Jump to content

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?/మన చదువుల్లో కథల స్థానం ఏమిటి?

వికీసోర్స్ నుండి

మన చదువుల్లో కథల స్థానం ఏమిటి?

మన స్కూళ్ళలో ఒకటీ రెండు తరగతులకైనా రోజూ ఒక పీరియడ్ కథలు చెప్పుకోడానికుంటే ఎంతబావుంటుంది ! ప్చ్! మన పిల్లలు ఆ మాత్రం భాగ్యానికైనా నోచుకోలేక పోతున్నారు. ఈ అవకాశమే ఉంటే బడిలో చేరిన పిల్లలు బడి నుంచి జారిపోకుండా సగం సమస్య పరిష్కారమయ్యేది. 'కథలు చెప్పుకొంటే డ్రాపౌట్ తగ్గుతారా' అని నన్ను చాలామంది ఎగతాళిగా చూడొచ్చు. ఇంత పెద్ద సమస్యను ఇంత తక్కువగా పరిగణిస్తున్నాని నన్ను ఎద్దేవా చెయ్యుచ్చు. ఇలాంటి సలహా నేనిచ్చినపుడు నాపట్ల వెటకారంగా (సానుభూతితోనూ) చూచిన సీనియర్ అధికార్ల నెందరినో నేనెరుగుదును. ఏం చేద్దాం మరి? వారి 'అపార పరిపాలనానుభవం' వాళ్ళనలా తయారు చేసింది! ఒకప్పుడు ఈ అధికార్లూ నాలానే ఎంతో కొంత ఆలోచించి ఉండకపోరు. కానీ పాపం వాళ్ళు సీనియర్లయిపోయాక ఇలా మారిపోయారు!

ఇంతకన్నా ఘోరం ఏమంటే మన ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో కథలకు కాసింత చోటయినా చిక్కడం లేదు. కాకుంటే 'కథల ప్రాధాన్యం' మీద మొత్తం శిక్షణా కోర్సులో ఎక్కడయినా ఓ పాఠం ఉంటే ఉండొచ్చు. అంతకంటే కొంచెం లోతుకు పోయిన పాపాన ఈ సంస్థలెప్పుడూ పోవు.

నాకో తీరని కల ఉంది. అదేమంటే మన టీచర్లకు కనీసార్హతగా ముప్పై కథలయినా తడుముకోకుండా చెప్పడం ఉండే రోజు ఎప్పుడొస్తుందా అని మన ప్రాచీన కథల మీద ఈ మాత్రం పట్టు ఉండే టీచర్లుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో గదా అని! 'పట్టు' అంటే గందర గోళ పరచకుండా, గజిబిజి చెయ్యకుండా సాఫీగా చెప్పగల్గడం అన్నమాట.

కథలు చెప్పుకోవడం మన సమాజపు సహస్రాబ్దాల సంప్రదాయం, వారసత్వం! ఒకటీ రెండా? వేలాది సాంప్రదాయక కథలు నుంచి చెవికి, గుండె నుంచి గుండెకు ఎన్ని శతాబ్దాలపాటు ఎక్కిపొయ్యాయో! అంత దూరం నేనాశించడంలేదు గానీ కనీసం ముప్ఫై కథలు చెప్పగల్గితే మన ఒకటి రెండు తరగతుల పిల్లలు ఎన్నో విలువలు నేర్చుకొంటారు. ఇతర సబ్జక్టులతో పాటు కథలకింత చోటివ్వగల్గితే ఎన్నో విషయాలు పిల్లలకు తెలుస్తాయి. మనం చెప్పే ఇతర పాఠ్యాంశాలు కూడా కావల్సినన్ని తెలుస్తాయి.

కథ లెక్కడ దొరుకుతాయి?

