Jump to content

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?/భాషాబోధనలో చతుర్విధ నైపుణ్యాలు- కొన్ని మార్గాలు

వికీసోర్స్ నుండి

భాషా బోధనలో భిన్న చతుర్విధ

నైపుణ్యాలు - కొన్ని మార్గాలు

పిల్లల అభివృద్దికి భాష ఎంతో దోహదం చేస్తుందని నేడు మనస్తత్వ శాస్త్రజ్ఞులంతా అంగీకరిస్తున్నారు. భాష నేర్చుకోవడలో ఎవ్వరూ వెనకబడరని విద్యావేత్తలు అంగీకరిస్తున్నారు.

అంగీకారాలైతే ఉన్నాయి కాని మన పిల్లలందరూ భాషలో వెనకబడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది. కొంచెం మనసు పెట్టితే దీనికి పరిష్కారం దొరుకుతుంది.

అయితే దీనిక్కావల్సింది పిల్లలతో స్నేహంగా మెలగడం. 'బాబోయ్ బడి' అన్పించకుండా ఉండటం.

ఇప్పుడు మనం చతుర్విధ నైపుణ్యాల అభివృద్ధికి కొన్ని మార్గాలు చూద్దాం.

శ్రవణం

● పిల్లలందరిని గుండ్రంగా కూర్చోబెట్టి, ఒక్క నిమిషంబాటు కళ్లు మూసుకోమనాలి. కళ్ళు తెరిచిన తర్వాత ఒక్కొరొక్కరిగా వాళ్ళు చిన్న శబ్దాలని చెప్పమనాలి. ఇక్కడ మనం గమనించేదే మంటే చాలామంది పిల్లలు పెద్దలు వినపడ్డ శబ్దాలు అంటే బయట బస్సు వెళ్ళే చప్పుడు లాంటివి మాత్రం చెప్పగలరు. చాలా తక్కువ మంది చిన్న, సూక్ష్మమైన శబ్దాలని, అడుగుల చప్పుడులాంటివి చెప్పగలరు. అయితే ఇదే కృత్యాన్ని మరికొన్నిసార్లు చేయడం వలన వారు అతి సూక్ష్మమైన శబ్దాల్నిగుర్తించి చెప్పగలిగేలా చేయొచ్చు.

● మూడు సమాన డబ్బాలలో ఒకదానిలో గులకరాళ్ళు, రెండవ దానిలో సన్నని ఇసుక వేయాలి. మూడవదానిని ఖాళీగా ఉంచాలి. టీచరు ఒక్కొక్క డబ్బాని ఊపుతూ శబ్దాన్ని వినమనాలి. మూడు డబ్బాల శబ్దాలలోని తేడాలను గుర్తించమనాలి. తరువాత మూడు డబ్బాలు పిల్లలకిచ్చి శబ్దాల ఆరోహణ, అవరోహణ క్రమంలో వాటిని పేర్చ మనాలి.

గమనిక : డబ్బాలకు ఒకే రకమైన రంగు కాగితం అంటించితే శబ్దంపై పిల్లల దృష్టి నిరుస్తుంది.

భాషణం

● కబుర్లు : పిల్లలతో కబుర్లు చెప్పటం. రెండు రకాలుగా చేయొచ్చు. అ) స్వేచ్ఛా సంభాషణ, ఆ) మార్గదర్శక సంభాషణ. సరదా అయిన కబుర్ల నుంచి మనం ఆ రోజు వారికి చెప్పదలుచుకొన్న విషయం అంటే పూలు, పండ్లు, జంతువులు లాంటి వాటిపైకి సంభాషణను మళ్ళించడం.

● పిల్లలకు కొన్ని వస్తువుల, ఫ్లాష్‌కార్డు, చిత్రపటాలు చూపించి వాటిని గూర్చి మాట్లాడించడం.

● భావ వ్యక్తీకరణ, కథలు చెప్పించడం, నాటకీయం.

● పద నిర్మాణ కృత్యాలు (పదబంధాలు, సామీప్యత ఉన్న శబ్దాలున్న పదాలు, గొలుసు పదాలు, పదాల పట్టిక పదానుబంధ పదాలు వగైరా.)

● సూచనలిచ్చి పేర్లు చెప్పించడం (పొడుపు కథలు).

పఠనం

చదివే అభిలాష పిల్లల్లో పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ముందు చదువులకు బాగా ఉపయోగపడుతుంది. కన్పించిన ప్రతిదీ చదవాలనే కోరిక పిల్లల్లో కల్పించినననాడు జ్ఞానాత్మక రంగంలో వారి అభివృద్ధికి అవధులుండవు.

