పుట:Andrulasangikach025988mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని నాచన సోమన ఉపమించినాడు.

మన వాఙ్మయములో పాలకురికి సోమనాథుని కాలమునుండి తంజావూరి రఘునాథ రాయలవారకు బహుకవులు బొమ్మలాటను పేర్కొనిరి. బొమ్మలాట యనగా తోలుబొమ్మలాట. భారతీయులలో ఏ యే ప్రదేశాలలో నిది కలదో తెలియదుకాని తెనుగువారిలోను, కర్ణాటకులలోను ఇది చాలా ప్రాచీనమునుండి వచ్చినట్టి యాట. సన్ననివస్త్రమును తెరగా కట్టి దానిలోపల పెద్ద దివటీలు వెలిగించి తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు, తలలకు దారములు కట్టి మధ్య నొక దబ్బతో అ బొమ్మనుపట్టి నిలబెట్టి అవసరమగు దారములను లాగుతూ వదులుతూ బొమ్మ లాడించెడివారు. ఆట కనుగుణ్యముగా తాళము వాయించుతూ కథకు సంబంధించిన పాట పాడుదురు. రామయణకథకు గోన బుద్ధారెడ్డి రామాయణములోని ద్విపదలను పాడుదురందురు. బొమ్మలను సూత్రములతో నాడించువా రగుటచేత అట్టి ప్రదర్శకుని "సూత్రధారుడు" అని యందురు. సంస్కృత నాటకములలో నాటకమును ప్రారంభించునప్పుడు 'సూత్రధారుడు' ప్రవేశించి ప్రదర్శింపనున్న నాటకమును గురించి కొన్ని మాటలు చెప్పిపోవును. కాని తోలుబొమ్మలాటలో ఆదినుండి తుదివరకు సూత్రదారుడు లేనిది బొమ్మ లాటయే యుండదు. కాన నాటకాలకన్న బొమ్మలాటకే సూత్రధార పదము సరిపోవును. అట్లగుచో తోలుబొమ్మలను చూచి నాటకాలవారు సూత్రధార పదమును నాటక నాట్యవిధానమును సవరించుకొనిరా లేక నాటకాలను జూచి బొమ్మలాటగాండ్రు నేర్చుకొనిరా అనునది చర్చనీయాంశమగును.

తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు.