగాఁ దలఁచుతఱిన్.

32
  1. నుచ్చరించి (వా), నుపచరించి (ఓ)
  2. భావికవుల (వా)
  3. కొలిచలమల (ఓ), కొలచలమల (సూ)