Jump to content

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కౌమోదకీసంజ్ఞఁ గని కృష్ణుదాపలిరెండవకరమున నుండు నెద్ది
నందకం బనుపేర నారాయణునికుడిక్రిందటిచే నెలుఁగొందు నెద్ది


తే.

శార్ఙ్గ మనఁ దనరారి కేశవునివామ, బాహుయుగమూలమునఁ గనుపట్టు నెద్ది
యట్టి హరియైదుకైదువు లబ్దచక్ర, ఘనగదాఖడ్గచాపముల్ మనుచు మమ్ము.

6


తే.

కాలమేఘమునందుఁ బ్రకాశ మొందు, [1]కారుమెఱుఁగుతెఱంగునఁ గైటభారి
యంసములపై వెలుంగుపీతాంబరంబు, బంగరుచెఱంగు మాకు శుభంబు లొసఁగు.

7


క.

బాలతమాలాగ్రమునం, గ్రాలు శబీనాథుకార్ముకంబో యనఁగా
నీలఘనదేహుఁ డగు గో, పాలుతలన్ మెఱయు బర్హిబర్హము నెంతున్.

8


క.

భువనగకచ్ఛప[2]కిరిమా, నవసింహాదిత్యభృగుజననరాఘవయా
దవబుద్ధకల్కు లనుకే, శవుపదిరూపములు మది నజస్రముఁ దలఁతున్.

9


శా.

శ్రీమన్మందకటాక్షవీక్షణము పైఁ జిల్కం బయోజేక్షణుం
డామోదంబున నర్మగర్భసరసేష్టాలాపముల్ పల్కఁగా
వేమాఱుం దరహాస మాననమునం [3]బెంపొందఁగాఁ గొల్చు శ్రీ
భూముల్ నిచ్చలు మా కొసంగుదురు సంపూర్ణంబుగా [4]నిచ్చలన్.

10


క.

దాంతు హరిచరణ[5]భక్తి, స్వాంతు రసాతలనిశాంతు నత్యంతదయా
వంతు సమతీతవిధిక, ల్పాంతుఁ బరమశాంతు నయ్యనంతుఁ దలంతున్.

11


తే.

నామదిఁ దలంచెద సుపర్ణనామధేయు, మురహరవిధేయు నమరసమూహగేయుఁ
గనకనిభకాయు భక్షితకాద్రవేయు, వక్త్రకాంతిజితాత్రేయు వైనతేయు.

12


క.

తిన్ననివేత్రము కలుముల, కన్నియ [6]వన్నియను హస్తకమలతలమునం
జెన్నొందు జగము మనిపెడు, వెన్నునిదళవాయిఁ దలఁతు విష్వక్సేనున్.

13


ఉ.

పాయక కొల్తు రామజనపాలుఁడు జానకిఁ జూడ నంపుచోఁ
దోయధి గోష్పదంబుక్రియఁ దోఁప జివాలున దాఁటి లంక క
త్యాయతలీలఁ బోయి దివిజారుల దోమలఁబోలెఁ బట్టి బా
హాయతశక్తిఁ గొట్టి సతి నారసి తద్విభుఁ గన్న మారుతిన్.

14


క.

శుక భీష్మ విభీషణ శౌ, నక రుక్మాంగద వసిష్ఠ నారద [7]బక దా
ల్భ్య కిరీటి పుండరీకులఁ, బ్రకటితహరిపాదపద్మభక్తులఁ దలంతున్.

15


వ.

అని యివ్విధంబున.

16


క.

పాతతహేతి పరిజన, వ్రాతంబుగ శేషశయను వనరుహనయనున్
ఖ్యాతిగ "న హరేస్తు పర, స్త్రాత" యనుట దెలిసి కృతిమొదలఁ దలఁచి వెసన్.

17
  1. కాఱు మెఱుంగు (పూ.ము., సూ) అప్పకవియే రేఫాక్షరసీసమాలికలో దీనిని 'కారు' అని లఘురేఫముగా నిచ్చియున్నాఁడు.
  2. కిటి (సూ)
  3. విప్పొంద
  4. నిష్టముల్ (గి,సూ)
  5. వర్తి
  6. వన్నెయును
  7. బలి (సూ)