పుట:అక్షరశిల్పులు.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చరిత్ర : తెలుగు భాషలో సాహిత్య సృష్టి చేస్తున్న కవులు, రచయితల వివరాలతో ప్రచురితం అవుతున్న గ్రంథాలు చూస్తే ముస్లిం కవులు-రచయితల పరిచయాల నమోదుకు నాకు తెలిసినంతో ప్రముఖ కవి ముహమ్మద్‌ జైనుల్‌ ఆబెదీన్‌ ప్రయత్నం చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖలో 'జాయింటు డైరక్టర్‌' గా హైదారాబాద్‌లో బాధ్యాతలు నిర్వహించారు. ఆ తరువాత ఆయన 1972లో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ చేశాక ముస్లిం కవులు, రచయితలందర్ని ఒక చోట సమావేశపర్చాలన్న ప్రయత్నంలో భాగంగా రాష్ట్రరాజధానిలో 1972లో 'ముస్లిం తెలుగు రచయితల సభలు' నిర్వహించారు. ఆ తరువాత ముస్లిం కవులు రాస్తున్నగ్రంథాల ప్రచురణకు తొడ్పడాలన్నలక్ష్యంతో 'తెలుగు ఇస్లామిక్‌ ఎకాడమి' అను సంస్థను కూడ ఆయన స్థాపించారు. ఈ సందార్భానికి సంబంధించిన వివరాలను, విశేషాలను వెల్లడిచేయగల పత్రాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.

1982లో హైదారాబాద్‌లో 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' జరిగింది. ఈ సమ్మేళనం నిర్వహణకు షేక్‌ జవాద్‌ హుసేన్‌, యస్‌.ఏ.సమద్‌, యూసుఫ్‌ ఘోరి తదితరులు నడుంకట్టి విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ముహమ్మద్‌ జైనుల్‌ అబెదీన్‌, ఎం.సైఫుల్లా బేగ్ ఎం.ఏ అజీజ్‌, డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి, ఎం.బాగా రెడ్డి, అల్లాడి పెంటయ్య లాంటి పెద్దలు మార్గదర్వకత్వం వహించారు. ఈసందర్భంగా 'తెలుగు దివ్వెలు' అను ప్రత్యేక సంచికను తెచ్చారు. ఈ సంచికలో 36 మంది కవులు, రచయితల వ్యాసాలు, కవితలు, పద్యాలు, గేయాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక సంచికలో ప్రచురణకు తమ రచనలు అందించిన కవులు, రచయితల వివరాలను చాలా క్లుప్తంగా పొందుపర్చారు.

1984లో ఆచార్య తూమాటి దోణప్ప (నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు) ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యానికి ముస్లింలు అందచేసిన సేవల మీద డాక్టర్‌ షేక్‌మస్తాన్‌ పరిశోధన జరిపారు. ఆ సిద్ధాంత వ్యాసానికి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఆయన 'పి.హెచ్.డి' పట్టాను పొందారు. ఈ సిద్ధాంత వ్యాసాన్ని 1991లో 'తెలుగుసాహిత్యం: ముస్లింల సేవ' పేరుతో గ్రంథంగా వెలువరించారు. ఈ గ్రంథంలో 1984 వరకు తెలుగులో రాసిన ముస్లిం కవులు, రచయితల వివరాలను సంక్షిప్తంగా పొందుపర్చారు.

డాక్టర్‌ ఎస్‌ షమీవుల్లా 'మైనారిటీ కవిత్వం తాత్విక నేపద్యం' అను గ్రంథాన్ని వెలువరించినా, అది తాత్విక నేపధ్యం మీదా చర్చ వరకే పరిమితమయ్యింది. ప్రముఖ కవి ఎండి. ఖాజా 'ముస్లిం వాదా తాత్విక సిద్ధాంతం-సాహిత్యం' అను గ్రంథాన్ని తెచ్చారు. ఈగ్రంథంలో కూడ ముస్లింవాద తాత్విక సిద్ధాంతం తదితర విషయాల మీద చర్చించారు.