సాంప్రదాయిక కథలంటే ఏమిటి? వీటి ప్రాధాన్యత ఏమిటి? దీన్ని మనం పరిశీలించాలి. ఈ కాలపు కుర్ర టీచర్లను కథలు చెప్పమంటే పిల్లల పత్రికల్ని తిరగేస్తున్నారు. కామిక్స్‌ను , వాస్తగాథల్ని, చివరికి పెద్ద పెద్ద జోక్స్‌ను సైతం పిల్లలకి కథలుగా చెప్పడానికి పూనుకొంటున్నారు. ఇవన్నీ కథల జాబితాలోనే వస్తాయా? వస్తే రావచ్చు. కానీ మన ఆరేడేళ్ళ పిల్లల్ని ఇవి మన పాతకథలంత ప్రభావితం చేస్తాయా? అనేది మాత్రం అనుమానాస్పదం.

మన సాంప్రదాయక కథలకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న కథల్లో కన్పించడం లేదు. మంచి కథకుండే లక్షణాలేమిటి? వీటిని తర్వాత పరిశీలిద్దాం. దీనికి ముందు ఇలాంటి మంచి కథలెక్కడ దొరుకుతాయో చూద్దాం

పంచతంత్రం, జాతక కథలు, మహాభారతం, అరేబియన్ నైట్స్, విక్రమాదిత్య కథలు, వివిధ ప్రాంతాల జానపద కథలు మనకు ఎన్ని మంచి కథల్నయినా అందిస్తాయి. ఇదొక పెద్ద భాండాగారం. కొంచెం కష్టపడ గల్గితే కథా సరిత్సాగరం, గులిస్తాన్, బోస్టన్, బీర్బల్, తెనాలి రామలింగడు, జానపదాలు లాంటివి కావల్సినన్ని దొరుకుతాయి. ఒక్క మన దేశానికే గాదు ప్రపంచమంతా మంచి కథలు కోకొల్లలు. 'ఇంత పరిశోధన మాకెక్కడ సాధ్యం' అని మీరనవచ్చు. మిత్రులారా! కథలు చెప్పాలనే అనుకొంటే మంచి కథల్ని ఎన్నుకోవడం, వెతుక్కోవడం చాలా చిన్నపని అని నా అభిప్రాయం.

మంచి కథ ఎలా ఉంటుంది?

ఏది మంచికథ అని నన్నెవరైనా ప్రశ్నిస్తే పిల్లలు తరతరాల నుంచి దేన్ని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారో అదే మంచికథ అని నేను జవాబిస్తాను. ఇక్కడ న్యాయ నిర్ణేతలు పిల్లలేతప్ప మనం కాదని నా దృఢ విశ్వాసం. మన పంచతంత్రంలోని 'సింహం కుందేలు' కథనే తీసుకోండి. దీన్ని మనం చాలా సీదాసాదా కథగా భావిస్తాం. కానీ లోతులోకి వెళితే ఇందులోని మంచి కథ లక్షణాల్ని మనం పసిగట్టవచ్చు. ఈ కథలోని మలుపుల్ని ఇప్పుడు కొంచెం పరిశీలిద్దాం.

మన బుజ్జి కుందేలు సింహానికి కవళంగా వెళ్ళాల్సిన దుర్దినం వచ్చింది. తీరిగ్గా కుందేలు సింహం గుహ దగ్గర కెళ్లేప్పటికి ఆకలితో సింహం నకనకలాడి పోతోంది. మిన్నూ మన్నూ తెలిసే స్థితిలో లేదది. ఇప్పుడు మనం కుందేలు తన అబద్దాల పురాణాన్ని ప్రారంభించాలి. సింహంతో కనీసం మాట్లాడ్డానికయినా తగిన సందర్భమేనా ఇది? ఏమాత్రం కాదని కథ వినే వాళ్ళందరికీ తెలుసు. అయినా కుందేలు తానెందుకు ఆలస్యంగా రావల్సి వచ్చిందో, దారిలో తనని మరో సింహం ఎలా అడ్డగించిందో ప్రాణాలకు తెగించి చెప్పింది. ఆకలి కంటె కోపం తీవ్రమైందని కుందేలుకు తెలుసు. సరిగ్గా ఆ పాయింటునే అది పట్టుకొంది. పెత్తందార్లకు అహంకారం ఎక్కువ. అది ఏ మాత్రం దెబ్బతిన్నా వాళ్ళు ఓర్చుకోలేరు. అందుకే సింహం ఆకల్ని అవతలబెట్టి శత్రువు సంగతి తేల్చుకోవాలని కుందేలు వెంట నడిచింది. గుడ్డి భావి దగ్గరికి చేరింది.

