పుట:అక్షరశిల్పులు.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దస్తగిరి, షేక్‌ అలీ, షేక్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, షేక్‌ దావూద్‌ సాహెబ్‌ లాంటి వారు కూడ ఇటువంటి 'వివక్ష-విస్మరణ'కు గురికాకపోలేదు. ఆ కారణంగా తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలలో ముస్లిం కవులు, రచయితల పరిచయాలు అత్యల్పంగా కన్పిస్తాయి, అక్కడక్కడా ఒకటీ రెండూ కన్పించినా ఆయా కవులు రచయితల గురించి, వారి రచనల గురించినసమాచారం నామమాత్రమే. భాషాశాస్త్ర నిపుణులు, ఉత్తమ సాహిత్య విమర్శకులు ఆచార్య తూమాటిటి దోణప్ప (నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు) గారి ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యానికి ముస్లింలు అందచేసిన సేవల మీద పరిశోధన జరిపే అవకాశం నాకు లభించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని 'తెలుగు సాహిత్యం ముస్లింల సేవ' సిద్ధాంత వ్యాసాన్ని నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించి 'పి.హెచ్‌డి' పట్టాను పొందాను. ఆ పరిశోధన సమయంలో 1984 వరకు ముస్లిం కవులు, రచయితలు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు నా పరిశోధాన పరిధిలోకి వచ్చాయి. నా యీ సిద్ధాంత వ్యాసాన్ని 1991లో ప్రచురించాను.

ఈ గ్రంథం వెలువడ్డాక, అద్బుతమైన తెలుగు సాహిత్యాన్ని సృష్టించిన ముస్లిం కవులు, రచయితల లౌకిక దృక్పథం, జాతీయత, దేశభక్తి తదితర విషయాలు గురించి తెలుగు పాఠకుల ఎరుకలోకి వచ్చాయి. 'ఏకత్వంలో భిన్నత్వం ' అంత:సూత్రంగా సాగుతున్న భారతీయ జన జీవన స్రవంతిలో ముస్లింలు పాలు-తేనెగా కలసిపోయి భిన్నత్వంలో ఏకత్వాన్ని సజీవంగా నిలుపుతున్నతీరుతెన్నులను వెల్లడి చేసింది.

'తెలుగు సాహిత్యం: 'ముస్లింల సేవ' ప్రచురణ తరువాత సాగిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సాహిత్య రంగంలో ముస్లింల ప్రవేశం, ప్రమేయం అత్యధికమని చెప్పవచ్చు. నా రచన తరువాత ఎందరో ముస్లిం కవులు, రచయితలు తెలుగు సాహిత్య వెలుగును ప్రకాశింప చేశారన్నది సత్యదూరం కాదు . ఒక వైపు తమ తల్లి భాష 'ఉర్దూను ' విస్మరించకుండనే ప్రాంతీయ భాష తెలుగును కూడ వంట బ్టించుకుని, తెలుగు సాహిత్య ప్రక్రియలలో ప్రవేశం సంపాదించి ఉత్తమ సాహిత్యాన్నిసృజియిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వర్తమానంలో ముస్లిం కవులు, రచయితల సంఖ్య దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. సమకాలీన సమాజంలో పాఠకుల ఆదరణ పొందిన ప్రతి ప్రక్రియలో అద్భతమైన వస్తు పరంగా, భాష పరంగా నైపుణ్యాన్నిసాధించి చక్కని గ్రంథాలను అందిస్తున్నారు.