పుట:Naa Kalam - Naa Galam.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన వెంటనే స్పందిస్తూ, తాను త్వరలో తిరిగి గుజరాత్‌ను సందర్శించి, బాధితులకు మరింత సహాయం చేయగలనని సమాధానమిచ్చారు! ఇలాంటివి చూసి, ఇప్పటి మన పరిపాలకులు ఎంతో నేర్చుకోవలసి వుంది! బాధ్యతగల ఒక సామాన్య పౌరుడు లేఖ రాసినా, వెంటనే ప్రతిస్పందించడం ఉత్తమ పరిపాలకుని సంస్కృతి!

జలగం వెంగళరావు ముఖ్యమంత్రిత్వం

1972లో "జై ఆంధ్ర" ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ముల్కీ నిబంధనలను అమలు పరచవలసిందేనని సుప్రీంకోర్టు తీర్పు యిచ్చింది. అంటే, తెలంగాణాలో జన్మించిన వారికి, లేదా ఒక నిర్ణీత కాలంపాటు అక్కడ నివసించిన వారు మాత్రమే ఆ ప్రాంతంలో ఉద్యోగాలకు అర్హులని దీని తాత్పర్యం. ఇది ఆంధ్రప్రాంతీయులకు చాలా ఆందోళన కలిగించింది.

దీనికితోడు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు "ఇదే ముల్కీ నిబంధనలపై తుది తీర్పు" అని వ్యాఖ్యానించడం అగ్ని పై ఆజ్యం పోసినట్టయింది. ఇందుకు నిరసనగా ఆంధ్ర ప్రాంతంలోని మంత్రులు, శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న "జై ఆంధ్ర" ఉద్యమం తీవ్రరూపం ధరించింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఎక్కడ చూచినా, "జై ఆంధ్ర" నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శాంతి భద్రతలు విఫలమైనాయి. దాదాపు ఆంధ్ర ప్రాంతంలోని అనేక పట్టణాలలో కర్‌ఫ్యూ విధించారు. 1973 జనవరిలో పి.వి. నరసింహారావు మంత్రి వర్గాన్ని కేంద్రం రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించింది. అసెంబ్లీని రద్దు చేయకుండా "సుప్త చేత నావస్థ"లో వుంచారు. అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు అసెంబ్లీని "నిద్ర" మేల్కొల్పవచ్చు!