మళ్ళీ ఇది కుందేలుకు కష్టకాలం (కథలో ఇదో మలుపు). ఇక్కడ కూడా కుందేలు తెలివిగా సింహం తెలివితక్కువ ఆవేశం మీదా, అసూయ మీదా ఆధారపడింది. సింహం బావిలోకి చూచి తన బింబాన్ని శత్రు సింహం అనుకొని దూకి దిక్కులేని చావు చచ్చింది.

ఇన్నాళ్ళూ ఇంత ప్రచారం పొందిన ఈ కథను ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ కథా వస్తువేమీ సామాన్యమైంది కాదు. దుర్మార్గమైన అధికార పిశాచం ముందు ప్రాణాలతో బయటపడ్డం దాదాపు అసాధ్యమైన వేళ కుందేలు లాంటి బడుగు ప్రాణి పాపం ఏం చెయ్యాలి? అనేది ఇక్కడున్న సమస్య. నిజానికిది చాలా పెద్ద విషయం. సాధారణంగా ఇంత పెద్ద విషయాల్ని మనం పిల్లలకు దూరంగా ఉంచాలనుకొంటాం. విచిత్ర మేమంటే పిల్లలు ఇంత పెద్ద విషయాన్నే ఇష్టపడతారు! ఎందుకిష్టపడతారు? దాన్ని తర్వాత పరిశీలిద్దాం. ఇక్కడ మరో అంశం కూడా మనం పరిశీలించాలి. ఒక బక్కప్రాణి మహా బలవంతుడైన ఒక శత్రువు బారినపడి కష్టాల్లో చిక్కుకొన్న సందర్భమిది. ఇందులోంచి బయటపడ్డానికి ఈ బక్క జీవి ఒక ఎత్తుగడ వేసింది. ఈ ఎత్తుగడలో ఏమాత్రం 'నీతి' లేదు. మరో సందర్భంలో ఇలాంటి అబద్ధాలు చెపితే మనం కుందేల్ని టక్కరి కుందేలు కింద లెక్కగడతాం. కానీ ఇక్కడ ఈ బడుగు ప్రాణి అసాధారణమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. అమోఘమైన ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని చూపింది. చిట్టచివరి దాకా ఏమాత్రం తొణక్కుండా నిలబడి కార్యం సాధించింది. ఇందుకోసం ఒక పెత్తందారుతో సాధారణ బడుగు వ్యక్తి మాట్లాడినట్టే భయం భయంగా మాట్లాడింది. అనుకొన్న పని నెరవేర్చుకొంది.

ఈ కథ నడకను కూడా మనం పరిశీలించాలి. కథారంభంలో జంతువులు సింహంతో కుదుర్చుకొన్న ఒప్పందం ఫలితంగా ఒక వింత శాంతి నెలకొంటుంది. పైకి కాలం సజావుగా నడుస్తున్నట్టు కన్పించినా ఇది దినదిన గండమే. ఉన్నట్టుండి కుందేలు వంతు రావడంతో అసలు కథ తెరమీదికి వచ్చేస్తుంది.

