పుట:అక్షరశిల్పులు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వర రావు ప్రముఖ పాత్రికేయులు హైదారాబాద్‌

శుభాభినందానలు శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ జర్నలిస్టుగా, రచయితగా నాకు చాలా కాలంగా తెలిసినవారు, అంతకుమించి హితులు. అభిరుచి కారణంగా పత్రికారంగంలో ప్రవేశించి,విలేఖరి స్థాయి నుండి సంపాదాకుడు స్థాయికి స్వయం కృషితో ఎదిగిన ప్రతిభావంతుడాయన. రాసే సామర్థ్యం, గీసే ప్రజ్ఞ కలగలిసి ఉన్న జర్నలిస్టులు చాలా అరుదు. అలా అరుదైన వారిలో ఆయన ఒకరు. గీసే సామర్థ్యంలోనూ ఆయన ప్రజ్ఞ అసాధారణం. చిత్ర రచన చేయగలరు, వ్యంగ్య చిత్రాలూ వేయగలరు. ఇంతటి శక్తి సామర్ధ్యాలు కలిగిన నశీర్‌గారు జీవిక కోసం న్యాయవాదా వృత్తిని ఎంచుకున్నారు. జర్నలిస్టు, రచయితగానే కాక ఆయనను నేను అభిమానించడానికి ఒక ముఖ్య కారణం అయన త్రికరణశుద్ధిగా సమాజంలోని అన్ని వర్గాలవారు, అన్ని విశ్వాసాల వారు పరస్పరం గౌరవంతో, ప్రేమాభిమానాలతో కలసి జీవించాలని ప్రగాఢంగా ఆశిస్తున్నారు, అందుకోసం నిరంతరం కృషి చేస్తున్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిములు నిర్వహించిన మహత్తర పాత్రను వివరిస్తూ శ్రీ నశీర్‌ పత్రికల్లో వ్యాసాలు వ్రాసి, ఆక్రమంలో పలు ప్రామాణిక, పరిశోధనాత్మక గ్రంథాలను వరుసగా వెలువరిస్తున్నారు. ఈ గ్రంథాలు వెలువడ్డప్పుడల్లా సంతోషించిన వారిలో నేనూఒకడిని. ఆయన గ్రంథాలు దేశభక్తిని ప్రబోధించడమే కాక మాతృదేశం కోసం ముస్లిములు ఎంతటి మహత్తర త్యాగాలు చేశారో, స్వాతంత్య్రోద్యమంలో మిగతా వారందారితో భుజం భుజం కలిపి ఎలా మమేకమై పోరాడరో తెలియజేసే చరిత్ర గ్రంథాలవి. ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల సమాచారం సేకరించడానికి పడిన శ్రమ కంటె మరింతగా కష్టపడి శ్రీ నశీర్‌ అహమ్మద్‌ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 'అక్షరశిల్పులు' గ్రంథాన్నినిర్మించారు. తెలుగు సాహిత్య చరిత్ర రచయితలకు, పరిశోధకులకు బాగా ఉపయోగపడగల మంచి రచన ఇది. ఈ గ్రంథలోని కవులు,రచయితలు, అనువాదాకుల పరిచయాలు సంకిపంగా ఉన్నా ప్రామాణికంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యానికి, ముస్లిం సమాజానికీ కూడ 'అక్షరశిల్పులు' ద్వారా శ్రీ నశీర్‌ గొప్ప సేవ చేశారు.