అయితే అక్షరాలు నేర్వకముందే పిల్లల్లో పఠనా కౌశలాన్ని క్రింది విధంగా పెంచవచ్చు.

● చిత్రపటాల్ని చదవటం. పిల్లలకు కోపం, ఆనందం మొదలగు భావాలను తెలిపే చిత్రపటాలను చూపించి వారికి తెలిసినవి చెప్పమనాలి (పై చిత్రాలను పాత పుస్తకాలు, పేపర్ల నుండి సేకరించవచ్చు.)

● రకరకాల కథల పుస్తకాలను పిల్లలకు ఇవ్వాలి.

● క్రమబద్ధమైన ఆలోచన.

ఎదుటివారికి తాము స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పడానికి మాటలు సరైన పద్ధతిలో వ్యక్తం చేయాలి. దీనికై ముందుగా వారికి క్రమపద్ధతిలో ఆలోచించడం నేర్పించాలి. కథలోని వివిధ సన్నివేశాలను కార్డులుగా చేసి లేదా ఒక పని చేయడంలోని వివిధ దశలను ఫ్లాష్‌కార్డులుగా చేసి లేదా ఒక పని చేయడంలోని వివిధ దశలను ఫ్లాష్‌కార్డుల రూపంలో తయారు చేసి వాటిని పిల్లలకు ఇచ్చి క్రమంగా అమర్చమనాలి. ఇలాంటి వాటిద్వారా వారిలో క్రమబద్ధంగా ఆలోచించడం నేర్పించాలి.

లేఖనం

రాయడం అనేది పిల్లలకు మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. రాయడానికి ముందు సంసిద్ధత ఎంతైనా అవసరం. ఇందుకు కారణం వారి చేతి వేలి కండరాలు సమన్వయంగా పని చేయలేకపోవడమే. అయితే ఈ సమన్వయాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ సృజనాత్మక కార్యకలాపాలను సంసిద్ధతా కార్య క్రమాలుగా పిల్లలకు ఇవ్వాలి.

ఉదాహరణకి:

● బంక మట్టితో బొమ్మలు చేయడం.

● ఇసుకలో ఆటలు. పాత డబ్బాలు, ప్లాస్టిక్ మూతలు, కొబ్బరి డొల్లలు ఇందుకోసం వాడుకోవచ్చు. తడి ఇసుకతో వివిధ ఆకారాలను చేయడం, జల్లెడ పట్టడం లాంటివి.

● బొగ్గు/సుద్దతో బొమ్మలు గీయడం, గీసిన బొమ్మలపై రాళ్ళు, ఆలుచిప్పలు, విత్తనాలు మొదలైన వాటిని పేర్చడం.

● పాత న్యూస్ పేపరు, ఛార్టుపైన బొమ్మలు గీయించడం. దీనిని రంగులతో నింపడం. పాత న్యూస్ పేపరు/రంగు కాగితాలను పిల్లలకు ఇచ్చి వివిధ ఆకారాలలో చింపించడం, వాటిని ఛార్టుపైన వేసిన బొమ్మల ఆకారాలపై అతికించడం.

● చుక్కలు కలిపితే వివిధ ఆకారాలు తయారయేలా చేసి చుక్కలను కలపమని పిల్లలకు ఇవ్వడం.

● రెండు సమాంతర రేఖల మధ్య ఒక గీతను గీయమనడం.

● సున్నాలను చుట్టమని చెప్పడం, గీతలు గీయమనడం.

● ఆకులను, నాణాలను, బెరడు అచ్చులను పేపరు క్రింద పెట్టి వాటి అచ్చులను రుద్దించడం.

పైవన్నీ చేయడం ద్వారా వారి వేళ్ల పటుత్వం పెరిగి రాయడానికి సిద్దమవుతాయి. వారిలో రాయడానికి ఇష్టపడే అవకాశం పెరుగుతుంది.

ఇక్కడ సూచించిన కృత్యాలు మచ్చుకు మాత్రమే. ఇలాంటివి మరిన్ని కృత్యాలు తయారు చేసుకొని, పిల్లల్లో భాషపై మక్కువ ఎంతైనా మనం పెంచవచ్చు.

- సుబాషిణి

ఇ.సి.ఇ. కో-ఆర్డినేటర్, డి.పి.ఇ.పి.