ఇక మన కథ ఒక్కక్షణం కూడా ఆగకుండా చకచకా సాగిపోతుంది. మన కుందేలు ఈ కష్టం నుంచి బయట పడాలంటే ఒక్క నిమిషం వ్యర్ధం చేసినా కొంప మునుగుతుంది. అదకొ ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడేమీ నల్లేరు మీద నడక కాదు. మహా ప్రమాదకరమైంది. అయినా కుందేలు దానికే పూనుకొంది. శ్రోత కిక్కడ గుక్క తిప్పుకొనే వీలుండదు. ఏమాత్రం తటపటాయింపుకు అవకాశం ఉండదు. అతడిప్పుడు కుందేలు పక్షపాతి. అది ఏంచేసినా అతనికది ఎంత న్యాయంగా ఉంటుంది! ప్రతిదీ మన శ్రోత కుందేలు వైపు నుంచే ఆలోచించడం మొదలు పెడతాడు!

ఈ కథని పిల్లలెందుకంతగా ఇష్టపడుతున్నారో గుర్తించడానికి ఈ పరిశీలన సరిపోతుందనుకొంటాను. తమను అందులో చూసుకొని మమైకం కాగల ఒక పాత్ర, ఒక హీరో ఈ కథలో వారికి చిక్కింది. అదే కుందేలు. పిల్లల రోజువారీ జీవితంలో కూడా కుందేలు ఎదుర్కొన్న సవాళ్ళ వంటివి ఎన్నో ఎదురవుతుంటాయి.

పిల్లలు చిన్నవాళ్ళు, బలహీనులు, ఎక్కువ సందర్భాల్లో వాళ్ళ కిష్టం లేనిదాన్ని వాళ్ళు చెయ్యాల్సి వస్తుంటుంది. అధికారం శారీరకాధిక్యత గల వారి వల్ల వాళ్లెప్పుడూ కష్టాల పాలవుతుంటారు. భయాందోళనలకు గురవుతుంటారు. కుందేలు ఎదుర్కొనే సవాళ్ళతో పిల్లలెదుర్కొనే సవాళ్ళకెంతో సామ్యం ఉంది. దీన్ని మనం ఎప్పుడూ గుర్తించం. మన పద్దతిలో మనం అధికారమంతా మన చేతిలోనే పెట్టుకొని వాళ్ళతో నిత్య వ్యవహారాలు జరుపుతుంటాం.

హఠాత్తుగా ఒక బంధువో, మరొకరో చనిపోతే పిల్లల మీద అది ఎంత ప్రభావం కల్గిస్తుందో, వాళ్లెంత ఆందోళనకు గురవుతారో మనం గుర్తించం. అలాగే వాళ్ళు తమకంటే శక్తివంతులైన పెద్దలతో పడే ఘర్షణను కూడా మనం గమనించం.

అందువల్లనే కథా ప్రారంభంలోనే పిల్లలు కుందేలులో తమను చూచుకొంటారు. కథ నడిచే కొలదీ కుందేలు వారికి పెద్ద ఆకర్షణగా మారుతుంది. కుందేలు ఒక ఎత్తుగడ పన్నింది. అది ఫలించింది. దీంతో తన సమస్యనే గాదు అందరి సమస్యనూ కుందేలు పరిష్కరించింది. పిల్లలు ఇలాంటి పరిష్కారాన్నే ప్రేమిస్తారు. కుందేలు ఎత్తుగడలో పిల్లలకు నచ్చే మరో అంశం కూడా ఉంది. అదేమంటే ఏదో ఒక సాకు చెప్పి అది తప్పించుకొనజూడ్డం. ఎందుకు ఆలస్యమైంది? అని సింహం అడిగితే కుందేలు చెప్పిన సాకు పిల్లల్ని ఎందుకార్షిస్తుందో చెప్పగలరా? ఎందుకేముంది పిల్లలు కూడా ఇలా సాకులు చెప్పి ‘కష్టాల్నించి బయట పడేవాళ్లేగదా! అందుకని ఈ ఎత్తుగడతో కుందేలు తనను కాపాడుకోవడమే కాకుండా సింహాన్ని అంతం చేసింది. శత్రువును హతమారిస్తే తప్ప పాపం కుందేలు ప్రమాదం నుంచి బయట పడలేదు. అంటే ఈ కథ మనుగడ కోసం సాహసంతో చేసే విధ్వంసాన్ని నాటకీయంగా మన ముందు పెడుతోంది. ఇందులో ఏమి నీతి ఉంది? మనుగడకోసం చేసే పోరాటతప్ప ఇందులో ఏ నీతి లేదు. పిల్లలవైపు నుంచి చూస్తే తప్ప నిజానికీ కథలో మనం అభినందించదగ్గది ఏదీ లేదు. పెద్దలుగా మనం చూస్తే ఈ కథ నీతి లేని కథ. కుందేలు చేసింది పచ్చి మోసం తప్ప మరేమీ కాదు.

కథల ప్రయోజనం ఏమిటి?

అంటే పిల్లలకు చెప్పడానికి ఎన్నుకొనే మంచి కథల్లో నీతి తప్పనిసరి కాదన్నమాట. అయితే సింహం-కుందేలు కథలో ప్రత్యక్ష నీతి గాకపోయినా పరోక్షనీతి లేకపోలేదు. పిల్లల్ని భావోద్రేకానికి గురిచేసే అంశం ఇందులో ఒకటి ఉంది. ఒక ప్రమాదం ముంచుకొచ్చినపుడు ఎంత నిబ్బరంగా నిదానంగా ఉండాలో ఈ కథ చెపుతుంది. సరైన ఆలోచన చురుకుదనం అప్పుడే సాధ్యమని కూడా ఈ కథ చెపుతుంది.

కానీ సాంప్రదాయకార్ధంలో ఇలాంటి పరోక్ష నీతిని కథా నీతిగా లెక్కించలేము. నీతి స్పష్టంగా ఉండాలి గానీ ఏదో డొంక తిరుగుడుగా వెతికి వెతికి చూస్తే తప్ప కనబడుకుండాలా ఉండకూడదు.

ఈ చర్చా సారాంశం ఏమిటి? పిల్లలకి నైతిక విలువల్ని పెంచడం మన సాంప్రదాయ కథల ప్రధానోద్దేశం కాదు. కథలు చెప్పడం వల్ల వచ్చే అసలైన లాభాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు వాటిని చూద్దాం.

మంచి శ్రవణం

మంచి శ్రోత అంటే ఎవరు? చివరి దాకా వినేవాడే మంచి శ్రోత. కానీ చాలామంది అలా చివరిదాకా వినరు. మనం పిచ్చాపాటీ మాట్లాడేపుడు కూడా చాలామంది మధ్యలోనే అడ్డం వస్తుంటారు. మనం చెప్పబొయ్యేది ముందే తెలిసిన వాళ్ళలా చేస్తే కొంత అర్ధం చేసుకోవచ్చు కానీ అసలు వీళ్ళకి అంత దూరం వినడానికే ఓపిక ఉండదు. పెద్ద పెద్ద మేనేజిమెంటు, పరిపాలనా కోర్సుల్లో సైతం ఈ రోజుల్లో ఓపిగ్గా వినడాన్ని ఓ నైపుణ్యంగానే గాక ఓ మంచి లక్షణంగా కూడా పరిగణిస్తున్నారు. కథలు చెప్పడం చాలా చిన్న వయస్సు నుంచే ఇలా జాగ్రత్తగా ఓపిగ్గా వినే లక్షణాన్ని పెంపొందిస్తుంది. పెద్దయ్యాక ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కథలు చెప్పడం వినడం ఒక మహత్తర సంప్రదాయంగా గల మన దేశంలో ఎదుటి వాడిని ఓపిగ్గా వినేవాళ్ళ సంఖ్య ఈ రోజుల్లో తగ్గిపోవడం చాలా విచిత్రంగా అన్పించవచ్చు. కానీ ఇది వాస్తవం. చిన్న వయస్సులో పిల్లలకు కథలు చెప్పక పోవడం దీని కొక ప్రధాన కారణమని నా అభిప్రాయం. నాగరికత పెరిగాక పిల్లలకు కథలు చెప్పడానికి మనకు తీరిక చిక్కడం లేదు. దీని ఫలితం మనల్ని ఈ దుస్థితికి తెచ్చింది.

ఊహించడం, తర్కించడం

తమకు నచ్చిన కథను పిల్లలు మళ్ళీ మళ్ళీ వినాలనుకొంటారు. తమకు తెలియకుండా ఇలాంటి కథల పట్ల వాళ్ళు మక్కువ పెంచుకొంటారు. రెండోసారో మూడోసారో కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందో ముందే వాళ్ళు చెప్పగల్గుతారు. ఇలా జరగబొయ్యేది ముందుగా చెప్పగల్గడం ఒక సామర్ధ్యం. మళ్ళీ మళ్ళీ ఒకే కథ వినడం వల్ల ఇలాంటి సామర్ధ్యం పెరుగుతుంది. వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికిది దోహదపడుతుంది. మొదటి రెండు తరగతుల పిల్లలు చదవడం నేర్చుకొనే దశలో ఈ 'ముందుగా చెప్పగల్గడం' అనే సామర్ధ్యం ఎంతైనా ఉపయోగపడుతుంది.

గణితం నేర్చుకోవడంలో కూడా ఈ సామర్ధ్యం విలువ వెలలేనిది. గణిత సూత్రాలన్నీ 'ముందుగా ఊహించి చెప్పగల్గడం' మీదనే కదా ఆధారపడతాయి. అందువల్ల గణిత అభ్యసనానికీ ఈ కథా శ్రవణ సామర్ధ్యానికీ మధ్య ఓ సామ్యం, సంబంధం ఉందని నా అభిప్రాయం. కథకు కూడా కొన్ని నిబంధనలు, పద్ధతులు ఉంటాయి. వాటిని పిల్లలకు కథలు వినేకొద్దీ పట్టుకొంటారు. ఇలా పట్టుకొనే కొద్దీ వాళ్ళు ముందుగా ఏం జరగబొయ్యేదీ ఊహించి మరింత బాగా చెప్పగల్గుతారు. అలాంటి పిల్లలు గణిత సూత్రాల్ని కూడా ఇంతే బాగా పట్టుకోగలుగుతారు.

మరో ప్రపంచం

పిల్లలు తమ చుట్టూ చూస్తున్న ప్రపంచాన్ని కథలు విస్తృత పరుస్తాయి. తాము ఎప్పుడూ పాల్గొనని సందర్భాలను, చూడని మనుషులను, పాత్రలను వాళ్ళు కథల్లో చూస్తారు. ఇలాంటి వాటితో మనకేం పని అని మీరనుకోవచ్చు. కానీ ఇవి కూడా మన జీవితంలో భాగాలు! వాటిని ఎప్పుడూ మనం చూడకున్నా అవి మనల్ని, మన ఆలోచనల్ని కదిలిస్తాయి. చిన్న వయస్సులో ఈ కదలిక మరింత ఎక్కువగా ఉంటుంది. జీవితాంతం ఈ క్రమం కొనసాగుతూనే ఉంటుంది. తమ చుట్టూ ఒక్క చెడ్డ మనిషి కూడా లేకున్నా పిల్లలు చెడ్డవాళ్ళను గురించి ఆలోచిస్తారు. అలాగే అసాధారణ ప్రతిభావంతుల్నీ, బుద్ధిమంతుల్నీ, అందగాళ్ళనూ కలుసుకొనే ఛాన్సు తమకెప్పుడైనా దక్కపోతుందా అని ఆరాటపడతారు. ఆదర్శమూర్తుల్ని అభిమానించడం పిల్లల మనస్తత్వంలో ఒక భాగం. అలాగే ప్రమాదాలన్నా దుష్టశక్తులన్నా భయపడ్డం కూడా వాళ్ళ స్వభావంలో భాగం. మన సాంప్రదాయక కథలు పిల్లల ఈ మనస్త త్వానికి అనుగుణంగా ఉండటం వల్లనే ఇంతకాలం పిల్లల్నిలా ఆకర్షింపగల్గుతున్నాయి. అక్షర ప్రపంచంలోకి ఇంకా అడుగు పెట్టని బిడ్డ ఓ అమ్మమ్మ కథలో అద్భుత మైన మరో ప్రపంచాన్ని చూస్తుంది. అది తన వాస్తవ ప్రపంచం కంటె ఎంతో విస్తృతంగా ఉంటుంది. పిల్లలకు కథల్లో కన్పించే ఈ మరో ప్రపంచం గజిబిజిగా గందరగోళం ఉండదు. అందులో ఓ క్రమబద్దత ఉంటుంది. ఆ క్రమబద్ధతలోనే కొన్ని నైతిక విలువలుంటాయి. కానీ ఆ విలువలు మనం నమ్మే సాంప్రదాయకార్ధంలో ఉండవు. ఆ కథల్లో వంచితుడే గెలుస్తాడు. అయితే ఇలా గెలవడానికి వాడు కొన్ని పద్ధతులు పాటిస్తాడు. అవి అనైతికమైనవిగా మనకు సాంప్రదాయ కార్ధంలో కన్పించవచ్చు. ఆకలితో నకనకలాడే సింహానికి కుందేలు చెప్పిన అబద్దాలు ఇలాంటివి.

నూతన పదజాలం

కథలు చెప్పడం పిల్లల భాషా ప్రపంచాన్ని ఎలా విస్తృతం చేస్తుందో కూడా మనం చూడొచ్చు. మాటలు పూర్తిగా వ్యక్తిగత ఆస్తి. ఆమాటలతో ప్రపంచానికి మనం పేర్లు పెట్టే తీరు కూడా వ్యక్తిగతమైనదే. కానీ ఇదే పదజాలం సామాజిక ఆస్తి కూడా. ఎందుకంటే మన అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి ఈ మాటలే ఆధారం. పదాలకున్న ఈ వ్యక్తిగత, సామాజిక లక్షణాలే పదాల అర్ధాల్ని నిర్ధారిస్తాయి. ఉదాహరణకు పిల్లవాడికి 'ఆకలి' అంటే ఏమిటో అనుభవం నుంచి తెలుసు. దీన్నుండే సింహం 'ఆకలి'తో ఉన్నపుడు ఎలా ఉండి ఉంటుందో పిల్లవాడు గ్రహించగలడు. ఇలా 'ఆకలి' అనే తనకు తెలిసిన పదం సింహానికి కూడా వర్తింప చేసు

కొనేలా ఈ కథ శ్రోతకు సహకరిస్తుంది. మరికొన్ని కథలు వినే కొలదీ మరికొన్ని పదాల సామాజికార్ధాలు పిల్లలకు

తెలుస్తాయి. తన స్వంత పదజాలాన్ని ఇతరులకు వర్తింప జేసుకొనే క్రమం వేగిరమవుతుంది. తర్వాత 'చదవడం' లోకి వెళ్లే పిల్లలకు ఇది చాలా ఉపకరిస్తుంది.

పైన మనం చెప్పుకొన్న నాలుగు కథా ప్రయోజనాల్లోని అంశాలు చదవడానిక్కూడ వర్తిస్తాయి. పిల్లలు చదివేకొలదీ భాషా సూత్రాలను నిర్మాణాల్ని అర్ధం చేసుకో గల్గుతారు. ముందుగా ఊహించి చెప్పగల్గడం పెరిగే కొలదీ చదవడంలో సామర్ధ్యం పెరుగుతుంది. భాషా నిర్మాణంలో సూత్రాలతో పరిచయం పెరిగేకొద్దీ వాక్యంలో తర్వాత ఏమి వచ్చేదీ పిల్లలు గ్రహిస్తారు. ఇలా చూస్తే కథలు చెప్పడం పిల్లల భాషాజ్ఞానాన్ని పెంచడానికి అమోఘంగా ఉపకరిస్తుంది!

కథా నైపుణ్యం

కథలు చెప్పాలనుకొన్నపుడు మనకా కథ బాగా మనసుకు పట్టి ఉండాలి. అందులో తడబాటు ఏమీ ఉండకూడదు. తడబడితే మధ్యలో కొతుకు కన్పిస్తే కథను ఖూనీ చేసినట్టే లెక్క. బాగా మనసుకు పట్టిన కథ అయితే మనం సాఫీగా చెప్పగలం. అలా చెప్పగల్గినప్పుడే కథ చెప్పేవాడికీ వినేవారికీ మధ్య ఒక సజీవ సంబంధం ఉంటుంది.

అలాగే కథ మన మనసుకు బాగా ఉంటే ఆ కథకు సంబంధించిన ఒక జ్ఞాపకం మన మనస్సులో ఉంటుంది. అప్పుడు శ్రోత పరిస్థితిని బట్టి మనం ఇష్టం వచ్చినట్లు కథను మార్చుకోగలం. ఒక్కోసారి కథను పెంచాల్సి వస్తుంది. ఒక్కోసారి తగ్గించాల్సి వస్తుంది. కుందేలు సింహం ముందు నిలబడ్డప్పుడు కథను మనం సాగదీయ్యలేం. అక్కడే వేగంగా కథ నడవాలి. సింహం ఆకలితో నకనకలాడుతూ ఆలోచిస్తున్నప్పుడు కథను మనం నెమ్మదిగా చెప్పొచ్చు. అలాగే కుందేలు భయం భయంగా తన ఎత్తుగడను నెమరేసుకొంటూ అడవిలోంచి వస్తున్నపుడు కథను అంత వేగంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇదంతా మనకు కథ మీద ఉన్న పట్టునుబట్టి ఉంటుంది.

ఇక కథలోని సంభాషణల సంగతేమిటి? వాటి నెలా చెప్పాలి అనే ప్రశ్నలున్నాయి. దీనికి మనం పలు మార్గాల్ని ఎన్నుకోవచ్చు. రెండు పాత్రల మాటల్ని రెండు రకాల స్వరాలతో పలకొచ్చు. హావభావాల్ని ప్రదర్శిస్తూ చెప్పొచ్చు. చిన్న సైజు తోలుబొమ్మల్ని ఆడిస్తూ చెప్పడం వల్ల సంభాషణలు చాల రక్తి కడతాయి. ఒక్కో పాత్రను గురించి చెపుతున్నపుడు తరగతి గదికి ఈవైపు నుంచి ఆ వైపుకు పచార్లు చేస్తూ చెప్పొచ్చు. ఇలా ఎన్నో సృజనాత్మక పద్ధతుల్ని పాటించవచ్చు. ఇవన్నీ పిల్లలకు చాలా ఉత్తేజాన్నిస్తాయి. ఒకే కథను ఒకే సంవత్సరంలో పలుసార్లు చెప్పాల్సి రావచ్చు. దీనికి తగ్గట్టుగా మనం తయారు కావాలి. ఒక కళగా కథా కథనాన్ని అధ్యయనం చెయ్యాలి. అలవర్చుకోవాలి. ఇది ప్రతి టీచరుకూ ఒక తప్పనిసరి సవాలు.

కథలు చెప్పడం తన జీవితంలో విడదీయరాని భాగమైతే ఏ టీచరు జీవితమూ నిస్సారంగా ఉండదని నా గట్టి నమ్మకం. ఇది జరగాలంటే ప్రాథమిక పాఠశాలల పాఠ్యాంశాల పట్ల మన దృక్పథంలో కూడా తీవ్రమైన మార్పు రావాలని నా దృఢ విశ్వాసం.

- ప్రొఫెసర్ కృష్ణకుమార్‌

ఢిల్లీ